ఇది ప్రజాస్వామ్యమా..? రెడ్‌ బుక్‌ రాజ్యాంగమా?

ఏ రాష్ట్రంలోనైనా  ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం చూశామా?

కుప్పంలోనే ఇలా జరుగుతుందంటే..రాష్ట్రంలో మహిళల ప‌రిస్థితి ఏంటి?

మహిళలపై అఘాయిత్యాలు చేస్తే వాళ్ళకు అదే చివరి రోజు అన్న చంద్ర‌బాబు. ఇప్పుడేం సమాధానం చెబుతారు

పవన్‌ కళ్యాణ్ చూస్తున్నారా.. మహిళా రక్షణ ఇదేనా?

బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించే తీరిక కూడా హోం మంత్రికి లేదా?  

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

చిత్తూరు:  చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి కొట్టారంటే  ఇది ప్రజాస్వామ్యమా లేక రెడ్‌ బుక్‌ రాజ్యాంగమా అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. , ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరుగుతుందా, ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం ఎక్కడైనా చూశామా అని ప్ర‌శ్నించారు.  టీడీపీ నాయకుడే మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత దారుణమ‌న్నారు.  కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త ఘటనను మాజీ మంత్రి ఆర్‌ కే రోజా తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా ఏమ‌న్నారంటే..
`చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది ప్రజాస్వామ్యామా? రెడ్‌బుక్‌ రాజ్యమా అనే అనుమానం కలిగే విధంగా  రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలు, బాలికలపై దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, చెట్టుకు కట్టేసి కొట్టడం..ఇది ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే జరుగుతుందంటే ఇక్కడ చంద్రబాబు గానీ, పవన్‌ కళ్యాణ్‌ గానీ, హోం మంత్రి అనితా మహిళల పట్ల ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, మహిళల రక్షణను ఎలా గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతోంది.

అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా?
అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి..చంద్రబాబు అంటారు..ఎవరైనా అడపిల్లల జోలికి వస్తే అదే వాళ్లకు చివరి రోజు అవుతుందని అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మీరు ఏం చర్యలు చేపట్టారు. వీళ్లకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన టీడీపీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? అతనికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది. కొడుకు ముందు అమ్మను కట్టేసి కొట్టారంటే ఈ రోజు పోలీసులను చూసినా భయం లేదు. చంద్రబాబును, హోం మంత్రిని చూసినా మీ పార్టీ వాళ్లకు భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్‌ చెప్పినట్లు ఎవరు ఎక్కువగా హింస చేస్తే, ఎవరు ఎక్కువ దాడులు చేస్తే మీ గుడ్‌లుక్స్‌లో ఉండొచ్చు అన్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా అరాచకం సృష్టిస్తున్నారు. 

సిగ్గుచేటు
రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలపై జరిగే దాడులను అరికట్టలేకపోతున్నారంటే అనిత నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో చిన్న  అమ్మాయిని 14 మంది కలిసి రేప్‌ చేస్తే కనీసం ఆవిడ వెళ్లి పలకరించలేదు.అనంతపురంలో ఒక గిరిజన ఇంటర్‌ మీడియట్‌ స్టూడెంట్‌ను చంపేశాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టారా?. ఎన్నికల తరువాత మాత్రం ఆవిడ గొప్పగా చెప్పింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలంతా గుండెలపై చేతులు పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని భారీ డైలాగ్‌ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పండుకునే పరిస్థితి లేదు. ఈ రోజు హోం మంత్రి సెల్‌ఫోన్‌లో వీడియో కాల్‌ చేసి బాధిత మహిళను పరామర్శిస్తుందంటే ఆవిడ అహంకారానికి నిదర్శనం కాదా?. మహిళలకు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత హోంమంత్రికి ఉంటుంది. ఇంతకంటే ఏదో పని ఉన్నట్లు బిజీబిజీగా ఉంటున్నట్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం లేదు. తప్పు చేసిన వారిని అరెస్టు చేయించాలన్న చిత్తశుద్ధి ఈవిడకు లేదు. 

టోటల్‌ ఫెయిల్యూర్‌ కాదా? 
సాక్షి మీడియా కుప్పం ఘటనను వెలుగులోకి తెచ్చేవరకు ఇటు చంద్రబాబు కానీ, అటు హోం మంత్రికి గానీ విషయం తెలియదు. చర్యలు చేపట్టలేదంటే అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా?. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి టోటల్‌ ఫెయిల్యూర్‌ కాదా?. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుంది. మహిళల భద్రతకు సంబంధించి ఏ రోజైనా ఒక కమిటీ వేసి ముఖ్యమైన నాయకులు సమీక్ష చేశారా?. మహిళలంటే అంత చిన్నచూపా? ఓట్లు వేయించుకోవడానికి మహిళలు కావాలి. కానీ వాళ్లకు రక్షణ ఇవ్వడానికి, వారికి సంక్షేమం అందించడానికి మాత్రం వాళ్లు మనుషులుగా మీరు పరిగణలోకి తీసుకోరు.ఇప్పటికైనా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్, అనిత రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ముందు ఆడపిల్లలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోండి. తప్పుచేసిన వాడు తెలుగు దేశం పార్టీ వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి. అంతేగానీ టీవీల ముందు కూర్చొని చంద్రబాబు చెప్పాడని వైయస్‌ జగన్, భారతమ్మను తిట్టడానికి , సాక్షి మీడియా మీద కేసులు పెట్టడానికి టైమ్‌ ఉన్న హోం మంత్రికి నేరస్తులను శిక్షించేందుకు సమయం లేదా’ అని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు. 
 

Back to Top