ఫేక్‌ సొసైటీతో జోజినగర్‌లో భూకబ్జాకు కుట్ర

1981 నాటి డేట్‌తో 2016లో సొసైటీ ఏర్పాటు

అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే ఉంది

ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా 42 ఇళ్లు కూల్చివేత

అందుకే ఇందులో కూటమి పెద్దల కుట్ర

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

విజయవాడలోని భవానీపురం, జోజినగర్‌ సందర్శించి, అక్కడ ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించిన మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.

జోజినగర్‌ ఇళ్లు కూల్చివేతపై సీబీఐ విచారణ జరగాలి

:శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌

ఆ ఇళ్ల కూల్చివేతకు సీఎం, ఆయన కుమారుడు..

స్థానిక ఎంపీ, స్థానిక కార్పొరేటర్‌ సోదరుడే కారణం

సీబీఐ విచారణతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి

జోజినగర్‌ బాధితుల బ్యాంక్‌ రుణాలు ప్రభుత్వం చెల్లించాలి

ఆ 42 కుటుంబాలకు ప్రభుత్వమే ఇళ్లన్నీ కట్టించి ఇవ్వాలి

తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌

పేదలకు ఏ ప్రభుత్వమైనా అండగా నిలబడాలి

కానీ, ఇక్కడ ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా పిటిషన్లు

:శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

జోజినగర్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి

లేని పక్షంలో మా ప్రభుత్వం రాగానే విచారణ తథ్యం 

ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతాం

జోజినగర్‌ బాధితులకు పూర్తి అండగా నిలబడతాం

వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుంది

శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి 

విజయవాడ: విజయవాడ నడిబొడ్డున ఖరీదైన భవానీపురం, జోజినగర్‌లో భూకబ్జాపై, 2016లోనే కన్నేశారని, అందుకే అప్పుడు 1981 నాటి డేట్‌తో ఒక ఫేక్‌ సొసైటీ ఏర్పాటు చేశారని మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు ఏకంగా జోజినగర్‌లో 42 ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని, కాబట్టి ఇందులో కూటమి పెద్దల కుట్ర స్పష్టంగా తేలుతోందని వెల్లడించారు. అందుకే జోజినగర్‌లో ఇళ్ల కూల్చివేతపై సీబీఐ విచారణ జరగాలని శ్రీ వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. అప్పుడే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తేల్చి చెప్పారు.
    జోజినగర్‌ బాధితుల బ్యాంక్‌ రుణాలు ప్రభుత్వమే చెల్లించాలని, కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి  ఇళ్లన్నీ కట్టించి ఇవ్వాలని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి, ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామని వెల్లడించారు. జోజినగర్‌ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని ప్రకటించారు.
    బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న శ్రీ వైయస్‌ జగన్, నేరుగా విజయవాడ, భవానీపురం జోజినగర్‌ వెళ్లారు. అక్కడ ఇటీవల 42 ఇళ్లు కూల్చివేయగా, రోడ్డున పడ్డ ఆ కుటుంబాల బాధితులను ఆయన పరామర్శించారు. కోర్టు ఉత్తర్వులున్నా, ఏకపక్షంగా తమ ఇళ్లు కూల్చివేశారని, ఎంత చెప్పినా వినకుండా, పోలీసులు తమ బ్రతుకులు రోడ్డు పాల్జేశారని వారు గోడు వెళ్లబోసుకున్నారు. వారి అంతులేని ఆవేదన, బాధలన్నీ సావధానంగా విన్న శ్రీ వైయస్‌ జగన్‌ ఓదార్పునిచ్చారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

అధికార దుర్వినియోనికి పరాకాష్ట:
    విజయవాడ, భవానీపురం జోజినగర్‌ ఇళ్లు కూల్చివేత అధికార దుర్వినియోగానికి పరాకాష్ణ. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు కూల్చివేత దారుణం. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు, స్థానిక జనసేన కార్పొరేటర్‌ సోదరుడి ప్రమేయం ఉంది. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు ఎలా కూల్చేస్తారు? పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేయడం దుర్మార్గం. 

ప్రభుత్వ పెద్దల అండతోనే కూల్చివేతలు:
    విజయవాడ జోజినగర్‌ లో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు 25 ఏళ్ల నుంచి ఇళ్లు కట్టుకుని ఉంటే, ఒకేసారి వచ్చి ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టులో ఈ స్థలం గురించి న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. డిసెంబరు 31 వరకు, 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఒకవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా,  ఈనెల 31 వరకు ఊరట ఉండగానే, ఒకేసారి 200 మందికి పైగా పోలీసులు వచ్చి, ప్రై వేటు పార్టీకి మద్దతు తెలుపుతూ, ఈ 42 ఇళ్లకు సంబంధించిన వారిని నిర్దాక్షిణ్యంగా, వాళ్లు ఇళ్లలో ఉండగానే, ఇళ్లన్నీ పడగొట్టి రోడ్డున పడేశారు.
    ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి సహకారం, వారి ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది. అందుకే ఇంత అకస్మాత్తుగా. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని తెలిసినా కూడా, అధికార దుర్వినియోగం చేస్తూ, వీరిని రోడ్డు పాల్జేశారు.

ఫేక్‌ సొసైటీ ఏర్పాటు:
    ఇక్కడ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి చూస్తే, దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.150 కోట్లకు పైగానే. దీంట్లోకి ప్రై వేటు వ్యక్తులు వచ్చారు. 2016లో ఒక ఫేక్‌ సొసైటీ పెట్టారు. అప్పుడు కూడా సీఎం చంద్రబాబు. 1981 డేట్‌లో ఒక తప్పుడు సొసైటీ ఏర్పాటు చేసి, ఈ ప్రాంతాన్ని కబ్జా చేయడానికి కుట్ర చేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్‌ సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉంది. ఇది విచ్చలవిడి అధికార దుర్వినియోగం. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా, 200 మంది పోలీసులు వచ్చి, ఇంత మందిని రోడ్డు పాల్జేశారు. 

అన్ని అనుమతులు ఎలా ఇచ్చారు?:
    ఈ 2 ఎకరాల 17 సెంట్లలో 2001కి ముందు నుంచి వీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇందులో చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. వాటికి విజయవాడ మున్పిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి కూడా ఇచ్చింది. ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజీ కనెక్షన్లు కూడా ఉన్నాయి. అన్నింటికీ అన్ని అనుమతులు ఉన్నాయి. బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి. చాలా మంది లోన్‌లో ఇళ్లు కట్టుకున్నారు.
    మరి ఇక్కడ స్థలాలు వేరేవారివైతే, ఎలా అనుమతి ఇచ్చారు? ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారు? బిల్డింగ్‌ ప్లాన్‌ ఎలా అనుమతించారు? బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి? వాటర్, పవర్‌ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? ఇన్ని ఉన్నా, ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా, ప్రై వేటు వ్యక్తులకు మద్దతు ఇస్తూ, పోలీసులు వచ్చి, జేసీబీలతో ఇళ్లు ఎలా కూల్చేశారు? గతంలో ఇక్కడ ఇళ్ల క్రయ, విక్రయాలు జరిగినప్పుడు, పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని. కానీ, ఎవరూ, ఎక్కడా అభ్యంతరాలు రాలేదు.
    అయినా, ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకు పోలీసులు ఇళ్లు కూల్చేశారు. అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? ఇక్కడి వారు సీఎం చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను మూడుసార్లు కలిశారు. ఎవరికైతే వీరు అర్జీలు ఇచ్చారో.. వారే కుట్ర పన్ని, వీళ్లకు అన్యాయం చేశారు.

సీబీఐతో విచారణ జరిపించాలి:
    ఇక్కడే కాదు. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోంది. అనేక చోట్ల.. ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే, టీడీపీ నాయకులు ఎంటర్‌ అవుతున్నారు. ల్యాండ్‌ కబ్జా చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల వారే స్వయంగా లిటిగేషన్లు పెట్టి, కబ్జా చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్‌ ఎలా, ఏం చేస్తున్నారో.. ప్రజలకు తెలియాలి.
    ఇక్కడ 1981 డేట్‌తో ఫేక్‌ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అది కూడా బయటకు రావాలి. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి, వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేసింది. అందుకే ఇక్కడి మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి.

లోన్లు చెల్లించాలి. ఇళ్లు కట్టించాలి:
    ఇక్కడ 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వారికి బ్యాంక్‌ లోన్లు కూడా ఉన్నాయి. కానీ ఇళ్లు ఇప్పుడు లేవు. అందుకే ప్రభుత్వం ముందుకు రావాలి. వీరి బ్యాంక్‌ల రుణాలు ప్రభుత్వమే కట్టాలి. వీరందరికి ఇక్కడ కానీ, మరెక్కడైనా కానీ, పక్కాగా ఇళ్లు కట్టించాలి.

బాధితులకు అండగా ఉంటాం:
    అయ్యా చంద్రబాబుగారూ, మీరు ఈ పని చేయకపోతే.. రేపు మా ప్రభుత్వం రాగానే, విచారణ జరిపిస్తాం. దోషులను కోర్టు ముందు నిలబెడతాం. ఇంకా ఇక్కడి బాధితులందరికీ తోడుగా నిలబడతాం. బాధితులకు ఇదే మీ జగనన్న మాట అని హామీ ఇస్తున్నాను.
    ఇంకా సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ బాధితుల తరపున వాదించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని శ్రీ వైయస్‌.జగన్‌ వివరించారు.

Back to Top