

















వైయస్ఆర్‌సీపీ నేతలు విడదల రజిని, కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ
పల్నాడు: పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం కచ్చితంగా పల్నాడుకు వస్తారని వైయస్ఆర్‌సీపీ నేతలు విడదల రజిని, కాసు మహేష్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ పర్యటనకు భద్రత కల్పించాలంటూ పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం నరసరావుపేటలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్ చార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి.
వైయస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి భయంతో కూటమి సర్కార్ వణికిపోతోందని మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్ చార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిలు మండిపడ్డారు. వైయస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి పోలీస్ భద్రత కల్పించాలని నరసరావుపేటలోని జిల్లా ఎస్సీని కలిసారు. అనంతరం వారు ఎస్పీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం అనుమతుల పేరుతో పోలీసుల ద్వారా ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి, బాధతో ఉన్న కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెడుతుండటాన్ని కూడా రాజకీయంగా చూడటం దారుణమని అన్నారు.
ఇంకా వారేమన్నారంటే...
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ పొదిలి పర్యటన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం బయటకొస్తే ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందనే భయం కనిపిస్తోంది. ఆ భయంతోనే ప్రతిపక్ష నేత పర్యటన కోసం బయటకు వస్తానంటే పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు. దేశంలోనే మాస్ లీడర్ లలో ఒకరైన వైయస్ జగన్ వస్తుంటే, కేవలం 100 మందినే అనుమతిస్తామని పోలీసులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. భద్రతా కారణాలను సాకుగా చూపించి ఆయన పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారు. అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పార్టీగా ఇప్పటికే మూడుసార్లు అనుమతుల కోసం పోలీసులను కలవడం జరిగింది. బుధవారం పర్యటన కోసం మళ్లీ ఈరోజు మరోసారి పల్నాడు వైయస్సార్సీపీ నాయకులమంతా జిల్లా ఎస్పీని కలవడం జరిగింది. మా నాయకులు జగన్ పర్యటనకు ప్రత్యేక వాహనాలు కేటాయించి కార్యకర్తలను తరలించబోమని, తాడేపల్లిలో బయల్దేరిన వైయస్ జగన్ కాన్వాయ్ ఎక్కడా ఆపకుండా నేరుగా నాగమల్లేశ్వరరావు ఇంటికే చేరుకుంటుందని ఎస్పీకి స్పష్టంగా చెప్పాం. అయినా అనుమతిచ్చేది లేనిదీ ఆలోచించి చెబుతామన్నారు. పోలీసులు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా, ఆరునూరైనా వైయస్ జగన్ పల్నాడు పర్యటన కొనసాగుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నాసరే, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సత్తెనపల్లి చేరుకుని నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఒకసారి మాటిచ్చిన తర్వాత ఆయన వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. పోలీసులు అనుమతిచ్చినా లేకపోయినా వైయస్ జగన్ ఒక్కరైనా రెంటపాళ్ల వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి తీరుతారు.