అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని, పోలీస్ యాక్ట్–30 పేరుతో అడ్డగోలు ఆంక్షలు విధిస్తున్నారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆక్షేపించారు. మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటనలపై తీవ్రంగా భయపడుతున్న ప్రభుత్వం, ఎలాగైనా ఆయనను నివారించాలని కుట్ర చేస్తోందని అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సాకె శైలజానాథ్ చెప్పారు. సాకె శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: రెగ్యులేషన్ చట్టం దుర్వినియోగం: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పరిపాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చ జరగడం కూడా ఈ ప్రభుత్వానికి ఇష్టం ఉండటం లేదు. నిన్న నేను శింగనమల పర్యటనకు వెళ్తుంటే పోలీస్ యాక్టు–30 అమల్లో ఉందని అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. రెగ్యులేషన్ అమలు చేయడానికి ప్రయోగించే పోలీస్ యాక్ట్–30ని ప్రతిపక్ష నాయకుల పర్యటనలపై నిషేధాజ్ఞలు అమలు చేయడానికి వాడుకుంటున్నారు. బ్రిటీష్ కాలం, 1861 నుంచి అమల్లో ఉన్న ఈ చట్టాన్ని ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ నాయకుల పర్యటనలను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం వాడుకుంటోంది. బ్రిటీష్ ప్రభుత్వంలో ఈ చట్టం అమల్లో ఉన్నా ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. కానీ అంతకన్నా దారుణంగా ఈ చట్టాన్ని ఏపీలో అమలు చేస్తూ వైయస్ఆర్‌సీపీ నాయకులను నిర్బంధిస్తున్నారు. జగన్ పర్యటనలపై అంటే భయం: పొగాకు రైతుల పరామర్శ కోసం వైయస్ జగన్ ఇటీవల పొదిలిలో పర్యటిస్తే, అక్కడ ప్రజాదరణ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైంది. అందుకే ఆయన బుధవారం పల్నాడు జిల్లా పర్యటనకు సిద్ధమైతే, విపరీతమైన ఆంక్షలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కేవలం మూడు వాహనాలు, 100 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంత కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్‌గారు వెళ్తుంటే, చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. జగన్‌గారు వస్తున్నారంటే వేలల్లో అభిమానులు తరలి వస్తారు. ఆయన పర్యటనల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. కానీ, అందుకు భిన్నంగా ఆంక్షలతో అడ్డుకోవాలని చూడడం దుర్మార్గం. అక్కడా ఈ నిబంధనలు వర్తిస్తాయా?: ఈనెల 21న విశాఖలో నిర్వహించబోయే యోగా డేలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని ప్రభుత్వమే చెబుతోంది. మరి ఆ కార్యక్రమానికీ ఇవే నిబంధనలు అమలు చేస్తున్నారా? దీనికి రాష్ట్ర డీజీపీ, శాంతి భద్రతల మంత్రిత్వ శాఖ చూస్తున్న సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానంగా వర్తించాలి కదా? ఈ వ్యవహారశైలి ఎందుకు? రెగ్యులేషన్‌కు వాడుకోవాల్సిన నిబంధనను పూర్తి నిర్బంధంగా మార్చేయడం దౌర్భాగ్యం. పరామర్శలపైనా పోలీసుల ఆంక్షలు సిగ్గుచేటు: మొన్నటికి మొన్న రామగిరి మండలంలో బాలిక మీద సామూహిక అత్యాచారం జరిగితే, పరామర్శకు బయలుదేరితే అడ్డుకున్నారు. ఏడుగుర్రాలపల్లిలో బాలికను అతి కిరాతకంగా చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బయల్దేరితే వెళ్లనీయలేదు. చివరకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా వేరే ప్రాంతానికి మార్చుకోవాలని పోలీసులు చెబుతున్నారంటే, వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రజల్లోకి వస్తుంటే ఈ ప్రభుత్వం ఎంతగా భయపడిపోతుందో వేరే చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయి: రాష్ట్రంలో రోజూ ఏదో ఒక మూలన దారుణాలు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు గాడి తప్పాయి. తీసుకున్న అప్పు చెల్లించలేదనే కారణంతో కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తెనాలిలో యువకులను పోలీసులే నడిరోడ్డు మీద దారుణంగా కాళ్లు వాచిపోయేలా కొట్టారు. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు తనను తీవ్రంగా కొట్టి వేధిస్తున్నారని మా పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్‌మెన్ మదన్‌రెడ్డి ఏకంగా డీజీపీకే లేఖ రాశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.