గుంటూరు: వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమానికి గుంటూరులో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇటువంటి ప్రజా పోరాటాన్ని మొట్టమొదటి సారిగా రాష్ట్రం చూస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం నియంతృత్వ పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే వాటిని అడ్డుకునేందుకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు ఈ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి తీసుకురాలేదు. అందుకే ప్రజలు విసుగుతో సంతకాల ఉద్యమానికి ముందుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు పోర్టులు, మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దోచుకోవడం దాచుకోవడమే వారి పనిగా చేసుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. వైయస్ జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే వాటిని నిలిపివేసిందని రోజా ఆరోపించారు. గాడిద పాలు కడవెడు ఉన్నా,గంగిగోవుపాలు గరిటెడు చాలు అన్న చందంగా చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. రెండు లక్షల అరవైవేల కోట్లు అప్పులు చేసిన నీకు, నాలుగు వేల కోట్లతో హైదరాబాద్ కట్టిన వాడికి నాలుగువేల కోట్లు లేవా. ఈరోజు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు అంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమీషన్లు ఇస్తామంటే బినామీలకు అంటగట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారు. జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇంకా నిస్సిగ్గుగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు చెంపపెట్టు అవుతుందని రాంబాబు మండిపడ్డారు. ఈ సమావేశంలో గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు పాల్గొని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు కలిగే నష్టాన్ని వివరించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గ్రామ గ్రామాన కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆమె పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి పార్వతి , విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎంఎల్సీ హనుమొంతరావు, పొన్నూరు నియోజకవర్గం ఇంచార్జ్ అంబటి మురళి , తాడికొండ నియోజకవర్గం ఇంచార్జ్ బాల వజ్రబాబు, మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వేమారెడ్డి , రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ , నిమకాయల రాజానారాయణ తదితరులు పాల్గొన్నారు.