చిలుకలూరిపేట: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో గిట్టుబాటు ధరలు లేక, పంటలు అమ్ముకోలేని స్థితిలో అప్పులపాలై ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. చిలుకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధితు కుటుంబాలను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఇద్దరు రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... నాదెండ్ల మండలంలో గోపాలరావు, ఆదినారాయణ అనే ఇద్దరు రైతులు ఆత్మహత్మలు చేస్తున్నారు. నాదెండ్లలోనే వీరు వ్యసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ ఏడాది వారు పండించిన మిర్చి, పత్తి, పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ఆర్థికంగా నష్టపోయి, అప్పుల పాలై చివరికి వారు బలవన్మరణంకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిన మరణాలు ఇవి. ఏడాది కాలంగా ఏ ఒక్క పంటకూ కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులు ధరల కోసం రోడ్డెక్కినా కూడా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. ఇటీవలే వైయస్ జగన్ గుంటూరు మిర్చియార్డ్, పొదిలి పొగాకూ వేలం కేంద్రాలను సందర్శించి రైతుల గోడుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. గిట్టుబాటుధర కల్పించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులను ఆదుకుంటున్నామంటూ మాయమాటలు చెప్పి, తరువాత పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నేడు నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఉంటే, వారు ఈ రోజు ఇలా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేదా? మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. వైయస్ జగన్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, పంటలు నష్టపోయే సమయంలో తక్షణం పరిహారం చెల్లించడం, పెట్టుబడి సాయంను అందించడం ద్వారా వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చర్యలు తీసుకున్నారు. రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం ద్వారా రైతుకు అండగా నిలబడ్డారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నారు. కుప్పం ఘటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి కుప్పంలో అప్పు వసూలు కోసం స్థానిక టీడీపీ నాయకుడు ఓ మహిళను చెట్టుకు కట్టేసి, ఎలా హింసించారో ప్రజలంతా చూశారు. ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మహిళలపై అడుగడుగునా అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దిశాయాప్, దిశా పోలీస్ స్టేషన్లను కుట్రపూరితంగా తీసేశారు. దీనితో మహిళలకు ఎటువంటి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. తన నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణంపై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలి. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారు.