పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి

కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ. మొత్తం రిగ్గింగ్‌ 

వైయస్సార్‌పీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ప్రక్రియ

ఎక్కడికక్కడ ఏజెంట్‌ ఫామ్స్‌ చించేపి టీడీపీ దౌర్జన్యం

పోలింగ్‌ కేంద్రాల నుంచి మా పారీ ఏజెంట్ల తరిమివేత

పోలీసుల సహకారంతోనే అధికార పార్టీ దౌర్జన్యకాండ

వైయస్‌ జగన్‌ వెల్లడి

పులివెందుల జడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలు

ఆయా చోట్ల భద్రత పేరుతో 700 మంది పోలీసులు

ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద 400 మంది టీడీపీ కార్యకర్తలు

అలా దాదాపు 8 వేల మంది టీడీపీ కార్యకర్తల రాక

ఇటు పోలీసులు. అటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు

అంటే ఓటరుకు ఒక రౌడీ చొప్పున మొహరింపు 

అంతా కలిసి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులు

మరి దీన్ని ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికలు అంటారా?

సూటిగా ప్రశ్నించిన వైయస్‌ జగన్‌ 

ఇంకా గ్రామాలను పంచుకున్న మంత్రులు

అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఎక్కడి వారక్కడ తిష్ట

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు

అయినా ఏ మాత్రం పట్టించుకోని పోలీసులు

అధికార పార్టీకి వత్తాసు. బాధ్యత మర్చిన పోలీసులు

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

గత ఎన్నికల పోలింగ్‌లో రాష్ట్రంలో అక్రమాలు

ఏకంగా 12.5 శాతం. దాదాపు 48 లక్షల ఓట్ల తేడా

పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ నాటికి పెరిగిన ఓట్లు

అయినా ఏనాడూ దాన్ని ప్రస్తావించని రాహుల్‌

ప్రభుత్వ అవినీతిని ప్రస్తావించని కాంగ్రెస్‌ ప్రతినిధి

చంద్రబాబు, రాహుల్, రేవంత్‌రెడ్డి అంతా ఒక్కటే

వారి మధ్య హాట్‌లైన్‌ లింక్‌... అదే వాస్తవం

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన  వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి:    పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అ««ధికారపక్షం అంతులేని దౌర్జన్యకాండ. వారికి పూర్తిగా సహకరించిన పోలీసుల వైఖరిని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, నిర్వహించిన ఆ రెండు ఎన్నికలు వెంటనే రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్దంగా తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాను ప్రజలకు మంచి చేశానని చంద్రబాబు భావిస్తే, తనకే ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉంటే, ఆ ధైర్యం ఉంటే, వెంటనే రెండు ఉప ఎన్నికలను రద్దు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన  వైయస్‌ జగన్‌ సవాల్‌ చేశారు. 
ప్రెస్‌మీట్‌లో వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?:
    ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్‌ బూత్‌ల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్స్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 15 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, వాటిలో మా పార్టీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్‌ దగ్గరకు కూడా పోనీయకుండా ఆపేసి ఎన్నికల రిగ్గింగ్‌ చేశారు. పోలీసుల ప్రోద్భలంతో, బూత్‌ల్లోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణ ప్రజాస్వామ్యం దేశంలో ఎక్కడా ఉండదేమో!.

పోలింగ్‌ ఏజెంట్ల కీలక బాధ్యతలు:
    అసలు ఎన్నికల్లో బూత్‌ ఏజెంట్‌కు సంబంధించిన హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్‌ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకి కూడా చెబుతారు. ఆ బాధ్యతలు ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులూ కల్పించబడ్డాయి. పలు అంశాలపై వారికి హక్కులు ఉంటాయి.
    ఒక పోలింగ్‌ ఏజెంట్‌ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్‌ మొదలవడానికి ముందే ఫామ్‌–12 (వారి అపాయింట్‌మెంట్‌ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్తీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. గతంలో ఎక్కడా అలా జరగలేదు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారిపోవడం చరిత్రలో చూసి ఉండం.
    ఓటరు బూత్‌లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్‌ ఆఫీసర్‌ సంతకం తీసుకుని బ్యాలెట్‌ ఇస్తాడు. రిజిస్టర్‌ నింపేది పోలింగ్‌ ఆఫీసర్‌ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్‌ ఏజెంట్‌. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఫాం–32 ను నింపి ఆ బూత్‌లో ఎన్ని ఓట్లు పోల్‌ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్‌ లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్‌ ఆఫీసరు.. ఏజెంట్‌ నుంచి ఒక రిసీట్‌ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్‌ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్‌ బాక్స్‌కు సీల్‌ వేసే వరకు ఏజెంట్‌ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్‌పై కూడా పోలింగ్‌ ఏజెంట్‌ సంతకం చేస్తాడు.

ప్రజాస్వామ్యం సిగ్గు పడాలి:
    మరి ఇవన్నీ నిన్న జరిగాయా? అని నేను అడుగుతున్నా? అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్‌ నిర్వహిస్తే.. దాన్ని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే, అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి.
ఇంకా ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే.
    సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ప్రజలకు మంచి చేయడం కాదు. పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కాదు. కేవలం దోచుకో. పంచుకో. తినుకో. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.
    ఈరోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం ఛంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. ఆనాటి బందిపోట్లను మరిపించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు.

చంద్రబాబుకు ఇదే నా సవాల్‌:
    మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి.
    మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్‌ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్‌ బూత్‌ ఆవరణల్లో సీసీ ఫుటేజ్‌ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?. మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్‌బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం.

చంద్రబాబు ఒక మాబ్‌స్టర్‌. ఫ్రాడ్‌స్టర్‌:
    ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్‌ అనరు. మాబ్‌స్టర్‌ లేదా ఫ్రాడ్‌స్టర్‌ అంటారు. ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే..
    ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. ఎప్పుడూ అదే జరుగుతుంది. కానీ, ఇక్కడ చంద్రబాబు కుట్రలు ఎలా ఉన్నాయంటే.. పోలింగ్‌ బూత్‌లు మార్చేశారు.
    ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. ఇంకా నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి పోయి ఓటు వేయాలంట. 4 కి.మీ నడిచి పోవాలని చూశారు. అలా పోలింగ్‌ సెంటర్లు మార్చారు.
ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి.. అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు.
    దాదాపు 10,600 ఓట్లకు గానూ, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్‌ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కి.మీ నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.

ప్రతి ఓటరుకు ఒక రౌడీ:
    పులివెందుల జడ్పీటీసీ కింద ఆరు పంచాయితీలు, 15 పోలింగ్‌ కేంద్రాలు ఉంటే, ఆ ఆరు పంచాయితీల్లో భద్రత పేరుతో 700 మంది పోలీసులను పెట్టారు. అది ప్రజల భద్రత కోసం కాదు. కేవలం వారిని భయపెట్టడం కోసమే అంత మంది పోలీసులు.
    ఉ.4 గం. కల్లా ఇతర ఊళ్ల నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్‌కు దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలనే అంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కా లు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. 

వారు ఏకంగా గ్రామాలే పంచుకున్నారు:
    మరి ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో అక్కడే మకాం వేస్తే.. బీటెక్‌ రవి అనే టీడీపీ నాయకుడు తనది పులివెందుల రూరల్‌ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. 
    పోలింగ్‌ బూత్‌లకు వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు పోతే, వారిపై దాడి చేసి, ఫామ్‌లు లాక్కుని చింపేశారు. ఇంకా ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. అలా వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్‌ జరిగింది. ఎవరైనా బూత్‌వైపు వస్తే, వచ్చింది వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా.. టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్‌ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.

ఇవిగో ఆధారాలు:
    ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎవరనేది ఈ ఫోటోల్లో చూడండి అంటూ.. దొంగ ఓట్లు వేస్తున్న వారి ఫోటోలు పూర్తి వివరాలతో చూపారు. ఇక్కడ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సమక్షంలోనే వారు దొంగఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన టీడీపీ కార్యకర్తలు అంటూ ఆ ఫోటో కూడా చూపారు.
    మా పులివెందులలో, నల్లపురెడ్డిపల్లిలో అలా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. అడిగేవారు లేరు. కలెక్టర్‌ దగ్గరుండి ఆ ఓట్లు వేయించాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు (బుధవారం) రీపోలింగ్‌లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారంటూ, ఆ ఫోటోలు కూడా ప్రెస్‌మీట్‌లో చూపారు. పోలింగ్‌ బూత్‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.

పోలీసులు. ఏకపక్షంగా పూర్తి వివక్ష:
    మా పార్టీ వారు కేవలం 5గురు కలిసి వెళ్లినా, పోలీసులు తరిమి తరిమి కొట్టారు. చివరకు మహిళలనూ వదలకుండా కొట్టారు. అదే టీడీపీ వారు వందల మంది ఒకే చోట చేరి, షామియానాలు వేసి, అక్కడే భోజనాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
    ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. తమకు కావాల్సిన వారిని నియమించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సింది పోయి, వారు ఏకంగా పచ్చ చొక్కా వేసుకుని పని చేశారు అని చెప్పడానికి, ఈ ఒక్క ఉదాహరణ చాలు.
    డీఐజీ కోయ ప్రవీణ్‌. ఆయన టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావుకు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని మొన్న (సోమవారం) రాత్రి నుంచే పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. డీఐజీ. ఆయనకు సంబంధించిన డీఎస్పీలు, సీఐలు అంతా హ్యాండ్‌ పిక్డ్‌. ప్రతి ఆఫీసర్‌ ఎవరెవరు ఎక్కడ ఉండాలి? ఎస్‌ఐలు ఎవడుండాలి? సీఐలు ఎవడుండాలి? అన్నది చూసి ఏర్పాటు చేసుకున్నారు.

చంద్రబాబు మాట వినకపోతే..!:
    ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్లపాలు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు జైలుకు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్‌ అరెస్ట్‌. అడిషనల్‌ డీజీ సంజయ్‌ అరెస్ట్‌. డీఐజీ విశాల్‌ గున్నీ అరెస్ట్‌. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్‌ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు.
    వీరు కాక నలుగురు నాన్‌క్యాడర్‌ ఎస్పీలు, ఒక కమాండెంట్‌ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్‌ ఎస్పీలు. 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్‌ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్‌ కమాండెంట్లను హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్‌ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్‌ చేశారు. ఇంకా మరో 80 నుంచి 100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. 

ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి. వాటాలు:
    అంటే పక్కాగా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు. వాళ్లకు కావాల్సిన పనులు చేయిస్తున్నారు. చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు. మాఫియా, రింగ్‌ లీడర్‌ ఎవరంటే డీఐజీ. ఆయన ప్రాంతంలో జరిగే బెల్ట్‌ షాపుల ఆక్షన్‌ దగ్గర నుంచి, బెల్ట్‌ షాపులు నడిపించాలంటే వాళ్లిచ్చే కలెక్షన్‌ డబ్బుల దగ్గర నుంచి ఇల్లీగల్‌ పర్మిట్‌ రూములు నడపడం దగ్గర నుంచి, వాటిని నడిపించడం కోసం వాళ్ల దగ్గర నుంచి కలెక్ట్‌ చేసే డబ్బుల దగ్గర నుంచి, ఆయా నియోజకవర్గాల్లో ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్‌›్జ, సిలికా.. ఇంకా ఏ మైన్‌ ఉన్నా కూడా వీళ్లకు ఇచ్చే దగ్గర నుంచి నియోకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపించే దగ్గర నుంచి, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా వాళ్లను సైతం బెదిరించి వాళ్లు కూడా డబ్బులిచ్చే దగ్గర నుంచి, డీఐజీలే పంచుతున్నారు.
    ఎమ్మెల్యేలకు ఇంత. చినబాబుకు ఇంత. పెదబాబుకు ఇంత అని సీఐల ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. ఈ డీఐజీలు, ఈ డీఎస్పీలు, ఈ సీఐలు. ఇది ముఠా నాయకత్వం.  

అసలు ఈ ఎన్నికలు జరపడం ఎందుకు?:

  •     నేను అడుగుతున్నా. డీఐజీ కోయ ప్రవీణ్‌ పర్యవేక్షణలో అన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?
  • అంటూ నిన్నటి ఎన్నికల్లో అక్రమాలను వీడియోలతో సహా ఆధారాలతో మీడియాకు చూపారు.
  • ఉ.4 గం. నుంచే పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ.
  • పులివెందుల టౌన్‌లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌. నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.
  • మొట్నుతలపల్లికి 2 కి.మీ ముందే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించారు.
  • ఎర్రపల్లిలో తమను ఓట్లు వేయనీయలేదన్న మహిళలు.
  • కనంపల్లి సర్పంచ్‌ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్‌ పెట్టి బెదిరించిన పోలీసులు.
  • ఎర్రపల్లిలో రిగ్గింగ్‌కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం.
  • కనంపల్లిలో రిగ్గింగ్‌ జరిగిందని మహిళల ఆగ్రహం. బిటెక్‌ రవి తమ్ముడు భరత్‌ బెదిరింపు.
  • కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకున్న మహిళలు. తమను ఓటు వేయనీయాలంటూ వేడుకోలు.
  • పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రానివ్వలేదు.
  • ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటున్న ఓటర్లు. 
  • ఆర్‌.తుమ్మలపల్లిలో టీడీపీ వారు స్లిప్‌లు ఇస్తూ, దొంగ ఓట్లకు పంపించిన వైనం. 
  • ఎన్నిక పులివెందుల రూరల్‌లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌కు డీఐజీ కోయ ప్రవీణ్‌ వెళ్లి చేసిన హడావిడి. అప్పుడు అక్కడ ఎంపీ అవినాష్‌రెడ్డి ఉన్నాడు.
  • ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ బెదిరించిన డీఎస్పీ మురళీ.
  • మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లిలో పోలింగ్‌ సెంటర్‌లో దౌర్జన్యం. ఆయన సమక్షంలోనే మా పార్టీ ఏజెంట్‌పై దారుణంగా దాడి.
  •  చంద్రబాబు నీవు నిజంగా మంచి చేశావనుకుంటే, ప్రజలు ఓటు వేస్తారనుకుంటే, ఎందుకీ అక్రమాలు?. వారు ఓటు వేయరు కాబట్టే, ఇవన్నీ చేశావు. చేస్తున్నావు.

ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?:
    2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు, జనరల్‌ ఎలక్షన్స్‌కు ఏడాదిన్నర ముందు, నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. అక్కడా మైక్రో మేనేజ్‌మెంట్‌. 27 వేలతో గెల్చి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం.
    ఎప్పుడైనా ప్రజలకు మంచి చేస్తే గుర్తు పెట్టుకుంటారు. ఆదరిస్తారు. ఇలాంటి చర్యలు తాత్కాలికంగా ప్రయోజనాలు కలగొచ్చు.
చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. అలా చూస్తుండగానే మరో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.

దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొండి:
    చంద్రబాబుకు మళ్లీ ఇదే మా డిమాండ్‌. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే, నక్సలిజమ్‌ అక్కడే పుడుతుంది. ఈరోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్‌గా తీసుకొండి. 

భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి!:
    చంద్రబాబునాయుడుగారికి గట్టిగా హితవు పలుకుతున్నా. 
మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఇవే ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని శ్రీ వైయస్‌ జగన్‌ హితవు పలికారు.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
ఈ ఎన్నికలకు అర్ధం ఏముంటుంది?:

    ఈ మాదిరిగా ఎన్నికలు జరిగితే, ఎలక్షన్స్‌కు మీనింగ్‌ ఏం ఉంటుంది? అసలు ఎన్నికలు జరపడం ఎందుకు? ఆ ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీ ఛైర్మన్లకు, కౌన్సిల్‌ ఛైర్మన్లకు ఎన్నికలు ఎలా జరుపుతున్నారు?. మీ ఇష్టం వచ్చినట్లు మీ అంతట మీరు దౌర్జన్యం చేస్తున్నారు. అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి కొనేస్తున్నారు. మీకు సంఖ్యా బలం లేకపోయినా, అధికార దుర్వినియోగం చేస్తూ పదవులు లాగేసుకుంటున్నారు. అక్కడ నుంచి మొదలుపెట్టిన సంప్రదాయం చివరికి ఓటర్ల దాకా తీసుకెళ్తున్నారు.

నిస్తేజంగా ఎన్నికల కమిషన్‌:
    ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) అన్నది డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం.
    అందుకే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. మళ్లీ చెబుతున్నాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలన్నది మా డిమాండ్‌. ఆ డిమాండ్‌ తోనే కోర్టులను కూడా ఆశ్రయిస్తాం. 

రాహుల్‌తో జత కట్టాల్సిన అవసరం లేదు:
    గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఎన్నికలు జరిగిన తీరుపై మాకున్న అభ్యంతరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుంచాం. మాకు జరిగిన అన్యాయాలను సవివరంగా చెప్పాం. నిజానికి దేశంలోనే అత్యంత అన్యాయం ఎక్కడన్నా  జరిగిందంటే అది మన రాష్ట్రంలోనే. పోలింగ్‌ ముగిసిన తర్వాత కౌంటింగ్‌ నాటికి ఓట్లు భారీగా పెరిగాయి. ఏకంగా 12.5 శాతం. అంటే దాదాపు 48 లక్షల ఓట్లు. 
    ఆ స్థాయిలో ఓట్లలో తేడా వస్తే, ఎన్నికల సంఘానికి మావాళ్లు  రిప్రజెంటేషన్‌ ఇచ్చారు. అందరినీ కలిసి చెప్పారు. వారు స్టేట్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఎక్సర్‌ సైజ్‌ ఆంధ్రరాష్ట్రంలో కూడా చేస్తామని సానుకూలంగా మాట్లాడారు. కానీ ఏం జరిగింది?.
    ఎండాఫ్‌ ద డే. ఏం చేయగలిగారు?. ఏదైనా కానీ, ఈ రాహుల్‌గాంధీ ఇప్పుడు ఏదైతే చెబుతున్నారో.. మరి ఆయన ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదు?. నిజానికి ఇక్కడే అత్యధికంగా ఓట్లలో అక్రమాలు జరిగాయి. అయినా ఆయన మాట్లాడరు. ఎందుకంటే ఆయన చంద్రబాబుతో హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారు కాబట్టి మాట్లాడటం లేదు. 

ఏ ఒక్క రోజైనా ప్రశ్నించారా?:
    కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర ఇన్‌ఛార్జ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాణిక్యం ఠాకూర్‌. ఆయన కూడా ఏ రోజైనా చంద్రబాబు గురించి మాట్లాడారా? ప్రజాస్వామ్యాన్ని ఇంత ఖూనీ చేస్తుంటే ప్రశ్నించారా? 
    చంద్రబాబు ఇన్ని స్కాంలు చేస్తున్నారు. అన్నీ కంటి ముందు కనిపిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా బెల్ట్‌షాపు కనిపిస్తుంది. ఏ పక్కకు తిరిగినా పర్మిట్‌రూం కనిపిస్తుంది. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముతున్నారు. వాటి ఏ రోజన్నా మాట్లాడారా? ఆ పని చేయకుండా నా గురించి మాత్రం మాట్లాడతారు. చంద్రబాబు గురించి అస్సలు మాట్లాడరు. ఎందుకంటే హాట్‌లైన్‌. చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్‌ హైకమాండ్‌తో నిరంతరం హాట్‌లైన్‌లో టచ్‌లో ఉంటారని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు.

Back to Top