విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించడం సభ్య సమాజం సిగ్గుపడే ఘటన అని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ కూడా లేదనేందుకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఈ సంఘటనలో బాధితురాలిని పరామర్శించే తీరిక కూడా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఇటువంటి దారుణానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆమె ఎమన్నారంటే... కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో శిరీష అనే మహిళకు జరిగిన అన్యాయం మీద వైయస్సార్సీపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తలను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. అప్పు తీర్చలేదనే కారణంతో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమైతే, సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో జరగడం దౌర్భాగ్యం. మహిళను అవమానించేలా ఇంత ఘోరమైన సంఘటన జరిగితే హోంమంత్రి అనిత వీడియో కాల్ లో పరామర్శించి చేతులు కడిగేసుకుంది. రాష్ట్రంలో మహిళల మీద వరుస అఘాయిత్యాలు, దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంది. మహిళ అయ్యుండీ హోంమంత్రి కనీస బాధ్యతగా నడుచుకోవడం లేదు. మహిళను నేరుగా వెళ్లి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పి రాకుండా వీడియో కాల్‌తో సరిపెట్టేసింది. అసమర్థ పాలనలో చెలరేగిపోతున్న దుండగులు ఆడబిడ్డ మీద ఎవరు చేయి వేసినా అదే వారికి ఆఖరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేస్తూనే ఉంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ కార్యకర్త సమాజం సిగ్గుపడే విధంగా ఇంత హేయంగా దాడి చేస్తే ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నట్టు? ఇకనైనా మహిళలపై నేరాలు ఆగుతాయో లేదో చెప్పాలి. మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైకుల ముందు చెబుతారు. కానీ వరుస దాడులు జరుగుతున్నా ఆయన ఏ ఒక్కరికీ తాట తీసింది లేదు. ఈ దారుణాలను సాక్షి మీడియా బయటకు తీసుకొస్తుంటే ఓర్వలేక సాక్షి మీడియా మీద అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ నాయకులతో సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయించారు. ఎన్ని తప్పుడు పనులు చేసినా నిందితులు మాకేం కాదనే భరోసాతో బతుకుతున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అమలు చేస్తానని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ఫలితమే మహిళల మీద జరుగుతున్న ఈ దాడులకు కారణం. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై గంటకు మూడు అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వమే మండలిలో సమాధానం చెప్పింది. చంద్రబాబు అసమర్థ పాలనలో దుండగులు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ఇప్పటికైనా మహిళల రక్షణ పై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించాలి. పోలీసులను ప్రతిపక్ష నాయకుల మీద కక్షసాధింపులకు, అక్రమ అరెస్టులకు వాడుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు, దాడులకు గురైన మహిళల కుటుంబాలను ప్రభుత్వం తక్షణం ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర మహిళలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.