రాయచోటి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో పోలీసుల హడావుడి

అధికార‌బ‌లంతో  అక్రమాలకు పాల్పడితే సహించం

మంత్రి రాంప్రసాద్‌రెడ్డిపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌

అన్నమయ్య జిల్లా : రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం, అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై చర్చించేందుకు సమావేశమైన కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఒత్తిళ్లతోనే ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

రాయచోటి మున్సిపాలిటీలోని 44 వార్డుల్లో పోటీ చేయనున్న వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల ఒక బీసీ నాయకుడిపై దాడి చేయడంతో పాటు, మంగళవారం రాత్రి మరోసారి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నామని చెప్పారు.

చిన్న కార్యకర్తలను భయపెట్టడం కాదు.. నాతో తేల్చుకోండి

మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చిన్నాచితకా కార్యకర్తలను భయపెట్టడం మానుకోవాలని, దమ్ముంటే తనతో నేరుగా తలపడాలని శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటే వాటిని నిష్పక్షపాతంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికార బలాన్ని ఉపయోగించి అక్రమాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు.

రాయచోటి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించడాన్ని, మున్సిపాలిటీని థర్డ్‌ గ్రేడ్‌ నుంచి స్పెషల్‌ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్‌ చేయడాన్ని మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఎన్నికల్లో అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

Back to Top