పల్నాడు జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు కూటమి కుట్రలకు తెరతీసిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాచేపల్లి–నడికుడి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను పోలీసులు తెల్లవారుజామున బలవంతంగా తీసుకెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైయస్ఆర్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన అభ్యర్థిని అక్రమంగా నిర్బంధించారని విమర్శించారు. కుట్రపూరితంగా కేసులు: దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కాసు మహేష్‌రెడ్డి, రవికుమార్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు. రవికుమార్ కార్ పార్కింగ్ స్థలంలో మద్యం బాటిళ్లు పెట్టి అక్రమ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లడంపై రవికుమార్ తండ్రి సాంబయ్య ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. రవికుమార్‌ను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. బెదిరింపులతో ఏకగ్రీవాలకు యత్నం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బెదిరింపులతో ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని చూస్తున్నారని కాసు మహేష్‌రెడ్డి ఆరోపించారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉందని గుర్తుచేశారు. అక్రమంగా కేసులు నమోదు చేసిన పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.