పూలే ఆలోచనలకు అనుగుణంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

సమన్యాయ సత్య శోధకుడు, సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే 

  బీసీ జనగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీల పక్షపాతి వైయ‌స్‌ జగన్‌

 పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి 

 
తాడేప‌ల్లి: మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో పాల‌న  సాగిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పేర్కొన్నారు. మ‌హాత్మా జ్యోతీరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

సమన్యాయ సత్య శోధకుడు, దేశంలోనే మొట్టమొదటి సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతీరావు పూలే అని పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు కీర్తించారు.  పూలే స్పూర్తితో ముందుకు సాగుతూ మహనీయుల ఆలోచనలు ఆచరణలో నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు అన్నారు. 

        మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ, కారల్‌ మార్క్స్‌ అంతటి గొప్ప తత్వవేత్త జ్యోతీరావు పూలే అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్వయంగా తన గురువు పూలే అని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సామాజిక విలువలు వర్ధిల్లడానికి, సమానత్వ సాధనకు కులాలు, మతాలు అడ్డుగోడలని నిర్ధారించి, ఆనాడే వాటి నిర్మూలనకు కృషి చేసిన మహాత్ముడని చెప్పారు. మహిళలకు విద్య అత్యంత అవసరమని మొట్టమొదట నినదించిన గొప్ప సంస్కరణవాది పూలే అన్నారు. ఇంగ్లీషు విద్యను అన్ని వర్గాల వారికి అందించాలని బ్రిటీష్‌ పాలకులకు నివేదిక సమర్పించిన దార్శనికుడన్నారు. ఆనాటి పూలే ఆకాంక్షలకు అనుగుణంగా నేటి ముఖ్యమంత్రి జగన్‌ గారు ఇంగ్లీషు విద్య అన్ని వర్గాల వారికి అందేలా చర్యలు చేపట్టడం గొప్ప విషయమని తెలిపారు. పూలే స్పూర్తిని మరింత ముందుకు తీసుకెళ్ళేలా అందరూ జగన్‌ గారికి అండదండగా నిలవాలని ఆయన కోరారు.

    ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ, సామాజిక విప్లవానికి నాంది పలికిన వైతాళికుడు జ్యోతీరావు పూలే అని పేర్కొన్నారు. సమసమానత్వం, మహిళలకు విద్య కోసం తన జీవితాంతం కృషి చేసిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. పూలే ఆశయాలు, ఆలోచనలను తూచ తప్పకుండా అమలు చేస్తూ నూటికి నూరు పాళ్ళు బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్‌ గారు అని తెలిపారు. రాజ్యాంగ స్పూర్తికి ఎక్కడా విఘాతం కలగకుండా పూలే ఆలోచనలకు మించి బీసీలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు అని అన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు ఇవ్వాల్సిన వాటాకు మించి జనరల్‌ స్థానాల్లో కూడా సీట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని వివరించారు. వీటన్నింటినీ మించి ఏళ్ళ తరబడి అంతా ఎదురుచూస్తున్న బీసీ జనగణనకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన బీసీల పక్షపాతి జగన్‌ గారు అని చెప్పారు.

         లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు జ్యోతీరావు పూలే అని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక సంస్కరణల ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. పూలే వంటి మహనీయుల ఆలోచనలకు అనుగుణంగా అసమానతలు లేని గొప్ప సమాజం ఆవిష్కృతం కావాలంటే... అన్నిటి కంటే ముందు పేదరిక నిర్మూలన జరగాలని గుర్తించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు అని తెలిపారు. అందుకే ఈ రాష్ట్రంలో పేదరికంపై ముఖ్యమంత్రి జగన్ గారు పోరాటం కొనసాగిస్తూ... అణగారిన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ సమ సమానత్వ సమాజ స్థాపనే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌ గారు ముందుకు సాగుతున్నారని వివరించారు. ఒక మంచి ఉద్దేశంతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ గారికి అండగా నిలవడం ద్వారా పూలే వంటి మహనీయులు ఆశయాలు నెరవేరేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని లేళ్ళ అప్పిరెడ్డి కోరారు.

     ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి, విజయవాడ పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, తిరుపతి స్మార్ట్‌ సిటీ ఛైర్‌పర్సన్‌ పద్మజారెడ్డి, మాదిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కనకారావుమాదిగ, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, నాగవంశ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ బొడ్డు అప్పలకొండమ్మ, అప్పలనాయుడు,  కోనేరు సత్యప్రియ పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top