తిరుపతి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన మోసాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు తిరుపతిలో ఫోటో ఎగ్జిబిషన్‌ను మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మావతి పురంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీషా, తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి నుంచి వైయస్ఆర్‌సీపీ చేసిన పోరాటాల ఫలితంగానే ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం కొన్ని సర్వీసులకు అమలు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జూన్ 12న "ప్రజలకు వెన్నుపోటు దినం" పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదు వేల మందితో నిర్వహించే ఈ ర్యాలీ అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని చెప్పారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలు గమనిస్తున్నారని, వాటి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఒకప్పుడు "వ్యవసాయం దండగ" అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయం గురించి వేదాలు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాలో సుమారు 50 వేల మంది మామిడి రైతులు కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో కూటమి నేతలు కుమ్మక్కై మామిడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.