కలువాయి ఎప్పటికీ నెల్లూరులో అంతర్భాగమే

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్ప‌ష్టం

కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కలెక్టర్‌కు వినతిపత్రం

నెల్లూరు జిల్లా :  నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని కొనసాగించాలని కోరుతూ వెంకటగిరి నియోజకవర్గ  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండల  వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, “కలువాయి మండలం ఎప్పటికీ నెల్లూరు జిల్లాలో అంతర్భాగమే” అని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల వికేంద్రీకరణ చేపట్టారని గుర్తు చేశారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్క జిల్లాగా చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారని వివరించారు.

ప్రజల అభ్యర్థన మేరకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించారని, అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచినట్లు తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి సమస్య లేని నెల్లూరు జిల్లాలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల్లో అనవసర చిచ్చు రేపుతోందని విమర్శించారు.

కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతామన్న చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు పార్టీలకతీతంగా ఉద్యమానికి దిగారని చెప్పారు. “సేవ్ కలువాయి” నినాదంతో ప్రజలు రోడ్డెక్కారని, తిరుపతి జిల్లాలో కలవడానికి కలువాయి ప్రజలకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టి, ఆ తరువాత వేడుక చూడటం చంద్రబాబు ప్రభుత్వ అలవాటుగా మారిందని మండిపడ్డారు.

చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తుంగలో తొక్కడం అలవాటుగా చేసుకున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ప్రజా వ్యతిరేకత ఎదురవడంతో, టెండర్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి వచ్చిందని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు దీనస్థితికి చేరుకున్నారని, ప్రజల నిరసనలతో ఏం మాట్లాడాలో తెలియక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్ష నేతల మాదిరిగా లేఖలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు. కూటమిలో భాగస్వాములైన పార్టీలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్నే నిలబడుతుందని కాకాణి స్పష్టం చేశారు. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలకు ఉన్న అభ్యంతరాలను జిల్లా కలెక్టర్‌కు వివరించామని తెలిపారు. చంద్రబాబు ఇకనైనా మొండివైఖరి విడిచిపెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కామెంట్స్‌

ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ  వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపే చంద్రబాబు ఆలోచనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కలువాయి ప్రజలతో కలిసి తమ అభ్యంతరాలను జిల్లా కలెక్టర్‌కు వినవించామని చెప్పారు. 20 పంచాయతీల ప్రజలు చేసిన తీర్మానాలను వినతిపత్రంతో కలిసి కలెక్టర్‌కు సమర్పించినట్లు వివరించారు.

ప్రజల అభిష్టాన్ని ప్రభుత్వం గౌరవించాలని, కలువాయిని తిరుపతి జిల్లాలో కలిపితే ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 30వ తేదీలోపు చంద్రబాబు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Back to Top