రాయలసీమ: వికేంద్రీకరణ నినాదం రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మార్మోగుతోంది. అందరి నోటా మూడు రాజధానులే ముద్దు అన్న మాటలే వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఉండాలన్న అంశంపై రాష్ట్రస్థాయిలో రెఫరెండంకు తాము సిద్ధమన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని టిడిపికి చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని సవాల్ విసిరారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. తమ పదవులకు రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఇప్పటికీ వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని మరింత వెనక్కి నెట్టేందుకు టీడీపీ, జనసేనలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే టీడీపీ, జనసేనలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే వెంకటేష్ గౌడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే వెంకటేష్ గౌడు అన్నారు. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యం. దేశంలో అనేక ప్రాంతాల ప్రజలు తమ రాష్ట్రాల్లో వికేంద్రీకరణను కోరుకుంటున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగే పోరాటానికి సంపూర్ణ మద్దతునిస్తున్నాను అన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏపీలో వికేంద్రీకరణకు సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉండడంతో అభినందిస్తూ జార్ఖండ్ సీఎం కూడా ఆ రాష్ట్రంలో వికేంద్రీకరణకు సిద్ధమవుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో నాలుగు ప్రధాన పట్టణాలను గుర్తించి నాలుగు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మూడు రాజధానుల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. న్యాయ రాజధానితో రాయలసీమ అభివృద్ధి : ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కర్నూలును న్యాయ రాజధాని చేస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యపడుతుంది. అమరావతిలో కొంత మంది రైతులు చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం వెనుక అనేక కుట్రలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్‌ను ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వెనుకబడి పోయాయి. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. వికేంద్రీకరణను చంద్రబాబు అడ్డుకోవడం తగదు : మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఓర్వలేక చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ముంపు గ్రామాలను పట్టించుకోని చంద్రబాబు అమరావతిలోని రైతుల కోసం మాత్రమే మాట్లాడడం దారుణం. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును రాయలసీమ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఒక్క రాజధానితో బాబుకే లాభం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతానికి పరిమితమైతే మిగిలిన ప్రాంతాలు నష్టపోతాయి. అమరావతి వల్ల చంద్రబాబు, ఆయన అనుచర గణానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది. 5 వేల ఎకరాలు రాజధాని కోసం సరిపోతుంది. అయితే చంద్రబాబు 35–40 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. రైతులు నష్టపోకూడదని సీఎం వైయస్ జగన్ అక్కడి రైతులందరికీ కౌలు ఇస్తున్నారు. వికేంద్రీకరణతోనే సుపరిపాలన: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వికేంద్రీకరణతోనే సుపరిపాలన సాధ్యమవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు తన బినామీల సౌలభ్యం కోసం అమరావతి పాదయాత్ర చేయిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే టీడీపీ నాయకులు, వారి వర్గీయులు భూములు కొన్నారు. ఇప్పుడు వారు నష్టపోకూడదనే దొంగ యాత్రలకు శ్రీకారం చుట్టారు.