విజయవాడ: విజయవాడలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వైయస్ జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. చదువుకున్నవారు రాజకీయాల్లోకి వస్తే పాలనలో మార్పు తీసుకురావచ్చని, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే నాయకత్వం అవసరమని చెప్పారు. వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోతో పాటు తన సొంత మేనిఫెస్టోను కూడా అమలు చేయాలనే లక్ష్యంతో రూపరెడ్డి ముందుకు సాగుతున్నారని, చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రోత్సాహం అందిస్తారని వివరించారు. 9వ డివిజన్లో రూపరెడ్డికి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ 9వ డివిజన్ అభ్యర్థి రూపరెడ్డి మాట్లాడుతూ, తన విద్య ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వైయస్ జగన్ స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగుతానని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తన మేనిఫెస్టోకు ఆదరణ పెరుగుతోందని తెలిపారు. విద్య, క్రీడలు, స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.