విశాఖపట్నం: త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనే యోచనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజిని, వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుతో కలిసి ఎండాడ లా కాలేజీ రోడ్డు పనోరమ హిల్స్ వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి భూమి పూజ చేశారు. కార్యక్రమం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. విశాఖ వైయస్‌ఆర్ సీపీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయంగా మారనుందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు అసత్య ప్రచారమే పనిగా పెట్టుకున్నాయని, వారి దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
రానున్న రోజుల్లో విశాఖే రాష్ట్రానికి భవిష్యత్ కానుందని, న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత విశాఖ నుంచే పరిపాలన ఆరంభం కానుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో విశాఖ జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు పంచుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు అండగా ఉండి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.