నెల్లూరు: మొంథా తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నష్టపోయిన రైతులకు అందించాల్సిన సాయం పై మాట మాత్రమైనా ప్రకటన చేయని చంద్రబాబు... తుపాన్ లో అంతా బాగా చేసామని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఇ-క్రాప్, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలబడ్డామని తెలిపారు. ఐదేళ్లలో ఉచిత పంటల బీమా ద్వారా పంట నష్టపోయిన రైతులకు రూ.7802 కోట్ల పరిహారం చెల్లిస్తే... కూటమి ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడి రైతులకు నిలువునా ముంచిందని ఆక్షేపించారు. ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు సిగ్గు లేకుండా నోరుపారేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాన్ లో నష్టపోయిన వారికి రాజకీయాలకు అతీతంగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి అండగా నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● ప్రచార పిచ్చితో రైతులను గాలికొదిలిన చంద్రబాబు.. తుపాన్ నేపధ్యంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ లు ప్రజలను గాలికొదిలి విదేశీ పర్యటనలు చేస్తుంటే.. వారికి అండగా నిలబడాల్సిన వ్యవశాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు విఫలమయ్యారు. తుపాన్ పై మా పార్టీ నేతలతో వైయస్.జగన్ చేసిన సమీక్షను జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తుపాన్ సాయంపై చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు. అనుకూల మీడియాలో బాకా ఊది ప్రచారం చేసుకుంటున్నారు. మొంథా తుపాన్ చంద్రబాబు ముందు మోకరిల్లిందంటూ సిగ్గు, లజ్జా లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు నవ్వుతారన్న కనీస జ్ఞానం కూడా లేదు. తుపాన్ నేపధ్యంలో బాధ్యత గల ప్రభుత్వంగా ప్రజలు, రైతులకు అండగా ఉండాడానికి తీసుకున్న చర్యలు ఏంటి ? వారిని ఆదుకోవడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేశారు? తుపాన్ నేపధ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలోనూ పూర్తిగా విఫలమైన ప్రభుత్వం.. ప్రజల కష్టాలపై పార్టీనేతలతో వైయస్.జగన్ సమీక్షిస్తే అది తట్టుకోలేక కడుపు మంటతో రగిలిపోతూ... ఆయన్ను నిందించడం మొదలుపెట్టారు. ప్రచారపిచ్చితో ఊగిపోతూ.. రైతులను, ప్రజలను గాలికొదిలేశారు. ● అచ్చన్నాయుడుది వీధి రౌడీల భాష.. మా పార్టీ నేతల సమీక్షలలో గతంలో తుపాన్ లు వచ్చినప్పుడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఇ-క్రాప్, ఉచిత పంటల బీమా, సకాలంలో క్రాప్ ఇన్సూరెన్స్ తో పాటు రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాలతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఎలా వైఫల్యం చెందింది అన్న అంశాల గురించి కూడా మాట్లాడాం. దానికి సమాధానం చెప్పకుండా వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు వీధిరౌడీలా మాట్లాడుతున్నాడు. విపత్తు సమయంలో మీరు వ్యవహరించాల్సిన తీరు చూసి ప్రజలు మిమ్నల్ని ఛీకొడుతున్నారు. ● వ్యవసాయంపై బహిరంగ చర్చకు సిద్దమా... మేము బహిరంగ చర్చకు సిద్ధమా అని ట్వీట్ చేస్తే.. దానికి ప్రతిగా మేము కూడా బహిరంగచర్చకు సిద్దమే.. వేదిక, మీడియా ఛానెల్, టైం ప్రకటించమంటే స్పందన లేకుండా తోక ముడిచి పారిపోయాడు. మీ దగ్గర దమ్మూ, ధైర్యం లేనప్పుడు ఛాలెంజ్ చేయడం ఎందుకు ? కేవలం వ్యవసాయమే కాదు, విద్య, వైద్యం దేనిగురించైనా, ఎక్కడైనా చర్చించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు సిద్దమా? 2019-24 వరకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రజలకు చేసిన సంక్షేమం, వారికి అండగా నిలబడిన విధానాల గురించి మీరు చెప్పిన ఛానెల్, సమయంలోనే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పార్టీలకు ఆత్మస్ధుతి, పరనింద తప్ప మరొక్కటి లేదు. ప్రజా సమస్యల గురించి తగిన సమయం, వెసులు బాటు వస్తుందన్న ఉద్దేశ్యంతోనే మేం ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. గతంలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సభలో ప్రజలసమస్యలపై మాట్లాడుతుంటే.. మాకు అవకాశం ఇవ్వకుండా మైక్ లు కట్ చేసిన చరిత్ర ఉన్న మీరు... అది లేకుంటే మాట్లాడ్డానికి సమయం కేటాయిస్తారనడం వట్టి మాట. ● రైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం.. రైతులు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి లేదు. ఏళ్ల తరబడి రైతు సమస్యలను పట్టించుకునే నాధుడే కరువైన సందర్భంలో వారి సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్.జగన్ మాత్రమే. చంద్రబాబు తన జన్మలో ఏనాడైనా.. వైయస్.జగన్ తరహాలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి.. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను చేయిపట్టుకుని నడిపించి,వారికి అండగా ఉండే వ్యవస్థలను తీసుకురావాలన్న ఆలోచన చేశాడా? అలా చేయాలన్న స్పృహ చంద్రబాబు మదిలో ఎప్పుడైనా మెదిలిందా? అలాంటి మీరా వైయస్.జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి మాట్లాడేది? మా ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల సాయంతో ఇ-క్రాప్ తీసుకొచ్చాం. రైతులు ప్రకృతి వైపరీత్యాలతో ఏ సీజన్ లో పంట నష్టపోతే ఆ సీజన్ ముగిసేలోగా ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వైయస్.జగన్ కు మంచి పేరు వస్తుందన్న దుర్భుద్ధితోనే ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రైతులను గాలికొదిలేసారు. ఇవాళ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులు ఉచిత పంటల బీమా లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేసుకున్నారు. వాళ్లు కూడా బ్యాంకులో రుణం కావాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి కాబట్టి తప్పక తీసుకున్నారు. మిగిలినరైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఉచిత పంటల బీమా రద్దు చేయడం వల్ల రైతులు గొంతు కోశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 84 లక్షల ఎకరాలను ఉచిత పంటల బీమా పరిధిలోకి తీసుకొచ్చి 75 లక్షల ఎకరాల్లో పంటలకు ఉచిత పంటల బీమా కల్పించడం ద్వారా రూ.7802 కోట్లు పరిహారం చెల్లించాం. తుపాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రత్తి, వేరుశెనగ, వరితో పాటు ఇతర రైతులకు చేయాల్సిన సాయం గురించి చంద్రబాబు కనీసం ప్రస్తావించడం లేదు. పంట నష్టపోయిన రైతులకు ఏ మేరకు పరిహారం కూడా ప్రకటించడం లేదు. ఇవేవీ మాట్లాడకుండా... అంతా బాగుంది, మేం కష్టపడి పనిచేశామని మీకు మీరే డబ్బా కొట్టుకుంటున్నారు. ఎంత మంది రైతులు ఏయే పంటలు నష్టపోయారు? ఎంత నష్టం వాటిల్లింది? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్నదానిపై మాట్లాడకుండా.. రైతులకు అండగా ఉండాలని మేం ఆలోచన చేస్తుంటే మాపై విమర్శలు చేయడం సరికాదు. ● అన్నదాతలకు అడుగడుగునా అన్యాయం.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడుతూ.. మిర్చి పంటను రైతులు క్వింటాల్ ధర రూ.7 నుంచి రూ.9 వేలకు అమ్ముకుంటున్నప్పుడు రూ.11,771 లకు కొనుగోలు చేస్తామని చెప్పి, ఎందుకు కొనలేదు అని అడిగితే... బయట మార్కెట్ లో రూ.14, రూ.15 వేలు అమ్ముతుందని చెబుతున్నావు. ఇదే మాట ధైర్యంగా రైతులు వద్దకు వెళ్ళి చెప్పగలరా? గుంటూరు మిర్చి యార్డుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయశాఖ మంత్రి.. రైతులు వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, వారికి అండగా నిలబడే ప్రయత్నం కూడా చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి కనీసం వారి సమస్యల గురించి ప్రస్తావించని నువ్వా.. మా గురించి మాట్లాడేది. ఇవాళ ఆర్బీకేలు, విలేజ్అగ్రికల్చరల్ అసిస్టెంట్ లేకపోతే కనీసం గ్రామాలలో రైతులకు వ్యవసాయం గురించి సూచనలు, సలహాలు ఇచ్చే పరిస్ధితి లేదు. సమస్య వస్తే దానికి పరిష్కారం చెప్పేవాళ్లు కూడా లేని పరిస్థితి. సచివాలయ ఉద్యోగులు లేకపోతే.. మొన్నటి తుపాన్ లో వ్యవస్థ అంతా కుప్పకూలిపోయేది. వారంతా కలిసి పనిచేయబట్టే.. నష్టాలను నివారించలేకపోయినా ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయగలిగారు. ఇవాళ చంద్రబాబు సచివాలయాలన్నింటినీ స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మారుస్తానని మాట్లాడుతున్నాడు. లేదంటే వారి వల్ల ఉపయోగం లేదని మాట్లాడుతాడు. అంటే ఇవాళ సచివాలయ ఉద్యోగులు అవసరం కాబట్టి ఇలా మాట్లాడుతూ.. ఏ ఎండకా గొడుగు పడతాడు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి రూ.7,802 కోట్లు అందించాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. సీఎం యాప్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తులు, వాటి మద్ధతు ధరల గురించి ప్రతిరోజూ పర్యవేక్షణ చేశాం. ఏ రోజు రైతుల పంటలకు గిట్టుబాటు తగ్గితే అదే రోజు ప్రభుత్వమే ప్రొక్యూర్ మెంట్ చేసేలా ఉత్తర్వులు ఇచ్చాం. మీ దగ్గర అలా చేసే పరిస్థితి ఉందా? మీరు కేవలం రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఇచ్చామని 300 సార్లు చెప్పుకోవడానికి సిగ్గుందా అచ్చన్నాయుడూ? ప్రభుత్వం, లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి, కావాలంటే చూసుకో అచ్చన్నాయుడు. ఉద్యోగులను, దళారులను అడ్డం పెట్టుకుని రైతులకు నాసిరకం ఉపకరణాలు అందించి కమిషన్లు కోసం కక్కుర్తి పడ్డం కాదు. మీలాంటి వ్యక్తుల పేరు ఉచ్చరించడానికి కూడా రైతులు మండిపడుతున్నారు. నువ్వో బుర్ర తక్కువ మనిషివి అచ్చన్నాయుడు. ● మద్ధతు ధర కల్పనలో ఘోర వైఫల్యం... మీ ప్రభుత్వం రూ.271 కోట్లతో బర్లీ పొగాకు కొనుగోలు చేసిందని చెబుతున్నావు. ఏ రైతు దగ్గర ఏ ఆర్బీకే పరిధిలో ఎంతెంత కొనుగోలు చేశారు, ఎంత డబ్బులు చెల్లించారన్న జాబితా డిస్ ప్లే చేయగలరా? మీరు తీసుకున్న ఏ నిర్ణయం వల్లా రైతులకు మేలు జరగలేదు. మామిడి పంట కిలో రూ.12 ప్రకటించి రూ.4 ప్రభుత్వం నుంచి సబ్సిడీ అని చెప్పారు. ఆ జాబితా ప్రకటించగలరా? రూ.12 కిలోకి ఇచ్చామని చెప్పడానికి నోరెలా వచ్చింది. ఉల్లి పంట గురించి మాట్లాడుతూ... 4 లక్షల టన్నుల పంట పండితే కేవలం 6 వేల క్వింటాల్లు మాత్రమే కొనుగోలు చేశారు. దానికి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. రైతులకు చెల్లించాల్సింది రూ.17 కోట్లు అయితే, కేవలం రూ.2.11 కోట్లు మాత్రమే చెల్లిస్తే.. రెండు నెలలుగా రైతులు తమ బకాయిలు కోసం మార్కిఫెడ్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని మీకు బాకా ఊదే ఆంధ్రజ్యోతిలోని వచ్చింది. దీనికేం సమాధానం చెబుతావు అచ్చన్నాయుడూ? ఉల్లి పంటకు సంబంధించి మీడియా ముందు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఉల్లి కిలో రూ.12 కు కొనుగోలు చేస్తామని చెబుతూ, రూ.8 సబ్సిడీ ఇస్తామన్నారు. దీంతో పాటు హెక్టారుకు రూ.50 వేల ఇస్తామని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. రైతులో కిలో రూ.3 కే పారబోసుకున్న దుస్థితి. వ్యవసాయం మీద మీ చిత్తశుద్ధికి, రైతుల పట్ల మీకున్న ప్రేమకు ఇదే నిదర్శనం. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటోలతో ఇంటింటికీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఏ పథకం వల్ల ఎంత లబ్ది చేకూరుతుందో అన్న వివరాలతో బాండు పేపర్లు కూడా పంచి, వాటి అమల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ● రైతులకు అండగా ఉంటాం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు ఎన్ని రకాలు ఇబ్బందులు వచ్చినా వాటన్నింటినీ పరిష్కరించి రైతులకు అండగా నిలబడ్డాం. మీ హయాంలో రైతులకు బస్తా యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం. మీరు మార్క్ ఫెడ్ ద్వారా ఇవ్వకపోవడం వల్లే... రైతులు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు యూరియా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సకాలంలో రైతులు యూరియా సరఫరా చేయలేక.. మరలా అడ్డగోలుగా మాట్లాడుతూ... యూరియా వాడితే కేన్సర్ వస్తుందని చేతగాని మాటలు మాట్లాడుతున్న దౌర్భాగ్య ప్రభుత్వమిది. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా వారి పక్షాన వైయస్ఆర్‌సీపీ అండగా నిలబడి, పోరాటం చేస్తుందని చాలా స్పష్టంగా వారికి భరోసా ఇస్తున్నాం. పంట నష్ట పరిహారం విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ తీరు చూస్తుంటే.. పరిహారం ఎగ్గొట్టడానికే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. పంట నష్టపోయి ఇన్ పుట్ సబ్సిడీ తీసుకున్న రైతుల నుంచి పంట కొనుగోలు చేయమని చెప్పడం అత్యంత దుర్మార్గమని, దానిపైనా కూడా రైతుల పక్షాన పోరాటం తధ్యమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.