తాడేపల్లి: ప్రభుత్వ వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైయస్ఆర్‌సీపీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో నకిలీ లిక్కర్ డంప్‌ను బయటపెట్టడంతోపాటు గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉండగా ఆయన్ను టీడీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే కలత చెందిన జోగి రమేశ్ చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో అసలు నిందితులైన టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుడు రాముల మీద కేసు పెట్టి అరెస్టు చేయకుండా ఏ పాపం తెలియని జోగి రమేశ్‌ని అరెస్టు చేయడం దుర్మార్గమని సుధాకర్ బాబు అన్నారు. "ఒకవైపు మోంథా తుపాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకోవైపు శ్రీకాకుళందలోని కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది అమాయక భక్తులు ప్రాణాలొదిలారు. ఈ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంద" ని దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ప్రభుత్వం విఫలమైన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారవుతోంది. ఆ నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా సభ్యులంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని ఆధారాలతో సహా బయటపడిపోతే దానికి బదులు చెప్పాల్సిన ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడుతోంది. వాన, వరద, బురద కాదేదీ డైవర్షన్‌కి అనర్హం అన్నట్టుగా కూటమి పాలన ఉంది. వైయస్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం గుట్టురట్టు చేసిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకులు జోగి రమేశ్‌ను అక్రమంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 నెలల పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమైన ప్రతిసారీ ప్రజల దృష్టిని మరల్చేందుకు వైయస్సార్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధించడమే పనిగా పెట్టుకున్నారు. నకిలీ మద్యంపై నెలరోజులుగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చిందని అక్టోబర్ 3వ తేదీ నుంచి దాదాపు నెలరోజులుగా జోగి రమేశ్ సహా వైయస్ఆర్‌సీపీ నాయకులమంతా ప్రశ్నిస్తూనే ఉన్నాం. నకిలీ మద్యం తయారీ వెనుక యజమాని ఎవరని అడిగితే ప్రభుత్వం ఈరోజుకీ బదులు చెప్పలేకపోయింది. కేవలం తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ములకలచెరువులో మాత్రమే కాకుండా అమలాపురం, ఏలూరు, రేపల్లె, ఇబ్రహీంపట్నం, అనకాపల్లిలో కుటీర పరిశ్రమ మాదిరిగా ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలున్నట్టు ఎక్సైజ్ అధికారులే గుర్తించారు. ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమేనని తేలిపోయింది. బెల్ట్ షాపులు, అనధికార పర్మిట్ రూమ్‌లలో ఈ నకిలీ మద్యం తాగినవారు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక బీసీ నాయకుడైన జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్టు చేసి కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఆలయాల్లోనూ భక్తులకు రక్షణ లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో కూడా భక్తులకు రక్షణ లేకుండా పోయింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులను వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద కక్షసాధింపు చర్యలకు ఉపయోగిస్తున్నారు. ఈ 17 నెలల కాలంలోనే మూడు చోట్ల ఆలయాల్లో ప్రమాదాలు జరిగి అమాయకులైన భక్తులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నిన్నటికి నిన్న కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో 9 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే దాన్నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చేందుకు జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారు. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం బయటపడి నెల రోజులవుతుంటే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి ములకలచెరువు నకిలీ మద్యం తయారీ యూనిట్‌తో సంబంధం ఉందనే కదా ఆయన్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. అలాంటప్పుడు అతడిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు కారకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు మభ్యపెట్టారే కానీ ఆయన మీద చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? కానీ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ ను బయటపెట్టిన జోగి రమేశ్ వైయస్ఆర్‌సీపీ నాయకుడు కాబట్టి అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జనార్ధన్‌రావుతో జోగి రమేశ్‌కి సంబంధాలున్నట్టు ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తీసుకున్న ఫోటో చూపించి అరెస్టు చేయడం దుర్మార్గం. ఇదే జనార్దన్‌రావుతో సంబంధాలున్న జయచంద్రారెడ్డి జోలికి పోవడం లేదు. నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిన స్పీకర్ అయ్యన్నపాత్రుడి అనుచరుడు రుత్తల రామును, తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, ఆయన తమ్ముడిని అరెస్టు చేయలేదు. నాడు టీడీపీ నాయకులు వైయస్ జగన్‌ని పదే పదే బూతులు తిడుతుంటే, దానిపై చంద్రబాబుతో మాట్లాడాలని జోగి రమేశ్ ఆయన ఇంటికి వెళితే దాన్ని మనసులో పెట్టుకుని జోగి రమేశ్‌ని అరెస్ట్ చేశారు. వారి దృష్టిలో ఇది ఆయన చేసిన తప్పు. టెక్నాలజీ తెలిసినోడు ఇన్ని ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నట్టు? అమెరికాకు కూడా సాధ్యంకాని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తనకి తెలుసనని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు, 17 నెలలుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి సరఫరా చేసి తాగిస్తుంటే ఎందుకు పట్టుకోలేకపోయారు? మోంథా తుపాన్‌కే మోకాలడ్డు పెట్టిన వ్యక్తికి నకిలీ మద్యం అరికట్టడం సాధ్యం కాలేదా? శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తుతారని, వారికి రక్షణ కల్పించాలన్న ఆలోచన చంద్రబాబు బుర్రకు తట్టకపోవడం ఏంటి? నకిలీ మద్యం కారణంగా బస్సు ప్రమాదం జరిగి 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే టెక్నాలజీ తెలిసిన చంద్రబాబు ఎందుకు కాపాడలేకపోయారు? అమెరికా దగ్గర లేని గొప్ప టెక్నాలజీ తన దగ్గర ఉన్నప్పుడు ఆలయాల్లో మూడుచోట్ల ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో భక్తులు చనిపోతుంటే ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నారో చెప్పాలి. రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా దారుణాలు జరిగి అమాయక భక్తులు చనిపోతుంటే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? టీడీపీ ఎమ్మెల్యే హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? గతంలో 2014-19 మధ్య ఇదే కూటమి ప్రభుత్వంలో జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో కూడా 29 మంది చనిపోయారు. విజయవాడలోని ఆలయాలను చంద్రబాబు నిర్మోహమాటంగా కూల్చివేయించాడు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కాశీబుగ్గలో ప్రమాదం జరిగింది. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాష్ట్రాన్ని దోచుకునే హక్కులను చంద్రబాబు రాసిచ్చేశాడు. ముఖ్యమంత్రిగా పరిపాలన, ప్రజల భద్రతను గాలికొదిలేశాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏ ఒక్క ఆలయంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు జరిగి భక్తులు చనిపోయింది లేదు. కానీ టెక్నాలజీ తెలిసీ, హిందూ ధర్మాన్ని కాపాడతామని వాగ్ధానం చేసిన చంద్రబాబు హయాంలోనే వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయి. లండన్ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పదే పదే విదేశాలకు తిరుగుతున్న చంద్రబాబు ఏ కార్యక్రమం మీద వెళ్తున్నారో స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. ఆ ఖర్చుల వివరాలు కూడా ప్రజల ముందుంచాలి. గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉండగా రెండుసార్లు తన కుమార్తెలను చూడటానికి లండన్ పర్యటనకు వెళ్లారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అలాగే లండన్‌లో సీఎం చంద్రబాబుకి ఏ వ్యక్తిగత కార్యక్రమం ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఆలయాల్లో దర్శనం కోసం వచ్చిన భక్తులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కళ్ల ముందే కనిపిస్తుంటే ఎల్లో మీడియాలో మాత్రం చంద్రబాబుకి మోంథా తుపాన్‌ని అరచేతిలో బంధించి విసిరి పారేశాడని ఎలివేషన్లు ఇస్తున్నారు. మోంథా తుపాన్ కారణంగా పంట నష్టం జరిగి రైతులు అల్లాడిపోతుంటే వాటిని పట్టించుకోరు. నారా లోకేశ్ ఆర్టీజీఎస్ ఆఫీసులో కంప్యూటర్ల ముందు కూర్చుని ఫొటోలు బయటకు వదిలి ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. తుపాన్ బాధితులను వైయస్ జగన్ నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లలోనే ఉంచి షెల్టర్ జోన్లుగా వాడారు. వైయస్ జగన్ తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థ ఈరోజున ఉండి ఉంటే ఈపాటికే ఎన్యుమరేషన్ పూర్తయి ఉండేది. రాష్ట్ర రైతాంగానికి క్రాప్ ఇన్సూరెన్స్ జరిగి ఉండేది. పంట నష్టం అంచనా సాయంత్రానికి వచ్చేది. కానీ టెక్నాలజీ పేరు చెప్పుకునే చంద్రబాబు రైతులను ఏమి ఉద్ధరించినట్టు? మోంథా తుపాన్‌తో అల్లాడిపోతున్న రైతులను ఆదుకోకుండా చంద్రబాబు లండన్ పారిపోతున్నాడు. చంద్రబాబు సీఎంగా ఉంటేనే దోచుకోవడానికి వాటాలు పంచుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎల్లో మీడియా చంద్రబాబు ఏం చేయకపోయినా ఆకాశానికి ఎత్తేస్తుంది. ఆయనకు జాకీలేస్తున్న ఎల్లో మీడియా ప్రతినిధులకు ప్రజల సొమ్మును అప్పనంగా చంద్రబాబు రాసిచ్చేస్తున్నాడు. చంద్రబాబుకి చేతనైతే వైయస్ జగన్ కన్నా మిన్నగా పాలన చేసి చూపించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా బాబూ.. నకిలీ మద్యం టీడీపీ నాయకుల కుటీర పరిశ్రమ అవునా కాదా? రాష్ట్రవ్యాప్తంగా వెలసిన నకిలీ మద్యం కుటీర పరిశ్రమలకు ఆద్యుడెవరు? నకిలీ లిక్కర్ వ్యవహారం బయటపడిన తర్వాత, ప్రతి మూడు బాటిల్స్‌లో ఒకటి నకిలీ మద్యమే అని తెలిసినా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్లో నకిఖీలు ఎందుకు చేయలేదు? జనార్దన్‌రావుతో డ్రామాలు ఆడిస్తున్నది ఎవరు? జయచంద్రారెడ్డి మీద ఇంతవరకు ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు? ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని తెలిసినప్పుడు తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఎందుకిచ్చారు? నకిలీ మద్యం వ్యవహారంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా ఎందుకీ బుకాయింపులు? మీరే నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు నడిపిస్తూ వైయస్ఆర్‌సీపీ మీద నిందలు మోపుతారా? డైవర్షన్ కోసం జోగి రమేశ్ పేరును తెరపైకి తెచ్చి డ్రామాలాడుతున్న మాట వాస్తవమా కాదా?