విజయవాడ: వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను ఇరికించే కుట్రకు తెరలేపింది. ఏ1 జనార్థనరావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయనను ఇరికించేందుకు ప్లాన్ చేశారు. నకిలీ మద్యం మాఫియా నడిపిన టీడీపీ నేతలను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా వైయస్ఆర్‌సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ కేసులో జోగి రమేష్‌పై అక్రమ కేసు పెట్టి ఆదివారం తెల్లవారుజామున ఆయన్ను అరెస్టు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రామును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఇంటి వద్ద వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ భారీగా పోలీసుల మోహరించారు. ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశా: మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదని భార్య, పిల్లల మీద ప్రమాణం చేశానని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు రాక్షసానందం పొందడానికే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసేందుకు తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. మా నాన్న లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీ: జోగి రమేష్ కుమారుడు రాజీవ్ `పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి` అని డిమాండ్ చేశారు.