పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే  వివాదాలకు పరిష్కారం

ఐరాసలో భారత్‌ తరఫున ప్రసంగించిన మిథున్‌రెడ్డి 

ఢిల్లీ: పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే  వివాదాలకు పరిష్కారం ల‌భిస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట ఎంపీ  మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత్‌ తరఫున ఆయన తాజాగా ప్రసంగించారు. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రసంగాన్ని పోస్ట్‌ చేసింది.

అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన భారత ప్రతినిధిగా మాట్లాడారు. పైరసీ, సాయిధ దోపిడి నిరోధానికి  కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్  అభ్యంతరాలను మిథున్‌రెడ్డి తెలియజేశారు. 

Image

ఆయన ప్రసంగం.. ‘‘పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే  వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని భారత్ విశ్వసిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశం. ఐక్యరాజ్యసమితి విధివిధానాలకు మా దేశం కట్టుబడి ఉంది. వర్తకం, పెట్టుబడులలో తలెత్తే వివాదాల పరిష్కారాలకు ఐక్యరాజ్యసమితి విధానాలకు అనుగుణంగా పనిచేస్తోంది. ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ  పరిష్కార విధానాల ద్వారా సమస్యలను పరిష్కరిద్దాం 
అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల మధ్య వివాదాలను కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు. వ్యక్తిగత మానవ హక్కులు,  న్యాయ సౌలభ్యం, అంతర్జాతీయ సంస్థల స్వతంత్ర పని విధానాల మధ్య సమతుల్యత అవసరం. అంతర్జాతీయ సంస్థల మధ్య వివాదాల పరిష్కార సమయంలో దౌత్యపరమైన రక్షణలు అవసరం.

పైరసీ, ఆయుధాల దోపిడి నిరోధానికి సమగ్రమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ అవసరం ఉంది. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలి. కొత్త టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా వీటిని నిరోధించాలి. ఆయుధాల దోపిడీ నిరోధానికి సముద్ర చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను పరిగణలోకి తీసుకొని సముద్రంలో జరిగే ఆయుధాల దోపిడి నివారించాలి

స్టేట్స్ సక్సేషన్ విషయంలో పారదర్శక విధానాలు అవసరం. ఈ అంశంలో భీమల్ , పటేల్ నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును భారత్ స్వాగతిస్తోంది. జఠినమైన  ఈ అంశంలో  స్పష్టమైన పాలనాపరమైన విధివిధానాలు అవసరం’’ అని మిథున్‌రెడ్డి అన్నారు.
 

Back to Top