ఆత్మా పథకం కింద ఏపీకి రూ. 92 కోట్లు 

రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రుల జవాబు

ఢిల్లీ: ఆత్మా (అగ్రికల్చరల్‌ టెక్నాలాజికల్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ) పథకం కింద 2014-15 నుంచి ఇప్పటి వరకు దాదాపు 92 కోట్ల రూపాయలను కేంద్రం గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ కింద విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ శుక్రవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆత్మా పథకం అమలు కోసం ప్రతి రెండు గ్రామాలకు ఒక రైతుమిత్రను నియమించేందుకు కేంద్రం అనుమతించినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఈ పథకం కింద రైతు మిత్రులను గుర్తించలేదని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి రైతు వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు తలపెట్టిన విస్తరణ సంస్కరణలను పల్లె పల్లెకు చేర్చడం ఆత్మ పథకం ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. రైతుల అవసరాలకు అనుగుణంగా ఆత్మా పథకం కింద పనిచేసే రైతు మిత్రలు టెక్నాలజీ విస్తరణ కార్యాచరణను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారు. రైతుల సామర్థ్యాన్ని పెంచడం, అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మెళకువలు నేర్చుకోవడంలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను పొందగలరు’ అని పేర్కొన్నారు.

ధాన్య సేకరణలో ప్రైవేట్‌కు అనుమతి
రాజ్య సభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి దాన్వే రావుసాహెబ్‌ దాదారావు సమాధానమిచ్చారు. కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్య సేకరణకు ప్రైవేట్‌ ఏజెన్సీలు, స్టాకిస్టులను అనుమతిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌’ (పీఎం-ఆషా)ను అక్టోబర్‌ 2018లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు ధాన్య సేకరణ చేసే ప్రైవేట్‌ ఏజెన్సీల పనితనాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ఈ పథకం ఉద్దేశమన్నారు. నూనె గింజల సేకరణ కోసం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సైతం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2017-18 సీజన్లో ఈ పథకాన్ని జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలలో అమలు చేసి  ప్రైవేట్‌ ఏజెన్సీలు, స్టాకిస్టుల ద్వారా కనీస మద్దతు ధరకు సేకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా జరిపే ధాన్య సేకరణ కోసం ప్రభుత్వం ఎలాంటి నిధులను కేటాయించలేదని ఆయన స్పష్టం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top