తాడేపల్లి: రబీ సీజన్‌లో మొక్కజొన్న పండించిన రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తమ ఉత్పత్తులను డిస్ట్రెస్ సేల్‌కు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయ శాఖ రెండవ ముందస్తు అంచనాల ప్రకారం రబీలో మొక్కజొన్న సాగు 1.96 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 16.31 లక్షల టన్నులుగా అంచనా వేయబడిందని, కానీ వాస్తవానికి 5.02 లక్షల హెక్టార్లలో సాగు జరిగి సుమారు 30 నుంచి 35 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో సుమారు 12.41 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్‌కు రూ.2400గా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో రైతులు రూ.1400 నుంచి రూ.1800 మధ్యే తమ పంటను అమ్ముకోవాల్సి వస్తోందని అన్నారు. దీంతో క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ.900 వరకు నష్టం వస్తోందని, పంట ఉత్పత్తి ఖర్చు రూ.2000–2200 మధ్య ఉండటంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లుతున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్‌టీఆర్, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికంగా మొక్కజొన్న సాగు జరిగిందని చెప్పారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో మార్కెట్‌లో పోటీ లేక రైతులు మధ్యవర్తుల ఒత్తిడితో తక్కువ ధరలకు పంటను విక్రయించాల్సి వస్తోందని ఆరోపించారు. గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకు కొనుగోలు జరుగుతోందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఒక్క మొక్కజొన్న రైతులకే రూ.2500 నుంచి రూ.3000 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్నకు ఎంఎస్పీ ప్రకారం వెంటనే కొనుగోలు చేపట్టాలని, ప్రతి మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని, అకాల వర్షాలు, గాలివానలతో నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎం.వి.ఎస్ నాగిరెడ్డి కోరారు.