ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థులను దేశీయ వర్సిటీల్లో సర్దుబాటు చేయాలి

రాజ్యసభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
 

న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినందున దేశీయ వైద్య విద్యా సంస్థల్లో వారికి ప్రవేశం కల్పించి చదువు కొనసాగించేలా ఆదుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశం లేవనెత్తారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో వైద్య విద్యను అభ్యసిస్తూ చిక్కుబడిపోయిన వేలాది మంది భారతీయ విద్యార్ధులను క్షేమంగా మాతృదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుబడిపోయి తీవ్రమనోవ్యధ అభవించిన వైద్య విద్యార్ధులు ఇప్పుడు అర్థాంతరంగా నిలిచిపోయిన తమ చదువులతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మానవతాధృక్పదంతో, ఒక అరుదైన కేసుగా పరిగణిస్తూ ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన మెడికల్‌ విద్యార్ధులు దేశీయ యూనివర్శిటీలలో తమ చదువును కొనసాగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

దేశంలో ఏదైనా మెడికల్‌ కళాశాల మూతబడిన పక్షంలో విద్యార్ధులను వివిధ మెడికల్‌ కళాశాల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తోంది. ఉక్రెయన్‌ నుంచి తిరిగి వచ్చిన మెడికల్‌ విద్యార్ధుల విషయంలో కూడా ప్రభుత్వం అలాంటి ఒక ప్రత్యేక బదిలీ విధానాన్ని రూపొందించాలని శ్రీ విజయసాయి రెడ్డి సూచించారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు తాత్కాలికంగా వారు ఇక్కడి వైద్య కళాశాలల్లో విద్యను కొనసాగించేలా చూడాలని అన్నారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధుల దయనీయ పరిస్థితిని ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుని వారి భవిష్యత్తును కాపాడేందుకు, దేశీయ మెడికల్‌ కళాశాలల్లో వారి చదువులు నిరంతరాయంగా కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top