విశాఖ: కాపుల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కాపు సామాజిక భవన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన కాపుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాపు ఉద్యమ సమయంలో గత ప్రభుత్వం పెట్టిన కేసులను వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎత్తేశారని చెప్పారు. తుని రైలు దహనం కేసులో కాపు ఉద్యమ నాయకులపై రైల్వే పోలీసులు పెట్టిన కేసులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రితో చర్చలు జరిపి కేసులు ఎత్తివేతకు కృషి చేస్తామని పేర్కొన్నారు.