డియస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి

ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖరరెడ్డి డిమాండ్

సుప్రీం కోర్టు, ఎన్‌సీటీఈ నిబంధనలను తుంగలో తొక్కి అర్హత లేని వారికి టీచర్ పోస్టులా?

ప్రభుత్వ తీరుపై చంద్రశేఖర రెడ్డి తీవ్ర ఆక్షేపణ.

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖరరెడ్డి.

తాడేపల్లి: రాష్ట్రంలో జరిగిన డియస్సీ (DSC) రిక్రూట్‌మెంట్‌లో భారీ అక్రమాలు జరిగాయని, సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర వేదనకు గురవుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం డియస్సీ అక్రమాలపై నిరంతరం అసత్యాలు మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్, విద్యాహక్కు చట్టం, ఎన్‌సీటీఈ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి.. కనీసం టెట్ (TET), డీఎడ్, బీఎడ్ అర్హతలు లేని వారికి, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాని వారికి కేవలం స్పోర్ట్స్ కోటా పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు సంబంధించిన అసోసియేషన్ల కోటాలోనే వందలాది పోస్టులు కేటాయించి విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే 'సిబిఐ (CBI) విచారణ' జరపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

రిజర్వేషన్ల ఉల్లంఘన.. అధికారుల వాదన అసంబద్ధం!

అధికారులు హారిజాంటల్ రిజర్వేషన్ల పేరుతో అభ్యర్థులను మోసం చేస్తున్నారు. 
 వర్టికల్ రిజర్వేషన్: ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌తో పోలిస్తే.. గ్రౌండ్ ఫ్లోర్ ఓసీ, మిగిలిన ఫ్లోర్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు కేటాయించినట్లు ఉంటుంది. ఇందులో ఒకరి ఫ్లోర్‌లోకి మరొకరిని మార్చలేం. ఒకవేళ ఖాళీలు ఉంటే 'క్యారీ ఫార్వర్డ్' చేయాలి. ఎస్సీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీ (ఓసీ) లో ఎంపికైతే, ఎస్సీ కోటా పోస్టును ఆ కేటగిరీ వారికే ఇవ్వాలి.
హారిజాంటల్ రిజర్వేషన్: ఒక ఫ్లోర్‌లోని ప్లాట్లలో మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు అంతర్గతంగా రొటేట్ అవుతుంది. ఒక మహిళా అభ్యర్థి ఓసీ జనరల్‌లో భర్తీ అయితే, అదనంగా మహిళా కోటా ఇవ్వాల్సిన అవసరం లేదు.

 "వన్ ఈస్ట్ వన్ (1:1) రేషియోలో పిలిచామని చెబుతూనే.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల స్పోర్ట్స్ కోటాలో ఎవరు వస్తారో తెలియక, ఆ తర్వాత కొంతమందిని తొలుత ఎంపికైన జాబితా నుండి తొలగించి స్పోర్ట్స్ కోటా వారిని సర్దుబాటు చేశామని కోన శశిధర్ చెప్పడం అత్యంత అసంబద్ధం. అధికారుల దగ్గర అసలు డేటా లేదా? స్పోర్ట్స్ కోటా వాళ్లు ఏ కేటగిరీకి చెందుతారో ముందుగా తెలియకుండానే నోటిఫికేషన్ ఇచ్చారా? సర్దుబాటు పేరుతో అర్హులైన నిరుద్యోగులను బలిపశువులను చేశారు."

కాల్ లెటర్ల ప్రక్రియలో పచ్చి అబద్ధాలు.. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైతే అన్నింటికీ కాల్ లెటర్స్ ఇచ్చి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మిగిలిన ఖాళీలను ఇతరులతో భర్తీ చేశామన్న అధికారుల మాట పచ్చి అబద్ధం. రిక్రూట్‌మెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మహిళా అభ్యర్థి టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ లాంటి ఐదు పోస్టులకు ఎంపికైతే.. ఆమె దరఖాస్తులో మొదట ఆప్షన్ ఇచ్చిందనే సాకుతో కేవలం 'టీజీటీ' పోస్టుకు మాత్రమే కాల్ లెటర్ ఇచ్చి వెరిఫికేషన్ చేశారని నిరూపించారు. అంతకంటే ఉన్నతమైన ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టులకు ఎందుకు కాల్ లెటర్ ఇవ్వలేదని సదరు అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. 

సెలక్షన్ లిస్ట్ లేదు.. గైడ్‌లైన్స్ అన్నీ తుంగలో తొక్కారు!

ముందుగా 'సెలక్షన్ లిస్ట్' ప్రకటించకుండానే వ్యక్తిగతంగా కాల్ లెటర్స్ పంపి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం ఏ సంప్రదాయం.  2వ తేదీన వెరిఫికేషన్ ముగిశాక, 15వ తేదీన జాబితా విడుదల చేసి దాన్ని 'సెలక్షన్ లిస్ట్' అనడం హాస్యాస్పదమని, దాన్ని 'సెలెక్టెడ్ లిస్ట్' అనాలని ఎద్దేవా చేశారు.

సుప్రీం కోర్టు, ఎన్‌సీటీఈ (NCTE), విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడిగా నియమితుడవ్వడానికి 'టెట్' (TET) క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. 30 ఏళ్ల అనుభవం ఉన్న టీచరైనా టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం తీసేయాలని నిబంధనలు చెప్తుంటే.. కూటమి ప్రభుత్వం మాత్రం డియస్సీ రాయకపోయినా, టెట్ లేకపోయినా, డీఎడ్/బీఎడ్ అర్హతలు లేకపోయినా కేవలం 'శాప్' (SAAP) ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటే చాలని పోస్టులు ఇవ్వడం సమాజానికి ఏ విధమైన సందేశం ఇస్తుందని ప్రశ్నించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు భవిష్యత్తులో కోర్టులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అర్హత లేని స్పోర్ట్స్ సర్టిఫికేట్లు.. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా రాని వారికి ఉద్యోగాలు!

స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక చేసిన 382 మంది అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారి సర్టిఫికేట్లు బయటపెడితే ప్రభుత్వానికి అవమానం తప్పదు.  ఎస్జీటీ పోస్టుకు విద్యార్హత కాలమ్‌లో డిఎడ్ బదులు 'DIED' అని రాశారు. మరొకరు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేషన్ స్పెల్లింగ్‌లో 'Inter' అని కూడా సరిగ్గా రాయలేదు. తండ్రి పేరు స్పెల్లింగ్, ఇంగ్లీష్ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసిన వారు 'B.Ed' స్పెల్లింగ్ కూడా సక్రమంగా రాయలేని వారికి ఉద్యోగాలిచ్చారు.
361 నంబర్ దరఖాస్తుదారుడు ఒక్క డాక్యుమెంట్ కూడా అప్‌లోడ్ చేయకపోయినా స్కూల్ అసిస్టెంట్ పోస్టు కేటాయించారు. గత ఏడాది సెప్టెంబర్ 15 ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్న పేర్లు.. నిన్న విడుదల చేసిన 382 మంది జాబితాలో మాయమయ్యాయి. 
కనీసం ఇంటర్ కాలేజీ పోటీలు కూడా కాకుండా, ఒకే కాలేజీలో పక్కపక్క సెక్షన్ల మధ్య జరిగిన ఆటల (ఇంట్రామ్యూరల్) సర్టిఫికేట్లను బ్యాకప్‌గా పెట్టి పోస్టులు ఇచ్చారు.

టీడీపీ నేతల అసోసియేషన్లకే వందలాది పోస్టులు!

స్పోర్ట్స్ కోటా అంతా అధికార పార్టీ నేతల పంపకాలే. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రెసిడెంట్‌గా ఉన్న 'సాఫ్ట్ బాల్ అసోసియేషన్' కోటాలో ఏకంగా 38 పోస్టులు ఇచ్చారు. కూటమి ఎంపీ భరత్ ప్రెసిడెంట్‌గా ఉన్న 'జూడో అసోసియేషన్' కోటాలో 39 టీచర్ పోస్టులు కేటాయించారు.  కొత్తగా తీసుకొచ్చిన 'బాల్ బ్యాడ్మింటన్' అసోసియేషన్ కింద 48 పోస్టులు భర్తీ చేశారు.
చివరకు 'బ్రిడ్జ్' (పేకాట) ను కూడా స్పోర్ట్స్ కోటా కింద చేర్చి పోస్టులు ఇవ్వాలని చూశారని, ఆ జీవోను వెనక్కి తీసుకున్నారంటేనే మీ తప్పును మీరు ఒప్పుకున్నట్లు కాదా అని ప్రశ్నించారు.

బాధిత అభ్యర్థుల వివరాలు ఇవే..

    జగదీష్ నాయక్ (కడప జిల్లా): ఎస్జీటీ ఉర్దూ పోస్టుకు దరఖాస్తు చేసిన ఎస్టీ అభ్యర్థి జగదీష్ నాయక్‌కు రోస్టర్ పాయింట్ల ఉల్లంఘన వల్ల అన్యాయం జరిగింది. ఎస్టీ కోటాలో ఉన్న మూడు పోస్టులకు ముగ్గురిని పిలిచి, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళను మొదటి రోస్టర్ పాయింట్ 58లో భర్తీ చేయకుండా, 75లో భర్తీ చేసి.. మొదటి దాన్ని కేరీ ఫార్వర్డ్ వేకెన్సీగా చూపించి జగదీష్ నాయక్‌ను ఉద్యోగం లేకుండా పక్కన పెట్టారు.

    దుర్గయ్య: స్పోర్ట్స్ కోటా కింద గోల్డ్ మెడల్ వచ్చిన దుర్గయ్య దరఖాస్తు చేయలేదని అధికారులు అబద్ధం చెప్తున్నారు. తానే స్వయంగా దరఖాస్తు చేసి అభ్యంతరాల రిమార్కుల్లో కూడా మెన్షన్ చేశానని సదరు అభ్యర్థి చెప్తున్నారు.

    నవీన్ (SCERT అభ్యర్థి): ఎస్ సీ ఈ ఆర్ టీ లో పనిచేస్తున్న నవీన్ అనే అభ్యర్థికి సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంక్, తెలుగులో 6వ ర్యాంక్ వచ్చినా ఆయన అభ్యర్థిత్వాన్ని ఎందుకు తిరస్కరించారో అధికారులు సమాధానం చెప్పడం లేదు.

ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగొద్దు.. సిబిఐ విచారణే మా డిమాండ్!

డియస్సీలో లంచాలు అడుగుతున్నట్లు విడుదలైన ఆడియో టేపులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కోరారు. ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులను వైయస్సార్సీపీపైకి ఉసిగొల్పి తిట్టించడం ప్రభుత్వానికి తగదన్నారు. ఉద్యోగాలు సాధించిన వారిని అభినందిస్తున్నామని, కానీ అన్యాయమైన తోటి అభ్యర్థులపై సానుభూతి చూపాల్సింది పోయి రాజకీయ నాయకుల మాటలు విని వైయస్ జగన్‌ను, వైయస్సార్సీపీని విమర్శించడం సరికాదని హితవు పలికారు. డియస్సీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన ఈ భారీ అక్రమాలపై తక్షణమే 'సిబిఐ విచారణ' జరపాలని, అన్యాయానికి గురైన నిరుద్యోగులందరికీ పునరాలోచించి న్యాయం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పర్వత చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top