కర్నూలు ప్రజలు తిరుగబడుతారని బాబు తప్పుడు హామీలు  

13 జిల్లాల సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణ బిల్లు

కావాలనే వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకుంది

ఎమ్మెల్యే హాఫిజ్‌ఖాన్‌

తాడేపల్లి: రాష్ట్ర విభజన అనంతరం రాజధానిగా కర్నూలు ఉండాల్సి ఉండగా, ఎక్కడ తిరగబడుతారోనని చంద్రబాబు 2014 రిపబ్లిక్‌ డే వేడుకల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ మండిపడ్డారు. కర్నూలు ప్రజల హక్కులను కాలరాస్తూ..ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అమరావతిని రాజధాని చేశారని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాతో కలిసి హాఫీజ్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. మూడు, నాలుగు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు గమనిస్తే..అసెంబ్లీలో వికేంద్రీకరణపై క్షుణ్ణంగా పరిశీలించి, కచ్చితంగా ఏపీ కలిసికట్టుగా ఉండాలని, మరో ఉద్యమం రాకూడదని, ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రతి జిల్లా బాగుండాలని బిల్లు తీసుకుని వచ్చారు. మూడు రాజధానులు తీసుకుని వస్తే మూడు ప్రాంతాలు బాగుంటాయని నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్ల పాలన చూస్తే..చంద్రబాబు 2014 ఆగస్టు 15న కర్నూలుకు వచ్చి స్మార్ట్‌ సిటీ అన్నారు..టెక్స్‌టైల్‌ పార్క్‌,సీడ్‌ హబ్‌ అన్నారు. రాజధాని అన్నది కర్నూలు ప్రజల హక్కు అని ఆరోజు చంద్రబాబు తీయ్యని మాటలు చెప్పి..ఆ తరువాత అమరావతిని రాజధానిని చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని చేయాలి. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. అయితే చంద్రబాబు అమరావతిని రాజధానిని పెట్టుకుంటే..మా జిల్లా న్యాయవాదులు రోజుల తరబడి ఆందోళన చేపట్టారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ప్రతి ప్రాంతం తిరిగారు కాబట్టి..ఆ ప్రాంతాల ఆకాంక్షల మేరకు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీలో అల్లరి చేశారు. కౌన్సిల్‌లో సంఖ్యాబలం ఉందని, చంద్రబాబు ఏకంగా గ్యాలరీలో కూర్చొని డైరెక్షన్‌ ఇస్తూ చైర్మన్‌ను ప్రభావితం చేశారు. రూల్స్‌ ప్రకారం చేయకుండా చంద్రబాబుకు విధేయుడిగా నిలబడేందుకు ఎంతో సందిగ్ధ పరిస్థితిలోకి వెళ్లారు. హక్కు ఉందని విచక్షణాధికారంతో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. ఆ ప్రతిపాదన చంద్రబాబు నుంచే వచ్చింది. చంద్రబాబుకు రెండు, మూడు గ్రామాలు కావాలా? రాష్ట్రంలోని 13 జిల్లాలు కావాలో ఆలోచన చేయాలి. టీడీపీ నాయకులు మా జిల్లాలో మొహం చాటేశారు. ఎన్ని రోజులు అడ్డుకున్నా కూడా మూడు రాజధానులు తప్పనిసరి. ఒక్క పని అయినా కర్నూలు నగరానికి చేసి ఉంటే మేం ఈ రోజు ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాప్రాంతానికి జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ వస్తే అభివృద్ధి చెందుతుంది. దీన్ని చంద్రబాబు అడ్డుకోవడం బాధాకరం. 
 

Back to Top