మైనార్టీల రిజర్వేషన్లను రద్దుచేయబోమని బీజేపీతో చెప్పించగలవా బాబూ..?

మీడియా స‌మావేశంలో  వైయ‌స్‌ఆర్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్ 

మైనార్టీలపై చంద్రబాబుది కపటప్రేమ.. బీజేపీతో ఊసరవెల్లి రాజకీయం!

వైయ‌స్ జగన్‌గారిపై విషంకక్కడంలో చంద్రబాబు, రామోజీలది ఒకటే బడి..!

మైనార్టీల సంక్షేమానికి జగన్ గారు రూ.23 వేల కోట్లు ఖర్చుపెట్టారు

2024 ఎన్నికల్లో చంద్రబాబుకు మైనార్టీలు తగిన బుద్ధి చెబుతారు!

మ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

క‌ర్నూలు:  మైనార్టీల రిజర్వేషన్లను రద్దుచేయబోమని బీజేపీతో చెప్పించగలవా  అంటూ  వైయ‌స్‌ఆర్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్ చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. కర్నూలులో వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌ మీడియాతో మాట్లాడారు.

బాబు, రామోజీలది ఒకటే బడిః
ఈనాడు రామోజీరావు నిజస్వరూపం ప్రతీరోజూ తన పత్రిక ద్వారా తెలియచెబుతున్నారు. అందులో భాగంగా ఇవాళ మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిపై.. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నంలో భాగంగా ఒక కథనం రాసుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలు రాగానే మైనార్టీలు గుర్తుకొచ్చి ప్రేమ ఒలకబోయడం చూస్తున్నాం. ఆయనకు ప్రతిపక్షంలో ఉంటేనే మైనార్టీలు కనిపిస్తారు, గుర్తుకొస్తారు గానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనకెందుకు మేం కనిపించం..? చంద్రబాబు పూటకో మాట మాట్లాడటం.. ఆయనకు రామోజీరావు భజన చేయడం.. ఇద్దరిదీ ఒకటే బడిగా చెప్పుకోవచ్చు. 

బీజేపీ పొత్తుపై బాబుది ఊసరవెల్లి నైజంః

చంద్రబాబూ.. నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను..? బీజేపీతో నేను ఎన్నటికీ పొత్తు పెట్టుకోనన్నావు. ఒకసారి మాట తప్పి పొత్తు పెట్టుకున్నావు. ఆ తర్వాత నరేంద్రమోదీ మోసం చేశాడన్నావు. అనవసరంగా పొత్తు పెట్టుకున్నాను.. ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని నమ్మబలికావు. ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళీ అదే బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఇదంతా నిజంకాదా..? అంటే, నీ అవసరాలను బట్టి రంగులు మార్చుకుంటావా..? నీకంటూ ఒక స్టాండ్‌ ఉండదా..? ఈరోజు నీ స్వార్థప్రయోజనాలకు ఎలాంటి స్టాండైనా తీసుకుంటావని.. నీ రంగులు మార్చే ఊసరవెల్లి నైజం ప్రతీ ఒక్కరికీ అర్ధమైంది. 

మైనార్టీలకు నీవు చేసిన మోసంపై చర్చిద్దామా?
మీరు మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏం చేశారు..? ఈ విషయంపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. రంజాన్‌ తోఫా పేరిట ఏదో రూ.300 ల సరుకుల్ని మైనార్టీలకు ఇచ్చి, దాన్ని పదంతలు చేసి ప్రచారం చేసుకోవడం చాలా హాస్యాస్పదం. నిజంగా, మీకు మైనార్టీలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉన్నట్లైతే.. జగన్‌మోహన్‌రెడ్డి గారు మాకు గడచిన ఐదేళ్లల్లో ఏమేమి చేశారో ఆ విధంగా చేసేవారు. మైనార్టీవర్గాలపై మీకు ప్రేమ లేదు కాబట్టి.. మా మీద మీకెప్పటికీ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికైనా మంత్రి పదవి ఎందుకివ్వలేదు..? ఇదేనా మీకు మా పట్ల ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి..? 

మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహానేత ‘వైఎస్‌ఆర్‌’
మైనార్టీల రిజర్వేషన్లకు సంబంధించి నువ్వెప్పుడైనా ఆలోచన చేశావా చంద్రబాబూ..? మాకోసం చేసిందేమీ లేదు. మైనార్టీలకు ఏం చేయాలన్నా మొట్టమొదటగా వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ్‌ మిశ్రా తదితర కమిషన్‌లు చెప్పాయి. మా రిజర్వేషన్ల హక్కులకు సంబంధించి  రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ సూచించిన అంశాలపైన ఏరోజైనా పరిశీలన చేశావా..? నిజంగా, నీకు మా మీద ప్రేమ ఉంటే మైనార్టీలకు మేలు చేసే కార్యక్రమం చేసి ఉండేవాడివి. అలా ఎప్పటికీ నువ్వు ఆలోచించలేదు. అన్ని అంశాల్లోనూ దళితుల కన్నా మైనార్టీలు వెనుకబడిపోయి ఉన్నారని ఆ కమిషన్‌లు నివేదిక ఇచ్చాయి. ఆ కమిషన్‌ల నివేదికలపై నువ్వేమీ చేయకపోతే.. మైనార్టీలకు రిజర్వేషన్లు దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు కల్పించారు. ముస్లిం రిజర్వేషన్లను కాపాడే ప్రయత్నం చేయకపోగా.. వాటిని పోగొట్టే ప్రయత్నం చేసింది నువ్వు కాదా చంద్రబాబు..? 

మైనార్టీల పిల్లలకు నాణ్యమైన చదువులుః
మైనార్టీల విద్యపై కూడా ఆ కమిషన్‌లు చాలా సూచనలు చేశాయి. వీళ్లకు సరైనరీతి ప్రణాళికాబద్ధంగా నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరముంది. మైనార్టీల్లో డ్రాపౌట్‌ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పింది. మరి, ఈ సూచనలపై చంద్రబాబు హయాంలో ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అదే ఇవాళ జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత, నవరత్నాల పథకాల్లో భాగంగా, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, విద్యాకానుకలతో మైనార్టీ విద్యార్థులు ఇంగ్లీషు మీడియంతో పాటు నాణ్యమైన విద్యను పొందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది మైనార్టీల పిల్లలు రూ.వేల కోట్ల ఖర్చుతో చదువుకుంటున్నారు.  
- ముస్లింలలో మాతాశిశుమరణాల సంఖ్య అధికంగా ఉందంటూ కమిషన్ల నివేదికలు చెబుతున్నాయి. ఇవాళ జగనన్న సంపూర్ణ పోషణ పథకం వచ్చాక మాత్రమే.. మైనార్టీల గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం చేకూర్చింది. తల్లులు, బిడ్డలు సరైన సమయంలో నాణ్యమైన పోషకాహారంతో సంతోషంగా ఉండటం వాస్తవం కాదా..? మరి, ఇలాంటి మేలైన పథకాలను మైనార్టీల కోసం చంద్రబాబు ఎందుకు చేయలేదు..? 

ముస్లిం మైనార్టీలకు సొంత ఇంటి కల నేరవేర్చుతున్న సీఎం జగన్ గారుః
అదేవిధంగా పేద ముస్లింలకు సొంతిళ్లు లేక, సరైన ఆస్తులు లేకపోవడంతో సమాజంలో వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయంటూ అవే కమిషన్‌లు నివేదికల్లో పేర్కొన్నాయి. ఇవాళ రాష్ట్రంలో చూస్తే.. జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన 31 లక్షల ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల కారణంగా సొంతిల్లు లేని మైనార్టీలు రాష్ట్రంలో లేరని మేం గర్వంగా చెబుతున్నాం. దాదాపు రాష్ట్రంలో 1 లక్షకు పైగా ముస్లీం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలిచ్చి.. వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది నిజం కాదా బాబూ..?  

రిజర్వేషన్లు తీసేయబోమని బీజేపీతో చెప్పిస్తావా బాబూ..?
బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో మా రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెబుతున్నారు..? ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు  తీసేస్తాం అని చెబుతున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి నల్లచట్టాల అమలుతో మైనార్టీలకు ఇబ్బందికరమైన ఒక వాతావరణాన్ని బీజేపీ వాళ్లు సృష్టిస్తున్నారు. మైనార్టీల పట్ల వివక్ష చూపేవిధంగా వ్యవహరిస్తామని వారు బహిరంగంగానే చెబుతున్నారు. మరి, అలాంటి బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం ఏంటి..? అదే బీజేపీతో మైనార్టీల రిజర్వేషన్లును తొలగించబోమని చంద్రబాబు చెప్పించగలడా..? 

ఎన్‌ఆర్‌సీని అమలు చేసేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేశాంః
ఎన్‌ఆర్‌సీతో ముస్లింలకు ఇబ్బందులు కలిగే వాతావరణం ఉన్నందున .. ఆంధ్రరాష్ట్రంలో దాన్ని అమలు చేయబోమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. అది ఇప్పటికీ, కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉంది. అయితే, ముఖ్యమంత్రి జగన్‌ గారు తీర్మానించిన దాన్ని అలాగే కొనసాగిస్తామని.. బీజేపీ అడుగులకు మడుగులు వత్తబోమని మీ నోటితో మీరు అనగలరా... చంద్రబాబూ? మీరు అనలేరు. అలాంటప్పుడు మైనార్టీల పక్షపాతి మీరా..? జగన్‌మోహన్‌రెడ్డి గారా..? సమాధానం చెప్పండి. 

మైనార్టీల సంక్షేమానికి రూ.23 వేల కోట్లు ఖర్చుపెట్టాంః
జనసేన చేయిపట్టుకుని బీజేపీతో పొత్తు అంటూనే, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీతో రాయబారాలు నడిపించడానికి నీకు సిగ్గనిపించడం లేదా ..బాబూ.? రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవశాలిగా చెప్పుకుంటూ ఇంత నీచమైన బతుకు బతకడం ఎందుకు..? మీ రాజకీయమంతా మీ అవసరాలకు తగ్గట్టు కులాలు, మతాలవారీగా అందర్నీ విడగొట్టి, గొడవలు పెట్టి అధికారంలోకి రావాలనేదే మీ అజెండా అని ప్రతీఒక్కరికీ తెలుసు. ఏ ఒక్కరోజూ మీరు పేదవాడి మేలు గురించి ఆలోచించింది లేదు. అదే మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మైనార్టీల సంక్షేమానికి డీబీటీ, నాన్‌డీబీటీ కింద వాళ్ల విద్య, వైద్యం, ఉపాధి, నివాసం కోసం రూ.23వేల కోట్లు ఖర్చుపెట్టారు. కనుకనే, ఇవాళ మైనార్టీలంతా తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. 

- వైఎస్‌ఆర్‌సీపీ నామినేటెడ్‌ పదవుల్లోనూ మైనార్టీలకు జగన్‌ గారు పెద్ద పీట వేశారు. డిప్యూటీ సీఎం, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ దగ్గర్నుంచి శాసన మండలి సభ్యులు, వార్డు మెంబర్లు, మండల, పట్టణ, నగర స్థాయిల్లో వైస్‌చైర్మన్‌ రెండో పదవిని క్రియేట్‌ చేసి మరీ అవకాశం కల్పించారు. దీనివల్ల సామాజిక న్యాయం జగన్‌ గారు చేతల్లో చేసి చూపించారు. కిందటి ఎన్నికల్లో నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. 4 గురికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో 7 గురు మైనార్టీలకు సీట్లు ఇచ్చి గెలిచే అవకాశం కల్పించారు. 

మైనార్టీల గుండెల్లో గుడికట్టుకున్న సీఎం జగన్‌ గారుః
మైనార్టీలందరినీ మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మొట్టమొదటి సారిగా ఎప్పుడూ జరగని విధంగా మా ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజమ్‌లకు రూ.5వేలు గౌరవ వేతనం పెంచారు. వక్ఫ్‌బోర్డు, ముస్లీం మైనార్టీ ఆస్తుల రక్షణ కోసం ఏకంగా జీవో నెంబర్‌ 60 జారీ చేశారు. ఈవిధంగా ప్రతీ అడుగులోనూ మైనార్టీల మేలు కోరి మా అందరికీ అండగా ఉన్న జగన్‌ గారిని ప్రతీఒక్క ముస్లీం సోదరుల కుటుంబీకులు గుండెల్లో గుడికట్టుకుని ఉన్నారు. కనుక, చంద్రబాబు, రామోజీరావులాంటోళ్లు ఎంత విషం కక్కినా మైనార్టీలంతా జగన్‌ గారి వెంటే ఉంటారు. ఆయన్నే మరోమారు ముఖ్యమంత్రి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలుః
ఉర్దూను సెకండ్‌ లాంగ్వేజీ చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదా..? తెలుగుదేశం పార్టీ ఏనాడైనా ఇలాంటి ఆలోచన చేయగలిగిందా..? అసెంబ్లీలో మైనార్టీల సబ్‌ప్లాన్‌ కోసం తీర్మానించింది కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. మైనార్టీల పట్ల ఏనాడూ చిత్తశుద్ధి చూపని చంద్రబాబు నాయుడుకు ఇదే చివరి ఎన్నికలుగా చెబుతున్నాం. 

Back to Top