విశాఖ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీది స్కీముల ప్రభుత్వమని..చంద్రబాబుది భూముల ప్రభుత్వమని..ఆయన పాలనలో అన్ని స్కాములేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ పరిపాలన వికేంద్రీకరణ చట్టం చేస్తే..చంద్రబాబు దాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏడాది క్రితం రాజధాని వచ్చి ఉంటే విశాఖ ఇంకా అభివృద్ధి జరిగేదన్నారు. విశాఖకు మేలు జరుగకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదని..ఆయనో జాతి నాయకుడని దుయ్యబట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించి..అందులో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు విశాఖ జిల్లా వ్యాప్తంగా సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏడాది కాలంగా విశాఖను పరిపాలన రాజధాని కాకుండా ఏరకంగా అడ్డుకోవాలని, ఉత్తరాంధ్రకు న్యాయం జరుగకుండా ఎలా చూడాలని చంద్రబాబు ఏరకంగా తాపత్రయపడుతున్నారో చూస్తున్నాం. ఏ ప్రాంతానికైనా న్యాయం చేస్తామంటే సహకరించే వారిని చూశాం కానీ చంద్రబాబు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, వివిధ ప్రాంతాల ప్రజల ఆలోచనపై అవగాహన చేసుకోవాలి. అన్ని ప్రాంతాలకు మంచి జరిగితే..రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి మేలు జరుగుతుందని వైయస్ జగన్ ఆలోచన చేస్తే..దాన్ని చంద్రబాబు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులపై ప్రకటన చేసి, చట్టం చేసి ఏడాది అవుతుందని, ఈ పాటికి అధికార వికేంద్రీకరణ జరిగి ఉంటే ఏడాది కాలంలో విశాఖ ఏ మేరకు అభివృద్ధి చెందేదో ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలి. ఒక పక్క ఉద్యోగ అవకాశాలు..ఒక పక్క అభివృద్ధి జరిగేది. ఏ నగరానికి లేనటువంటి వనరులు విశాఖకు ఉన్నాయి.ఏరకంగా చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలి. హైదరాబాద్‌తో పోటీ పడే అవకాశం ఉన్న నగరం విశాఖ. ఈ ప్రాంతానికి మేలు జరుగకూడదని కుయుక్తులు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి గుర్తింపు రాకూడదని తాపత్రయంతో ఉన్న నాయకుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇదే ప్రాంతంలో అడుగుపెడితే ఏ రకంగా బుద్ధి చెప్పారో చూశాం. చంద్రబాబు 13 జిల్లాలకు కాదు..13 గ్రామాలకు నాయకుడిగా మారారు. ఆయన జాతీయ నాయకుడు కాదు. ఆయన డబ్బులు పెట్టిన ప్రాంతం అభివృద్ధి చెందాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. ఈ రోజు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు విశాఖలో ఉంటున్నారు. ఇలాంటి నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారు. విశాఖ ఒక కులానికి చెందినది కాదు. చంద్రబాబు అనుకుంటున్న అమరావతి లాంటి కుల నగరం విశాఖ కాదు. వివిధ సాంప్రదాయాలు, సంస్కృతి, భాషాలకు చెందిన ప్రజలు నివసించే నగరం విశాఖ అని గుర్తు పెట్టుకోవాలి. ఇది అందరి నగరం. చంద్రబాబు నోరు తెరిస్తే..హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటుంటారు. అక్కడ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి అర్ధరాత్రి అమరావతి కరకట్టకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌ను విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటైనా వచ్చిందా?. నిన్న అమరావతి సభలో సీఎం వైయస్ జగన్‌ను నిందించే విధంగా మాట్లాడటం దుర్మార్గం. మాది స్కీముల ప్రభుత్వం..చంద్రబాబుది భూముల ప్రభుత్వం. అమరావతి ప్రాంతంలో భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి..ఇప్పుడు ఆ భూములకు విలువ తెచ్చేందుకు పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు..ఆయన అమలు చేసిన ఒక్క పథకమైనా చెప్పుకునేందుకు ఉందా? చంద్రబాబు పాలన అంతా కూడా అయితే భూములు..లేకపోతే స్కాములు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ప్రాంతానికి కూడా ఆయన న్యాయం చేయలేదు. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామంటే..అక్కడ డెమెగ్రఫి ఇన్‌బ్యాలెన్స్ వస్తుందని కోర్టులో కేసులు వేయించారు. అలాంటి వ్యక్తి నాయకుడు ఎలా అవుతారు. నిన్నటి ఆయన సమావేశంలో సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు..జాతి నాయకుడని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.