వ్యవసాయాన్ని నిలబెట్టే ఆలోచన సీఎం వైయస్‌ జగన్‌ది

కౌలు రైతు రక్షణ చట్టం ఆదర్శంగా నిలబడుతుంది

ఏళ్లుగా సాగుదారులంతా సాయం అందక నలిగిపోయారు

సీఎం నిర్ణయంతో కౌలు రైతుల ముఖాల్లో నిత్య సంతోషం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

 

అమరావతి: వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలి. రైతుల్లో ఉన్న నిరుత్సాహాన్ని తొలగించాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వ్యవసాయం చేసుకునే రైతులు గౌరవంగా ఉండే వారని, రాను రాను ఆ కుటుంబాలు నిస్పృహలోకి వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సంఖ్య 15 లక్షలకంటే ఎక్కువగా ఉంటుందన్నారు. పక్క రాష్ట్రంలో కూడా రైతులను ఆదుకునే చట్టాన్ని తీసుకువచ్చారని, కానీ కౌలు రైతులను ఆదుకునే ఆలోచన చేయలేదన్నారు. పంట సాగు చేసి, గిట్టుబాటు ధర లేకుండా నలిగిపోతున్న వారికి మాత్రం సాయం అందడం లేదన్నారు. కౌలు రైతుల గురించి ఆలోచన చేసి వారికి రక్షణగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం తీసుకురావడం అద్భుతమన్నారు. రైతు భరోసా, పంట రుణాలు సాగుదారులకు మాత్రమే వర్తించేలా చట్టంలో నిబంధన పెట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. గతంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఇన్సూరెన్స్‌ కౌలు రైతులకు దక్కేవి కావని, సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన చట్టంతో సాగుదారులందరికీ సాయం అందబోతుందన్నారు. 

సాగుదారులకు రక్షణ చట్టం రావాలని ఎప్పటి నుంచో కోరుకున్నానని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కౌలు రైతులు పడే బాధలు తనకు తెలుసని ధర్మాన ప్రసాదరావు అన్నారు. పీఓటీ యాక్ట్‌ను కొద్దిగా సవరించి 1977లో వచ్చిన చట్టం ప్రకారం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా కౌలు రైతు రక్షణ చట్టాన్ని వారికి కూడా వర్తించేలా చూడాలని కోరారు. వ్యవసాయదారుడు పడుతున్న కష్టాలను అర్థం చేసుకున్న ప్రభుత్వం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని, రైతును నిలబెట్టేలా తీసుకువచ్చిన చట్టం ఆదర్శంగా నిలబడుతుందన్నారు. భూమి కౌలుకు ఇచ్చే రైతులకు కూడా భద్రత కలిగించేలా చట్టం ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి, భూ యజమాని, కౌలు రైతు కూర్చొని చేసే అగ్రిమెంట్‌ ఇన్ని ప్రయోజనాలు పొందడానికి ఉపయోగపడుతుందన్నారు. చట్టంలో అన్ని విషయాలు సమగ్రంగా ఉన్నాయని చెప్పారు. పీఓటీ యాక్ట్‌లో భూములు పొందినవారు ఇప్పుడు వ్యవసాయం చేయలేని స్థితిలో ఉంటే ఆ భూములను ఎవరైనా కౌలుకు చేస్తే వారికి ఇలాంటి ప్రయోజనాలు అందడానికి ఒక వెసులుబాటు కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతు రక్షణ బిల్లును నూటికి నూరు శాతం సమర్థిస్తున్నానన్నారు. 

Back to Top