అనంతపురం : ‘‘ప్రజల ఆశీర్వాదంతో ఎన్నడూ లేని విధంగా 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలు గెలిచాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. మేం ఏది చేసినా అది ప్రజల మంచికే. కరోనా సమయంలోనూ సంక్షేమం ఆగలేదు’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని నవోదయకాలనీలో ఉన్న 40వ సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు–వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీం (ఓటీఎస్)పై ప్రజలకు అవగాహన కల్పించారు. మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతిసాహిత్య, కమిషనర్ మూర్తి, డిప్యూటీ కమిషనర్ సావిత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత ఎన్నికల ప్రచార సమయంలో నవోదయ కాలనీలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ మహిళ తన వద్దకు వచ్చి తనకు ఇంటి పట్టా ఇచ్చారని, అది ప్రభుత్వం వద్దే ఉన్నట్లు చెప్పిందన్నారు. బ్యాంకులో రుణం తీసుకోవాలన్నా, స్థలాన్ని అమ్ముకోవాలన్నా వీలులేకుండాపోయిందని చెప్పిందన్నారు. ఇలాంటి వారి కష్టాలు తీర్చడం కోసమే ఇప్పుడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. 1983 నుంచి చాలా మంది ఇంటి స్థలాలు తీసుకున్నారని, అప్పట్లో తీసుకున్న రుణాలకు వడ్డీతో కలిసి సుమారు లక్ష రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. అలాంటి వారు కేవలం రూ.20 వేలు చెల్లించి వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీం కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. తద్వారా ఆ స్థలంపై పూర్తి హక్కు వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నవోదయ కాలనీలోనే సెంటు స్థలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఆపద వస్తేనో..పిల్లల పెళ్లికోసమో అమ్ముకుందామంటే కుదరని పరిస్థితి ఉందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలకు ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ స్థలంపై మీకు సంపూర్ణ హక్కు ఉంటుందన్నారు. ఇంత మంచి పథకాన్ని తీసుకొస్తే చంద్రబాబు, ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని చెబుతున్న చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి ప్రజలకు ఎందుకు మంచి చేయలేకపోయారని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పేదలకు సొంతింటి కల సాకారం చేస్తూ పట్టాలు అందించి నిర్మాణలు ప్రారంభిస్తే కోర్టులకు వెళ్లారని అన్నారు. తాజాగా ఇళ్ల నిర్మాణాలకు కోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే నిర్మాణాలు ప్రారంభమవుతాయని స్పషం చేశారు. బలవంతం లేదు.. స్వచ్ఛందంగానే.. : ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ విషయంలో అధికారులు, వాలంటీర్లు ఎవరినీ బలవంతం చేయడం లేదని ఎమ్మెల్యే అనంత స్పష్టం చేశారు. ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారనడంలో నిజం లేదని తేల్చిచెప్పారు. లబ్ధిదారుడు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఈ విషయంపై అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్పొరేటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరూ దుష్ప్రచారాలను నమ్మొద్దని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో చంద్రబాబు మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారని, కానీ సీఎం జగన్ ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులను మహిళా సంఘాల ఖాతాల్లో వేశారని తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. మహిళలకు శాశ్వత భద్రత కల్పించడానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, కరోనా సమయంలో కొన్ని అభివృద్ధి పనులు ఆగినట్లు చెప్పారు. పింఛన్ల విషయంలో అర్హులందరికీ అందించాలని వాలంటీర్లకు సూచించారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సంపంగి రామాంజనేయులు, అనిల్‌కుమార్‌రెడ్డి, లీలావతి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, నగర పాలక సంస్థ కార్యదర్శి సంగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.