తిరుపతి: లిక్కర్ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్రకు తెర లేపిందని, అందులో భాగంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడారు. భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే.. `మిథున్‌రెడ్డి వైయస్ఆర్‌సీపీలో కీలక నేత మాత్రమే కాదు.. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితుడు కూడా. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర దాగుంది. అందుకే ఎలాంటి సంబంధం లేని మిథున్‌రెడ్డి ఈ స్కామ్‌ను అంటగట్టాలని చూస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ జరిగింది అనే ఓ అబూత కల్పన మాత్రమే. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు అదే తరహాలో మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదంతా నారా లోకేష్ డైరెక్షన్‌లోనే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం.. కొట్టడం చేస్తున్నారు. రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు మారుతుంటాయి. ఆ ఇంగితజ్ఞానం కూడా లేకపోతే ఎలా?. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయాలని, ప్రతిదాడులు చేయడానికి కాదు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ చూస్తున్నారు, వైయస్ జగన్ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిపై అతి పెద్దనేరం మోపి తప్పు చేశారు. మీకు ఇది ప్రస్తుతానికి ఆనందాన్ని కలిగొచ్చవచ్చు. కానీ, భవిష్యత్తులో మీకు ఆవేదన మాత్రమే మిగులుస్తుంది. పోలీసు వ్యవస్థ వాడుకొని అక్రమ అరెస్టు చేస్తున్న మీకు ప్రజలు నుండి తిరుగుబాటు తప్పదు. మేము మళ్లీ అధికారంలోకి వచ్చాక మీరు నేర్పిన పాఠాలే మీకు అప్పచెప్పాల్సివస్తుంది` అని భూమన హెచ్చరికలు జారీ చేశారు.