రాములోరి సాక్షిగా అశోక్‌ గజపతి నీచబుద్ధి బయటపడింది

ఆలయంలో ఆయన ప్రవర్తనకు క్షమాభిక్ష కూడా లేదు

ఇదేనా గజపతిరాజుల వంశం తాలూకా చరిత్ర..?

చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

దేవాలయ నిర్మాణాన్ని సర్కస్‌ కంపెనీ అని మాట్లాడుతారా..?

అశోక్‌ గజపతి ప్రవర్తనపై మంత్రులు వెల్లంపల్లి, బొత్స ధ్వజం

విజయనగరం: అశోక్‌ గజపతిరాజు దుర్బుద్ధి, నీచమైన ఆలోచన ఏంటో రాములోరి సాక్షిగా బయటపడిందని, ఆయన అహంకారానికి, నీచ ప్రవర్తనకు క్షమాభిక్ష కూడా లేదని, అశోక్‌ గజపతిరాజుకు ఏ శిక్ష వేయాలో భగవంతుడే నిర్ణయిస్తాడని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపనోత్సవానికి ఆహ్వానించడానికి వెళ్లిన ఈవో, ఆలయ ప్రధానార్చకులను నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడని, దేవాలయ నిర్మాణం జరుగుతుంటే సర్కస్‌ కంపెనీ అని కించపరిచాడని మంత్రులు ధ్వజమెత్తారు. ఇదేనా సంస్కృతి, సంప్రదాయం, ఇదేనా మీ వంశం తాలూకా చరిత్ర అని అశోక్‌ గజపతిరాజును మంత్రులు వెల్లంపల్లి, బొత్స ప్రశ్నించారు. 

రామతీర్థం కొండపై అశోక్‌ గజపతిరాజు సృష్టించిన వీరంగం విజయనగరం జిల్లా పరువుకు భంగం కలిగించేలా ఉందన్నారు. రామతీర్థంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘ప్రసిద్ధి చెందిన రామతీర్థం కొండమీద రామాలయానికి రూ.3కోట్లు, దిగువనున్న రామాలయ అభివృద్ధికి కోటి రూపాయలు ప్రభుత్వం తరపున నిధులు కేటాయించి.. శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి వచ్చాం. గతంలో దురదృష్ట సంఘటన జరిగింది. నెలరోజుల్లోనే విగ్రహాలను తయారు చేయించాం. అనుకున్న ప్రకారం శ్రీరామనవమికి దేవాలయాన్ని ప్రారంభించాలనే సంకల్పంతో నిర్మాణ, అభివృద్ధి పనులను చేపట్టాం. స్టోన్‌తో టెంపులు నిర్మిస్తున్నాం కాబట్టి.. మెటీరియల్‌ మొత్తం తెప్పించాం. మంచిరోజున నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. 

రామతీర్థం గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చూశాం. వీధి దీపానికి కూడా కరెంటు కనెక్షన్‌ లేకుండా టీడీపీ పాలన సాగింది. మన ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశాం. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసిన ప్రభుత్వం విజయవాడ నగరంలోనే అనేక దేవాలయాలను కూల్చింది. వాటన్నింటినీ సీఎం వైయస్‌  చేతుల మీద శంకుస్థాపన చేశాం.. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రామతీర్థంలోని దిగువ దేవాలయంలో ఫ్లోరింగ్, యాగశాల, ఆశీర్వాద మండపం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. 

ఆలయ ధర్మకర్తగా అశోక్‌ గజపతిరావుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. కార్యక్రమానికి రావాల్సిందిగా ఈవో, ప్రధానార్చకులు ఆహ్వానించారు. ప్రోటోకాల్‌ ప్రకారం శిలాఫలకం రూపొందించాం. అశోక్‌గజపతిరాజుకు గుడి నిర్మాణం చేపట్టడం ఇష్టం లేదనే భావన అతనిలో కనిపిస్తుంది. ఉదయం 10.08 గంటలకు ముహూర్తం పెట్టారు. గంట ముందు కొండ మీదకు వెళ్లి వీరంగం సృష్టించాడు. శిలాఫలకాన్ని తొలగించడం చట్టరిత్యా నేరం. దేవాలయ నిర్మాణాన్ని సర్కస్‌ కంపెనీ అని మాట్లాడుతున్నాడు. 

ధర్మకర్త అని చెప్పుకుంటున్న అశోక్‌ గజపతిరాజు గతంలో టీడీపీ ప్రభుత్వంతో ఒక్కరూపాయి అయినా పెట్టి అభివృద్ధి చేయించారా..? శంకుస్థాపనోత్సవానికి ఆహ్వానించడానికి వెళ్లిన ఈవోను, ప్రధానార్చకులను దుర్భాషలాడాడు. 

ఆలయ విగ్రహాలను టీటీడీ చేత తయారు చేయించాం.. టీటీడీ ఉచితంగా విగ్రహాలను అందించింది. విగ్రహాల డబ్బు రూ.1.10 లక్షలు ఏ విధంగా తీసుకుంటారు..? అశోక్‌ గజపతిరాజు మనసున్న మహారాజు అయితే ఆ చెక్కు తిరిగి ఇవ్వమని చెప్పండి. దేవాలయానికి చైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజుకు ఆలయ అభివృద్ధి, పరిరక్షణ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. రాములోరి గుడి కట్టడం ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? దేవాలయ అభివృద్ధి ఇష్టం లేక వీరంగం సృష్టించాడు. ఇందుకు మీడియా సాక్ష్యం. 

ఇదేనా గజపతిరాజు వంశ చరిత్ర.. : మంత్రి బొత్స
గజపతిరాజు దుర్బుద్ధి, నీచమైన ఆలోచన ఏంటో రాములోరి సాక్షిగా బయటపడింది. ఇలాంటి సంఘటన, పరిస్థితులు ఎప్పుడూ జిల్లాలో జరగలేదు. క్రిమినల్‌ ఆటిట్యూడ్‌తో ఇలా ఎవరూ ప్రవర్తించలేదు. ఇదేనా సంప్రదాయం, సంస్కృతి, ఇదేనా వాళ్ల వంశం తాలూకా చరిత్ర. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తారా..? దేవాలయ ప్రాంగణంలో ఎంతో హుందాగా ప్రవర్తించాలి. రామతీర్థం అభివృద్ధి కోసం చైర్మన్‌గా కనీసం ఒక లెటర్‌ అయినా ప్రభుత్వానికి రాశారా..? అశోక్‌ గజపతిరాజు పట్టించుకోని బాధ్యతను దేవాదాయ శాఖ శ్రద్ధపెట్టి చేస్తోంది. విలువలు కాపాడుకోకుండా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే తప్పకుండా చర్యలు తప్పవు. విజయనగరం జిల్లా పరువుకు భంగం కలిగిస్తున్నాడు. 

 

Back to Top