ఎస్.కోట : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో కిక్కిరిసిపోయిన జనసందోహం మధ్య జై జగన్ నినాదాల హోరు మధ్య దిగ్విజయంగా సాగింది. బస్సు యాత్రలో భాగంగా ఎస్. కోట నియోజకవర్గ పర్యనటనకు వైయస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్ వై.వీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, విద్యా శాఖ బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కంబాల జోగులు, శంబంగి చిన అప్పలనాయుడు, అలజంగి జోగారావు, శాసనమండలి సభ్యులు కుంభా రవిబాబు, జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతి రాణి హాజరయ్యారు. మొదట సామాజిక సాధికార యాత్రలో భాగంగా అలమండలో జగనన్న కాలనీలో లబ్ధిదారుడు నిర్మించుకున్న గృహాన్నీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఉన్న సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం ఎస్. కోట దేవి గుడి జంక్షన్ లో జరిగిన బహిరంగసభ జై జగన్ నినాదాలతో మారుమోగిపోయింది. ముసుగు దొంగలు మళ్లీ వస్తున్నారు..జాగ్రత్త - మంత్రి బొత్స విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సామాజిక సాధికారతను వైయస్ఆర్ సీపీ సాధించిందో లేదో చెప్పడానికి ఎస్. కోట సభకు వచ్చిన జనమే నిదర్శనమని ఉద్ఘాటించారు . అంబేద్కర్ స్ఫూర్తి, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వెనుకబడిన వర్గాలకు సామాజిక రాజకీయ సాధికారత సీఎం వైయస్ జగన్ చూపారన్నారమన్నారు.. ఎన్నికల్లో ఏం చెప్పామో.. పాలనలో ఏమి చేసామో ప్రజలకు చెప్పడానికే మీ ముందుకు వస్తున్నామని బొత్స వివరించారు. ఎన్నికల్లో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి.. ప్రజలనుంచి పారిపోయే పరిస్థితి తమకు లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముసుగులు తీసి టీడీపీ, జనసేన దొంగలు వస్తున్నారన్నారని విమర్శించారు. ముసుగులు వేసుకుని మళ్లీ మోసం చేయాడనికి వస్తే ఊరుకుంటారా.. అని ప్రజల్ని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా సరే నవరత్నాలను తూచా తప్పకుండా సీఎం వైయస్ జగన్ అమలు చేసారని గుర్తుచేశారు. దోపిడీ చేసి జైలుకు వెళ్తే ఆయన ఏదో మహానుభావుడు అయినట్లు నటిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి బొత్స ఎద్దేవా చేశారు. తప్పు చేశావా లేదా.. తప్పు చేయకపోతే రిమాండ్ ఎందుకు విధించారో చంద్రబాబు మనస్సాక్షిగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అవసరమని ఉద్ఘాటించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే దోపిడీలు, మధ్యవర్తులు, లంచగొండులు మళ్లీ వస్తారని బొత్స హెచ్చరించారు.. పారిశ్రామిక వాడకు కేబినెట్ లో సీఎం వైయస్ జగన్ ఆమోదం తెలిపారని. అది అమల్లోకి వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.. వైయస్ జగన్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. రూ.3 వేల పెన్షన్ రోజు దగ్గరలోనే ఉంది - డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను, ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఆలీబాబా దొంగల తరహాలో కేబినెట్ ఏర్పాటు చేసి దోచుకున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రతీ పనికి లంచాలు వసూలు చేసుకున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్ పాలనలో వృద్ధులు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకునే రోజు దగ్గరలోనే ఉందని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ప్రకటించారు. 90 శాతం మందికి రూ.1260 కోట్లు నేరుగా.. - ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్.కోట నియోజకవర్గ ప్రజల్లో 90 శాతం మందికి రూ. 1260 కోట్లు నేరుగా సీఎం వైయస్ జగన్ పేదలకు అందించారని గుర్తు చేశారు. అవినీతి చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబుకు సింపతీ కావాలని టీడీపీ నేతలు బస్సుయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.. టీడీపీలో విజయనగరం జిల్లాలో కేబినెట్ మంత్రి పదవులు విజయనగరం, బొబ్బిలి మహరాజ కుటుంబానికే ఇస్తారని, వైయస్ జగన్ సామాజిక న్యాయం పాటించి కేటాయించారని వివరించారు. నియోజకవర్గంలో 282 రోజుల గడప గడపకు వెళ్లి 73 వేల కుటుంబాలను కలిస్తే, 53 వేల మంది జనాభా వైయస్ జగన్ పథకాలతో తమ జీవితాల్లో వెలుగు నిండాయని చెప్పడం ఎంతో సంతోషం కలిగించిందని ఆనందం వ్యక్తం చేసారు. ఇంటి వద్దకే వైద్యం ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులకే అందుతుందన్నారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక సామాన్య ప్రజలకు సైతం జగనన్న సురక్షతో ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని వెల్లడించారు. పేదలకు ఇల్లు ఇచ్చేందుకు లే అవుట్ లు వేసే ముఖ్యమంత్రి కావాలో.. వ్యాపారం చేసుకునేందుకు లే అవుట్లు వేసే చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాక్షస పాలన సాగించే చంద్రబాబు కావాలో.. సంక్షేమ పాలన సాగించే వైయస్ జగన్ కావాలో ఆలోచించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే తమ సంక్షేమం కొనసాగుతుందో చూడాలని, ఎస్ కోట అడ్డా.. వైెయస్సార్ అడ్డా కావాలని ఆయన పిలుపునిచ్చారు.