కర్నూలు: ‘మా నినాదం ఒక్కటే.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడమే’ అంటూ సీమ వాసులు కదం తొక్కారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన రాయలసీమ గర్జనకు భారీగా ప్రజలు తరలివస్తుండగా, పలువురు మంత్రులు, వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కర్నూలు న్యాయ రాజధాని కోసం సీమ వాసులు గళం విప్పారు. రాయలసీమ జిల్లాల నుంచి సభాస్థలికి భారీగా జనం తరలివవచ్చారు. శ్రీబాగ్ ఒప్పంద ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సభా స్థలికి ప్రజాప్రతినిధులు, మేధావులు చేరుకున్నారు. గర్జనకు మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా, జయరాం, ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ ఇక్బాల్ తదితరులు హాజరయ్యారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని, నాడు రాజధానిని కోల్పోయినందున.. నేడు న్యాయ రాజధాని అయినా ఇవ్వాలని ‘సీమ’ జిల్లాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా కర్నూలు వేదికగా నేడు గర్జించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు చేసిన ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా ఇచ్చిన మాటను నెరవేర్చడాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసినా, 2020లో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల అభీష్టం మేరకు జీఎన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘న్యాయం’ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.