శ్రీకాకుళం: చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ఒక వర్గం మీడియా, చంద్రబాబు పెయిడ్ బ్యాచ్ రాజకీయ కుట్రగా ప్రచారం చేస్తున్నాయని, కక్షసాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని విషప్రచారం చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో యువకులను నైపుణ్య శిక్షణ ఇవ్వకుండా నేరుగా ప్రజల సొమ్మును సొంత ఖాతాల్లో జమ చేసుకోవడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. యువత, రాష్ట్ర ప్రజలు అవినీతి జరిగిందా లేదా అనేది గమనించాలని కోరారు. అవినీతి చేసిన వ్యక్తి ఏ స్థాయి వాడైన శిక్షార్హుడే అన్నది గుర్తించాలన్నారు. శ్రీకాకుళంలో వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా ప్రభుత్వ ధనాన్ని తన సొంత ఖాతాలో వేసుకోవడం ఇదే ప్రప్రథమమని, వ్యవస్థల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని నేరుగా ప్రభుత్వ సొమ్మును కాజేయడం కంటే అతిపెద్ద స్కాం ఎక్కడా ఉండదన్నారు. సీమెన్స్ కంపెనీ వారు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా..? అని ప్రశ్నించారు. పేరు మాత్రం సీమెన్స్ కంపెనీది.. దాన్ని అడ్డుపెట్టి డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకొని డబ్బులు నేరుగా ఆ కంపెనీ నుంచి సింగపూర్, మలేసియాల్లో ఉన్నా షెల్ కంపెనీలకు బదలాయించి.. అక్కడి నుంచి నేరుగా డబ్బంతా చంద్రబాబు పీఏకి పంపించారన్నారు. మంత్రి సీదిరి ఇంకా ఏం మాట్లాడారంటే.. ఈ దేశంలోనే చంద్రబాబు ఒక పెద్ద స్కిల్డ్ క్రిమినల్. నేను వ్యవస్థలను ఎలాగైనా మేనేజ్ చేయగలను అనే అహంకారంతో చేసిన పని ఇది. అందుకే చంద్రబాబు గర్వంగా చేతనైతే నిరూపించుకోండి.. సాక్షాధారాలు చూపించండి అంటాడు. ఎక్కడా నేను అవినీతి చేయలేదు అని మాత్రం చెప్పడు. నాలుగు రోజుల క్రితం నంద్యాలలోనూ ఇదే మాట్లాడాడు. చంద్రబాబు తన కేసు తాను వాదించుకుంటూ క్యాబినెట్ నిర్ణయాలను మీరెలా తప్పు పడతారు అన్నాడు. క్యాబినెట్ నిర్ణయాలపై విచారణ ఏంటి...మీరెవరు నన్ను అడగడానికి అని చంద్రబాబు అడిగాడు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ జగన్ ఏ పదవిలోనూ లేరు. అప్పట్లో వైయస్సార్ క్యాబినెట్- భూముల కేటాయింపులో నిర్ణయం తీసుకుంటే వైయస్ జగన్‌పై ఇదే చంద్రబాబు తన మనుషులతో రిట్ పిటిషన్ వేయించాడు. ఆయా కంపెనీలు వైయస్ జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టాయని క్విడ్‌ప్రోకో జరిగిందని నానా రాద్దాంతం చేశాడు. సుప్రీం కోర్టులో కూడా ఇదే టీడీపీ నేతలు అధికారికంగా ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపించారు. మరి, అవి క్యాబినెట్ నిర్ణయాలు కావా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. వైయస్సార్ క్యాబినెట్ నిర్ణయాలపై కేసులు వేయవచ్చు... నీ క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకూడదా..? నీ మేనేజ్ మెంటు టైం అయిపోయింది...ఎల్లో మీడియా టైమూ అంతకంటే అయిపోయింది. మీరు నిజాలు దాస్తే దాగేవి కాదు..కాలం మారిపోయింది. నువ్వు ఏ విధంగా సీఎం వైయస్ జగన్‌ని ఇబ్బంది పెట్టావో తెలుగు ప్రజలంతా చూశారు. అదీ రాజకీయ వైరం అంటే...రాజకీయంగా నువ్వు చేసిన తప్పిదం. ఏ తప్పు చేయకుండానే వైయస్ జగన్‌పై అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కై, రాజకీయంగా కక్ష సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ ఐఏఎస్ అధికారికే అనుమానం వచ్చి రాతపూర్వకంగా సీఎం చెప్తే ఇస్తున్నా అని రాశాడు. చంద్రబాబు హయాంలోనే జీఎస్టీ అధికారులు తీగలాగితే డొంక కదిలింది. 2021లో కేసు నమోదు చేసి విచారిస్తే అసలైన సూత్రధారి చంద్రబాబు జైళ్లోకి వెళ్లాడు. ఇందులో రాజకీయ కక్ష ఏముంది..? చంద్రబాబు ఈ రోజు కూడా తాను తప్పు చేయలేదు అనడం లేదు. చంద్రబాబు తప్పు చేశాడని ఆయన లాయరే కన్విన్స్ అయ్యాడు. అందుకే అరెస్ట్ చేసిన విధానం బాగాలేదని అన్నాడు తప్ప, తప్పు చేయలేదు అనలేదు. రాజమండ్రి సెంట్రల్ జైళ్లో ఓ ప్రత్యేక వసతి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆయన్ను చాలా గౌరవంగా చూసుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి అని, ముసలోడు అని ఆయన ఎన్ని మాటలు అన్నా అవన్నీ పక్కన పెట్టి గౌరవంగా చూస్తున్నారు. మా ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీ పుట్టుకే ఒక తప్పుడు పుట్టుక అన్నాడు. ఒక గౌరవ ప్రదమైన స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి..? మేం తిట్టలేమా..? మాకు మాటలు రావా..? రాష్ట్రంలోని ప్రజలందరూ వైయస్ జగన్ తల్లిదండ్రుల త్యాగం ఎలాంటిదో చెప్తారు. నీ తల్లిదండ్రుల త్యాగం గురించి నువ్వు చెప్పగలవా? ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఆయన తల్లిదండ్రులెవరో తెలుసా..? ఆయన కొడుకు కట్‌డ్రాయర్ల మీద ఊరేగిస్తా..బట్టలూడదీస్తా అంటాడు. రాజకీయాల్లో బట్టలు ఊడదీయడం అంటే నిన్న మీ నాన్నకు జరిగిందే. మీ నాన్నను నంద్యాల నుంచి విజయవాడ వరకూ తీసుకు వచ్చారు కదా.. కోర్టు బోనులో దీనంగా కూర్చోబెట్టారు కదా. అదీ బట్టలూడదీయడం అంటే. మీ నాన్న సానుభూతి కోసం తెగ ప్రయత్నం చేశాడు..ఈ రాష్ట్రంలో ఒక్క సాధారణ పౌరుడైనా సానుభూతి చూపించాడా..? మంచిపనైంది..ఈ రాష్ట్రానికి దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నారు. ఎవరో ఒకరు రాకపోతారా..చంద్రబాబు అవినీతిని పెకిలించి తీయకపోతారా అని అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకున్నారు. విచిత్రం ఏంటంటే.. పవన్ కల్యాణ్ కూడా వీళ్ల అవినీతిపై గతంలో విమర్శించాడు. ఇంతటి అవినీతి ప్రభుత్వం నేను చూడలేదు..తోలు తీస్తాం..తాట తీస్తాం అన్నాడు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రోడ్డుపై ఈ డ్రామాలేంటి..? పవన్ కల్యాణ్ ఒక్క సారి మీ జనసైనికుల మనోవ్యధ వినండి. ఇంకెన్నాళ్లు ఈ చంద్రబాబు జెండానే ఎజెండాగా తీసుకెళ్తాం అని వాళ్లు కుమిలిపోతున్నారు. నీకేం నువ్వు బాగానే ఉన్నావు.. ప్యాకేజీ తీసుకుని అస్తులు కూడబెట్టుకుంటున్నావు. వాళ్ల నమ్మకాన్ని, కష్టాన్ని నువ్వు వేరే వారి దగ్గర ప్యాకేజీ తీసుకుని, డబ్బుగా మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదు. దీనికంటే చిరంజీవిలా గౌరవంగా పార్టీని వదిలేసి సినిమాలు తీసుకోవడం బెటర్. చక్కగా సినిమాలు తీసుకో...రాజకీయాలకు నువ్వు సూట్ అవ్వవు. కన్నకొడుకులోనే అంత ఆక్రోశం చూడలేదు కానీ..దత్తపుత్రుడి ఓవరాక్షన్ చూస్తున్నాం. వాళ్ల అమ్మగారిని తిట్టినప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఇంత ఓవరాక్షన్ చేయలేదు. చివరికి తాను చేసే రీమేక్ సినిమాల్లోనూ పవన్ కల్యాణ్ అంత ఓవరాక్షన్ చేయలేదు. అవినీతి చంద్రబాబును అరెస్టు చేస్తే మాత్రం ఇక యుద్ధమే అంటున్నాడు. ఇన్నాళ్లు నువ్వేం చేస్తున్నావు..? రాజకీయాల్లో ప్రతి రోజూ యుద్ధమే. ఇన్నాళ్లు నువ్వు చేసింది రాజకీయ వ్యభిచారమే..చంద్రబాబు అరెస్టు అనేది ప్రభుత్వం విధి..బాధ్యత. బాబులాంటి అవినీతి పరుడికి వంత పాడే నీలాంటి వాడికి ప్రజలు ఎలా అవకాశం ఇస్తారు..? అసెంబ్లీలోకే అడుగుపెట్టలేకపోయావు..ఇలా అయితే అసెంబ్లీ గేటు కూడా తాకలేవు. పచ్చమీడియా, ఇకనైనా కళ్ళు తెరవండి. చంద్రబాబు అవినీతిని ప్రజలకు వివరించండి...మీరు చేసిన పాపాల్లో కొంతైన ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కమ్యూనిస్టులు ఎక్కడైనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారు కానీ ఒక్క ఏపీలోనే అవినీతికి మద్దతు పలుకుతున్నారు. అందుకే నేడు కమ్యూనిస్టులు నామ మాత్రం అయిపోయారు. చంద్రబాబు లాంటి అవినీతి పరుడికి మీరు వంతపాడుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో మీరు ఎంత దిగజారిపోయారో గమనించుకోండి. యనమల రామకృష్ణుడు విమర్శించడం విడ్డూరం. స్కిల్ లో అవినీతి జరిగిందని ఆయనకు తెలియదా..? అప్పుడు ఆర్థిక మంత్రి ఆయనే కదా..? ఆయనకు తెలుసు..అందుకే అప్పుడే ఆయన తప్పుకున్నాడు...అందుకే ఆయన పేరు ఎక్కడా రాలేదు.ఫైనాన్స్ శాఖ అభ్యంతరం తెలిపింది అంటే ఆ శాఖ మంత్రి కూడా అభ్యంతరం తెలిపినట్లే. మళ్లీ ఇప్పుడొచ్చి దొంగ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు..? అచ్చెన్నాయుడు ఒక రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే పీక కోసుకుంటాను అన్నాడు. కోర్టు అవినీతి జరిగిందని బలంగా నమ్మబట్టే చంద్రబాబును జైలుకు పంపించింది. మరి అచ్చెన్నాయుడు పీక కోసుకున్నాడా..? ఇంకా ఎందుకు పీకకోసుకోలేదు..?