ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న బాబు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి

రవాణా, సమాచార శాఖ మంత్రి  పేర్నివెంకట్రామయ్య(నాని) 

 రాయలసీమకు నీళ్లు ఇస్తే అక్కడి ప్రజలు ఎందుకు వాతలు పెడతారు బాబూ..!

 పరామర్శించడానికి వచ్చారా? పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా బాబూ..?

 బాబు చేసిన పాపాలకు రెండేళ్ల క్రితమే ప్రజలు శిక్షవేశారు.. అయినా జ్ఞానోదయం కాలేదు

 కృష్ణా డెల్టాలో దాళ్వా పంటకు అసలు నీళ్లు ఇచ్చారా? కృష్ణాడెల్టా రైతులకు సున్నం పూసింది మీరు కాదా?

నదుల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న ప్రతిపాదన మీద మీ స్టాండ్ ఏమిటి..?

 పులిచింతల, శ్రీశైలం నుంచి తెలంగాణ తన ఇష్టం వచ్చినట్లు నీరు తోడేయటం మీద మీ స్టాండ్ ఏమిటి?

 శ్రీశైలం నుంచి కేవలం 800 అడుగుల మట్టం వద్దే తెలంగాణ ప్రభుత్వం నీరు తీసుకుపోవడం మీద మీ స్టాండ్ ఏమిటి?

 ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే.. నోరు తెరవకుండా ఉన్నందుకు మీకు ఏ శిక్ష వెయ్యాలి?

మాట ఇచ్చి వెన్నుపోటు పొడవడం బాబు నైజం.. మాట ఇస్తే మడమ తిప్పని చరిత్ర వైయస్సార్‌ కుటుంబానిది

 బెల్ట్‌ షాపులకు ప్రాణం పోసిన పితామహుడు చంద్రబాబు మద్యం గురించి మాట్లాడటమా..?

తాడేప‌ల్లి: అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పని చేయకుండా.. అధికారం పోయిన తర్వాత మళ్లీ నాకు అధికారం ఇవ్వండి, నేను ఉంటే ఇది చేసేవాడిని.. అది చేసేవాడిని అంటూ నేరగాళ్ళ ఓదార్పు యాత్ర చేస్తూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని రవాణా, సమాచార శాఖ మంత్రి  పేర్నివెంకట్రామయ్య(నాని) సూటిగా ప్రశ్నించారు. ఈరోజు కొల్లు రవీంద్ర.. గతంలో అచ్చెన్నాయుడు.. ఇలా ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని తినేసిన వాళ్ళని, తన సహ దొంగల్ని సమర్థించుకునే పనిలో చంద్రబాబు పడ్డాడు అని ధ్వజమెత్తారు. ఎప్పుడో చనిపోయినవారిని పరామర్శించడానికి వెంటనే రావాలి కానీ, కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధ నుంచి తేరుకుంటున్న వారిని మళ్లీ తన పరామర్శల పేరుతో బాధించడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చింది పరామర్శించడానికా? లేక పాత లెక్కలు తేల్చుకోవడానికా.. అని మంత్రి ప్రశ్నించారు. చనిపోయిన రెండు నెలల తర్వాత తీరిగ్గా పరామర్శలకు వచ్చిన చంద్రబాబు ఆ పని పూర్తి చేసుకుని వెళ్లాలే కానీ, దిగజారి రాజకీయాలు మాట్లాడటం, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఏంటని నిలదీశారు. 

తాడేపల్లిలోని వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను కంట్రోల్‌ చేసేవాడినని ఆయన చెప్పుకుంటున్నారని, ఆయనకు అంత సత్తా ఉంటే హైదరాబాద్‌ వెళ్లి ఎందుకు దాక్కున్నారని, ఇళ్లలో నుంచి ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. "14 ఏళ్ల ముఖ్యమత్రిగా ఉండి, 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు ఎవరికి ఆదర్శంగా ఉన్నారు..? దొంగలకు, వెన్నుపోటుదారులకు మాత్రమే మీరు ఆదర్శంగా ఉన్నారు. రాజకీయాల్లోకి వద్దామనుకునే యువకులకు మీరు ఏవిధంగా ఆదర్శమని" మంత్రి నాని ప్రశ్నించారు. 

‘కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తే తనకు జిల్లా ప్రజలు ఓటు వేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు’ మీకు అన్నం పెడితే కృష్ణాజిల్లా ప్రజలు నా చేయి కరిచారని మాట్లాడతారా.. ఎంత దౌర్బాగ్యం చంద్రబాబు గారూ...? మీరు 2014లో సీఎం అయ్యేవరకూ కృష్ణాడెల్టాలో రెండు పంటలు పండించిన ఘనత రైతులది. మీరు వచ్చి ఏం చేశారు. మా రెండు పంటలను ఒక పంట చేశారు. మీ అయిదేళ్లలో దాళ్వా పంటకు అసలు నీళ్లు ఇచ్చారా? కృష్ణాడెల్టా రైతులకు సున్నం పూసి, అసత్యాలు మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. అందుకే ప్రజలు గట్టిగా మీకు బుద్ధి చెప్పి... ఎక్కడ కారం పూయాలో అక్కడ పూసారన్నారు. రాయలసీమకు మీరు నీళ్లు ఇస్తే అక్కడి ప్రజలు ఎందుకు వాతలు పెట్టారనేది.. ఈరోజుకు కూడా జ్ఞానం రాకపోతే ఎలా చంద్రబాబు గారూ.. అని ప్రశ్నించారు. అయిదేళ్ల మీ ప్రభుత్వం గిరిజనులకు ఏం చేసింది, మీ కులానికి చెందిన వారిని మంత్రులను చేసుకున్నారే కానీ గిరిజనులకు ఒక మంత్రి పదవి అయినా ఇచ్చారా? ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. 

"నదుల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న ప్రతిపాదన మీద మీ స్టాండ్ ఏమిటి.. పులిచింతల, శ్రీశైలం నుంచి తెలంగాణ తన ఇష్టం వచ్చినట్లు నీరు తోడేయటం మీద మీ స్టాండ్ ఏమిటి?. శ్రీశైలం నుంచి కేవలం 800 అడుగుల మట్టం వద్దే తెలంగాణ ప్రభుత్వం నీరు తీసుకుపోవడం మీద మీ స్టాండ్ ఏమిటి?.  ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే.. నోరు తెరవకుండా ఉన్నందుకు మీకు ఏ శిక్ష వెయ్యాలి?" అని మంత్రి నాని ప్రశ్నించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలోగాని, మరణాలను తగ్గించడంలో కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే రెండో రాష్ట్రంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో, నీతి ఆయోగ్‌ గుర్తించి, ప్రశంసలు కురిపిస్తే చంద్రబాబుకు మాత్రం అది కనిపించడం లేదు. వయసులో చిన్నవాడు అయినా, చంద్రబాబుకు ఉన్నంత అనుభవం లేకున్నా కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు సమర్థవంతంగా పని చేశారని అందరూ మెచ్చుకుంటుంటే... వయసు పైబడింది కాబట్టి వాస్తవాలను అంగీకరించలేని మానసిక దౌర్భల్యంతో చంద్రబాబు విమర్శిస్తున్నారు. అలాగే కరోనాతో మరణించినవారు అందరూ డెత్‌ సర్టిఫికెట్లు తీసుకుని ఇవ్వండి. ప్రభుత్వం పరిహారం ఎవరి కోసం ఇవ్వదు అని మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలో నగరంలో ప్రమాదం జరిగితే ఎంత ఇచ్చారు? బోటు ప్రమాదాలు జరిగితే నష్ట పరిహారం ఎంత ఇచ్చారు? మనుషుల మరణాలను మానవత్వంతో, ఒక బాధ్యతగా చూసిన చరిత్ర చంద్రబాబు పరిపాలనలో ఎప్పుడైనా ఉందా? 

 టీడీపీ అధికారంలో నుంచి దిగే సమయానికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదు. అలాంటిది ఈ ప్రభుత్వం రోజుల గడువులోనే వైరాలజీ ల్యాబ్‌లు, టెస్టింగ్‌ సెంటర్లు, కోవిడ్‌ పరీక్ష కేంద్రాలను పెంచుకుంటూ వెళ్లడం గానీ, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లను పెంచుకుంటూ శరవేగంగా పనిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య సేవలను ప్రజలు మెచ్చుకుంటుంటే చంద్రబాబు మాత్రం సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఇచ్చిన హామీల్లో 97 శాతం.. 20 మాసాల్లోలోనే పూర్తి చేశారు. మిగతా మూడు శాతం హామీలు వచ్చే మూడేళ్లలో కచ్చితంగా నెరవేర్చుతారు. ఇచ్చిన మాటకు నిలబడటం, మడమ తిప్పకపోవడం అనేది రాజశేఖర్‌రెడ్డిగారి కుటుంబం బ్రాండ్‌ అంబాసిడర్లు. అదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు వెన్నుపోటు పొడిచేటువంటి బ్రాండ్‌కు అంబాసిడర్‌గా నిలిచారనేది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. పిల్లనిచ్చిన మామగారికి, బామ్మర్దికి, తోడల్లుళ్లకు, ఆఖరికి 2014లో మీకు ఓటువేసి గెలిపించిన కోట్లాది ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది.
 అధికారంలోకి వస్తే రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తానని వారికి సున్నం పూసింది మీరు కాదా. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని వారికి మసిపూసింది మీరు కాదా? 600 హామీలు ఇచ్చిన మీరు వాటిలో ఎన్ని హామీలు నెరవేర్చారు. ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసిన రకంగా చంద్రబాబు ప్రవర్తించారు. రజకుల్ని ఎస్సీల్లో చేరుస్తామని, మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేస్తామన్నారు.. కాపులను బీసీల్లో చేర్చుతామన్నారు వాటిని అమలు చేశారా మీరు? ఇవన్నీ మీ హామీలు కావా? ఏం చేశారు ఈ హామీలన్నీ. ఎన్నికల ముందు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు చెప్పిందేంటంటే... ‘25కు 25 పార్లమెంట్‌ సీట్లు గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మన అవసరం వస్తే.. మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మీకు మద్దతు ఇస్తామని, అది ఎవరైనా సరే...  మాకేం అభ్యంతరం లేదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అని’ చెప్పారు. 

‘కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తే తనకు జిల్లా ప్రజలు ఓటు వేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. మీకు అన్నం పెడితే కృష్ణాజిల్లా ప్రజలు నా చేయి కరిచారని మాట్లాడతారా?’ ఎంత దౌర్బాగ్యం చంద్రబాబు గారు. మీరు 2014లో సీఎం అయ్యేవరకూ కృష్ణాడెల్టాలో రెండు పంటలు పండించిన ఘనత రైతులది. మీరు వచ్చి ఏం చేశారు. మా రెండు పంటలను ఒక పంట చేశారు. మీ అయిదేళ్లలో దాళ్వా పంటకు నీళ్లు ఇచ్చారా? కృష్ణాడెల్టా రైతులకు సున్నం పూసి, అసత్యాలు మాట్లాడుతున్నారు. అందుకే ప్రజలు గట్టిగా మీకు కారం పూసారు. రాయలసీమకు మీరు నీళ్లు ఇస్తే అక్కడి ప్రజలు ఎందుకు వాతలు పెట్టారనేది ఈరోజుకు కూడా జ్ఞానం రాకపోతే ఎలా చంద్రబాబుగారు...?. గిరిజనుల గురించి కొత్తగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయిదేళ్ల మీ ప్రభుత్వం గిరిజనులకు ఏం చేసింది. మీ కులానికి చెందినవారిని మంత్రులను చేసుకున్నారే కానీ గిరిజనులకు ఒక మంత్రి పదవి ఇచ్చారా? ఇవాళ వారి గురించి మాట్లాడే  హక్కు మీకు లేదు.

 ఇన్నేళ్లు అనుభవం ఉన్న చంద్రబాబు మాట్లాడేవన్నీ అసత్యాలే. వైకుంఠ పురం బ్యారేజీని మీరు ఎందుకు నిర్మాణం చేయలేదు. ఒక్కరాయి అయినా వేశారా? అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని చేయకుండా.. అధికారం పోయిన తర్వాత మళ్లీ నాకు అధికారం ఇవ్వండి, నేను ఉంటే ఇది చేసేవాడిని.. అది చేసేవాడిని.. అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. కృష్ణాడెల్టా రైతుల నోళ్లు కొట్టి రాయలసీమకు నీళ్లు ఇచ్చామని చంద్రబాబు చెబుతున్నారని.. నిజంగా ఆ ప్రాంతానికి నీళ్లు ఇస్తే సీమ ప్రజలు ఎందుకు ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడిస్తారు.

జాబ్‌ క్యాలెండర్‌ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిరుద్యోగ యువతకు 2లక్షల 30వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయాల్లోనే ఒక లక్షా, 37వేలమంది ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరిగింది. వారంతా చదువుకున్ననిరుద్యోగ యువతే కదా? ప్రజలు ఇచ్చిన మేండేట్ ప్రకారం జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుంది. ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్లు విడుదల చేస్తారు. అయినా చంద్రబాబు ముందే ఆత్రపడిపోతున్నారు. మీ అయిదేళ్ల కాలంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబుగారు? అధికారంలో ఉన్నప్పుడు హాయిగా అధికారం అనుభవించి, ప్రజల సొమ్ము దోచుకుని, దాచుకున్నారు. 

 అయిదేళ్ల మీ ప్రభుత్వ హయంలో బందర్‌ పోర్టును ఏం చేశారు. కాలయాపన చేసి, మళ్లీ ఓట్లు అడిగేటప్పుడు మార్చిలో ఎన్నికలు అయితే... ఫిబ్రవరి 7వ తేదీన మీరు వచ్చి దొంగ శంకుస్థాపన చేస్తారా? ఎవర్ని మోసం చేద్దామని, బందర్‌ వాసుల్ని మోసం చేద్దామనా? కృష్ణాజిల్లా వాసులను వంచన చేసి, వెన్నుపోటు పొడిచి ఈ రకంగా మాట్లాడటం సరికాదు. ఎన్నికల ముందు నా జన్మలో బీజేపీతో కలవను అని 2004లో చెప్పిన చంద్రబాబు 2014లో మాత్రం ఆ పార్టీ పెద్దల కాళ్లావేళ్లా పడి వాళ్లతో ఒప్పందం చేసుకుని కలిసి పోటీ చేసి నాలుగేళ్లు కాపురం చేసి, "చివరి ఆర్నెల్లలో మేము అచ్చాహై... మోదీ లుచ్చాహై "అని చంద్రబాబు, ఆయన బామ్మర్ది నోటికి వచ్చినట్లు తిట్టి.. మళ్లీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోదీగారికి ప్రేమ లేఖలు రాయడమా? మోదీ ప్రభుత్వానికి అంశాలవారీగా మద్దతు ఇస్తామంటూ సిగ్గులేకుండా పార్టీ ప్లీనరీలో తీర్మానాలు చేయడమా? రాజకీయాల్లో ఈ స్థాయిలో దిగజారేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుగారే.

 బెల్ట్‌ షాపుల వ్యవస్థకు ప్రాణం పోసిన పితామహుడు.. పర్మిట్‌ రూమ్‌ల సృష్టికర్త అయిన చంద్రబాబుకు బ్రాందీ షాపుల గురించి మాట్లాడే అర్హత ఉందా? రాష్ట్రంలో మద్యపాన నియంత్రణకు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు చిత్తశుద్దితో పని చేస్తుంటే.. మీరు మాత్రం దొంగ మాటలు మాట్లాడటమా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను పోషించుకుంటూ ఆయనతో అర్థరాత్రిపూట జగన్‌ గారు ఆత్మలతో మాట్లాతారు అంటూ చెత్త  రాతలు రాయిస్తూ... సిగ్గు,శరం లేకుండా మీరు అవే మాట్లాడుతున్నారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, రాజకీయ పార్టీని తస్కరించి ఆయన పేరు, ఫోటో లేకుండా చేసి, మళ్లీ ఎన్నికలప్పుడు సిగ్గులేకుండా ఎన్టీఆర్‌ ఫోటోకు దండలేసి, దండాలు పెట్టే హీనమైన సంస్కృతి చంద్రబాబుది. 

 ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌ గారి వద్ద దొంగలాగా దొరికిపోయి... నాకు కూడా పోలీసులు ఉన్నారు... హైదరాబాద్‌లో పోలీస్‌ స్టేషన్‌ పెడతాను, మీ సంగతి చూస్తాను.. అని ప్రగల్భాలు పలికి అర్థరాత్రి పారిపోయి వచ్చి కృష్ణా కరకట్ట మీద దాక్కున్న మీరు... ఇవాళ కేసీఆర్‌ గారు చేస్తున్న దుర్మార్గానికి రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా మీ నిర్ణయం ఏంటి? కేసీఆర్‌ గారు తప్పు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా నీళ్లను దోపీడి చేస్తూ, నీళ్ళను సముద్రం పాలు చేస్తుంటే ఒక్క మాట మాట్లాడే ధైర్యం లేదు మీకు. చిత్తశుద్ధి లేని మీరు రాష్ట్ర ప్రజల గురించి, వారి శ్రేయస్సు గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడది. నదుల అనుసంధానం నాదే, నోట్ల రద్దు నాదే అంటారు. అనేక రకాల కార్యక్రమాలు నేనే చేశాను అని అంటారు. మళ్లీ నోట్లరద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తప్పు చేశారు అని మీరే చెబుతారు. నదుల అనుసంధానం మీ నిర్ణయమే అయితే మీరు ఎక్కడెక్కడ ఏం చేశారో చెప్పాలి.
-  వైయస్సార్‌ గారు 60-70 శాతం పూర్తి చేసిన కాలువలకు, రెండు మోటర్ల పెట్టి పట్టిసీమ కట్టానని గొప్పగా చెప్పుకోవడం మీ దిగజారుడుతనానికి నిదర్శం. శ్రీశైలంలో 800 అడుగుల మట్టంలో, డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను మీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ నిర్మాణం చేస్తే మీరు ఏం చేశారు. పల్లెత్తి ఒక్క మాట మాట్లాడలేదు. మీ హయాంలో మీరు ఏమైనా దాన్ని ఆపించారా? మీరు చేసిన దొంగతానికి దొరికిపోయి ముద్దాయిగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రానికి ఇవాళ ఇన్ని ఇబ్బందులు తలెత్తాయి. మీ కేసుల మూలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్ని తాకట్టు పెట్టారు. జల వివాదానికి పూర్తిగా చంద్రబాబు నాయుడే కారణం. 

 మీరు చేసిన పాపాలకు రెండేళ్ల క్రితమే ప్రజలు శిక్షేశారు. అయినా మీకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదు. మళ్లీ కూడా ప్రజలు అదే తీర్పు మీకు ఇస్తారు. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలకంటే మిన్నగా ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కల్పిస్తూ.. భారతదేశంలోనే మొదటిగా నిలిచిందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. చిన్నవాడు అయినా రెండేళ్ల పరిపాలనలో ఎంతో గొప్పగా పరిపాలన చేస్తూ, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుందని తలతిప్పి చూపేలా జగన్ గారు పరిపాలన చేస్తుంటే... చేతనైతే భుజం తట్టి, ఆశీర్వదించాలని చంద్రబాబుకు హితవు పలుకుతున్నాం.

Back to Top