ఒకేచోట అభివృద్ధి నష్టమని చరిత్ర చెబుతోంది

నివేదికల ఆధారంగా పాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హైపవర్‌ కమిటీలో చర్చ

ప్రజల సూచనలు, డిమాండ్లను పరిగణలోకి తీసుకున్నాం

ఈ నెల 13వ తేదీన మరోసారి సమావేశమవుతాం

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

విజయవాడ: ఒకేచోట, ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఎంత నష్టపోతామనేది గడిచిన చరిత్ర చెబుతుందని, అభివృద్ధి అనేది 13 జిల్లాల్లో సమంగా జరగాలని హైపవర్‌ కమిటీ చర్చించడం జరిగిందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ గ్రూప్‌ ఇచ్చిన నివేదికలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలు, శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన సలహాలపై కూడా క్షుణ్ణంగా చర్చించామన్నారు. హైపవర్‌ కమిటీ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో ఉన్న నిజమైన రైతుల హక్కుల కాపాడి వారికి న్యాయం చేయాలని, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని చర్చించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు ఎక్కడా రాకుండా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని హైపవర్‌ కమిటీ చర్చ జరిపిందన్నారు. మళ్లీ ఈ నెల 13వ తేదీన జరిగే సమావేశంలో దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. 

రెచ్చగొట్టే రాజకీయ నాయకులు, ప్రజల్లో ఆందోళనలను కలగజేయాలనే కొన్ని పత్రికలు, చానళ్లు వార్తలు ప్రచురిస్తున్నప్పుడు ఆందోళనలు రావడం సహజమన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన హైపవర్‌ కమిటీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, సూచనలు, డిమాండ్లను పరిగణలోకి తీసుకొని చర్చలు జరుపుతుందన్నారు. దయచేసి రాజధాని ప్రాంత రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు.
 

Back to Top