గూగుల్‌ మ్యాప్‌లో గీత గీస్తే ఓఆర్‌ఆర్‌ అవుతుందా..?

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయ‌డంలో ఆంధ్రజ్యోతితో రామోజీ పోటీ

ఉనికిలో లేని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారం

189 కి.మీ ఓఆర్‌ఆర్‌ కోసం 8,213 ఎకరాల భూమిని చంద్రబాబు సేకరించాడా..?

2016-17లో చంద్రబాబు కనీసం డీపీఆర్‌ కూడా తయారు చేయలేదు

రామోజీరావు బూతులు తిట్టాల్సింది చంద్రబాబునే..

శాసన రాజధాని అమరావతి అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వంపై నిందలు వేయడానికి, బురదజల్లడానికి ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతితో పోటీపడుతున్నాడని రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఉనికి లేని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈనాడు అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 2016–17లో 189 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనకు చంద్రబాబు కనీసం డీపీఆర్‌ కూడా తయారు చేయకపోవడంతో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, గూగుల్‌ మ్యాప్‌లో పెన్సిల్‌ గీత గీసి ఇదే ఔటర్‌ రింగ్‌ రోడ్డు అంటే అవుతుందా..? అని రామోజీరావును మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం డీపీఆర్‌ కూడా తయారు చేయలేని చంద్రబాబుపై రాతలు రాయడం మానేసి.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసం అని ఈనాడు రామోజీని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారంటే.. 

చంద్రబాబు మీద ప్రేమతో ఈనాడు రామోజీరావు సీఎం వైయస్‌ జగన్‌ మీద ధ్వేషం పెంచుకొని విషం చిమ్మే ప్రయత్నం చేశాడు. ‘ఓఆర్‌ఆర్‌కు ఉరి’ అని రామోజీ రాశాడు.  ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎక్కడ ఉంది. కనీసం కాగితాల్లోనైనా ఢిల్లీలో ఉందా..? 189 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్దని.. 78 కిలోమీటర్ల బైపాస్‌ రోడ్డు చాలనడం ఏంటీ..? అని ఈనాడు రాతలు రాసింది. ఓఆర్‌ఆర్‌ మీద రామోజీ రావు పచ్చిబూతులు తిట్టాల్సింది చంద్రబాబును మాత్రమే.. బాబు మీద ప్రేమతో సీఎం వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తున్నాడు. 

ఔటర్‌ రింగ్‌ రోడ్డు 189 కిలోమీటర్లు అని రాశాడు. ఆ నిర్మాణం చేయాలంటే రూ.17,762 కోట్లు ఖర్చు అవుతుందని, దానికి 8,213 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని 2016–17 సంవత్సరంలో ఒక రిపోర్టు తయారు చేసుకున్నారంట. రిపోర్టు తయారు చేసుకొని భ్రమరావతికి కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వాళ్లను అడిగితే.. భూములు సేకరించి అప్పగించండి అని కేంద్రం చెప్పింది. చంద్రబాబు భ్రమల్లో ఔటర్‌ రింగ్‌  రోడ్డు నారాకోడూరు, నందివెలుగు, చలివేంద్రపాలెం, మానికొండ దాదాపు సత్తెనపల్లి, కంచినచర్ల, ఉయ్యూరు సమీపాల నుంచి అంట. గూగుల్‌ మ్యాప్‌లోచంద్రబాబు ఒక బొమ్మ గీసేసి ఔటర్‌ రింగ్‌ రోడ్డు అంటే.. రామోజీ కూడా అది ఓఆర్‌ఆర్‌గానే కలలు కంటున్నాడు. 

గూగుల్‌ మ్యాప్‌లో రంగు పెన్సిల్‌తో గీత గీస్తే ఔటర్‌రింగ్‌ రోడ్డు అవుతుందా..? 2017లో కేంద్ర ప్రభుత్వం ఓ సంస్థని ఫీజుబులిటీ రిపోర్టు ఇవ్వమని అడిగింది. 2018 వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్‌ కూడా తయారు చేయలేదు. రాష్ట్రానికి ఆసక్తి లేదని కేంద్రమే పక్కనపెట్టేసింది. మ్యాప్‌లో రంగు పెన్సిల్‌తో గీసిన దాన్ని పట్టుకొని ఓఆర్‌ఆర్‌కు ఉరి అని రాస్తున్నారు. ఎంత దుర్మార్గం.

అమరావతి రాజధాని వద్దని ఎవరు అన్నారు. శాసనసభ, మండలి ఇక్కడే నడుపుతామని పదే పదే చెబుతున్నాం. వినిపించుకోకుండా రాద్ధాంతం చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం 8,213 ఎకరాల భూమిని చంద్రబాబు సేకరించాడా..? ఈ భూమి కొనుగోలుకు డబ్బులు ఎంత అవుతాయి..? భ్రమల్లో బతికే చంద్రబాబు భ్రమించిన ప్రకారం రోడ్డు వేయాలంటే భూసేకరణకు ఎంత అవుతుంది..? హీనపక్షంలో ఎకరానికి రూ.50 లక్షల వేసుకున్నా.. రూ.4 వేల కోట్లు కావాలి. ఇది ఎప్పటికి పూర్తవుతుంది. 

విజయవాడ ఎంత ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. విజయవాడలో జనాభా ఎంత పెరిగిపోయింది. జాతీయ రహదారి విజయవాడ ఊరి మధ్యలోంచి వెళ్తుంటే.. అటువంటి నగరానికి రిలీఫ్‌ ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు, రామోజీ చేశారా..? చంద్రబాబు ఐదేళ్లలో విజయవాడకు ఔటర్‌రింగ్‌ రోడ్డు వేసి ఉంటే.. సీఎం వైయస్‌ జగన్‌ ఒక రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు ప్లాన్‌ చేయకపోతే అప్పుడు రాసుకోండి. ఐదేళ్లు భ్రమల్లో బతికినవాడిని ఆకాశానికి ఎత్తుతూ దార్శనికుడు అని డబ్బాలు కొడుతున్నారు.

విజయవాడ నగరానికి ఊపిరి ఊదడం కోసం తూర్పున చినఅవుటుపల్లి నుంచి చినకాకాణి, కాజ వరకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులను సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు 2023 కల్లా పూర్తి చేయడానికి సీఎం శ్రమిస్తున్నారు. బెంజ్‌ సర్కిల్‌లో ఒక బ్రిడ్జి కట్టడానికి చంద్రబాబు ఐదేళ్లు సాగదీశాడు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ సంగతీ అంతే. ఐదేళ్లలో కూడా కట్టలేకపోయాడు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వచ్చాక బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్, దుర్గ గుడి ఫ్లైఓవర్లు పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. అంతేకాకుండా బెంజ్‌ సర్కిల్‌లో చంద్రబాబు అనాలోచితంగా కట్టిన సింగిల్‌ లైన్‌ ఫ్లైఓవర్‌కు తోడుగా రెండో ఫ్లైఓవర్‌ను కూడా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది.  

అమరావతి అని కబుర్లు చెప్పేవారు అమరావతి కోసం ఏం చేశారు..? తిరుపతిలో మీటింగ్, అమరావతి పాదయాత్ర కోసం చేసిన ఖర్చు.. అమరావతిలో చేసి ఉంటే కనీసం మంచి రోడ్డు అయినా వచ్చేది..! జాతీయ రహదారిని విజయవాడ నుంచి బైపాస్‌ చేస్తూ అమరావతి నుంచి తీసుకెళ్లే గొప్ప కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ నాంది పలికారు. చినఅవుటుపల్లి నుంచి కాజ వరకు కంకిపాడు నుంచి వెళ్లే 40 కిలోమీటర్ల రోడ్డుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం త్వరలోనే భూసేకరణ చేపట్టనుంది. భూసేకరణకు కావాల్సిన నిధులను సీఎం కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వమే సగం డబ్బు భరించేందుకు సిద్ధమైంది. కృష్ణా నది మీద ఒక వంతెన నిర్మాణం కూడా జరుగుతుంది. 

శాసనరాజధానిగా ఉండబోతున్న అమరావతి ప్రాంత అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగానే జరిగి తీరుతుంది. ఎంత మంది ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ప్రజల గుండెల్లో సీఎం వైయస్‌ జగన్‌ది సుస్థిరమైన చోటు’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.
 

Back to Top