డిస్కంల పనితీరును మరింత మెరుగుపరచాలి

ట్రాన్స్‌ ఫార్మర్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు

రైతులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం

సచివాలయం: గ్రౌండ్‌ లెవల్‌లో విద్యుత్‌ వినియోగం, సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థల అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. సచివాలయంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కం) అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిస్కం సీఎండీలు డివిజన్‌ స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ వినియోగం, సరఫరాపై సమీక్షించుకోవాలని సూచించారు. డిస్కంల పనితీరును మరింత మెరుగుపరచాలన్నారు. 

రైతులకు విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోతే తక్షణం స్పందించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్‌లు రీప్లేస్‌ చేసే సందర్భంలో అధిక జాప్యం వల్ల రైతులు పంటనష్ట పోతారని, వారం రోజుల్లోగా కాలిపోయిన వాటి స్థానంలో పనిచేసేవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్‌ ఫార్మర్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. 

ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, డిస్కం సీఎండీలు  జె.పద్మాజనార్థన్‌ రెడ్డి, (సీపీడీసీఎల్‌) కె.సంతోషరావు (ఇపీడీసీఎల్‌), హెచ్‌ హరనాథ్‌ రావు(ఎస్పీడీసీఎల్‌), ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 

Back to Top