రాళ్ల దాడి పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా  

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతిలో చంద్రబాబుపై రాళ్ల దాడి అవాస్తవం

తిరుపతిలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదు

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనే మా అభ్యర్థిని గెలిపిస్తాయి

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం జవాబిస్తారు

తిరుపతి: తిరుపతి ప్రచారసభలో చంద్రబాబుపై రాళ్ల దాడి అవాస్తవమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సానుభూతితో ఓట్లు రాలుతాయని చంద్రబాబు భావించారు. రాళ్ల దాడి అంతా బూటకమని తేలిందన్నారు. రేపోమాపో టీడీపీ మూతపడుతుందని, అలాంటప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఆకుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చంద్రబాబు సభలో తాను షర్ట్‌ విసిరానని, రాయి వేయలేదని ఒప్పుకున్నారు. రాళ్లు వేయకపోయినా  వేసినట్లు చూపించి సానుభూతితో ఓట్లు వేయించుకోవాలనుకోవడం దురదృష్టకరం. మరోవైపు చంద్రబాబు కుమారుడు లోకేష్‌ అలిపిరి వద్ద ప్రమాణం చేస్తారా అని హైడ్రామా సృష్టించాడు. ఇవన్నీ కూడా  ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ము,దైర్యం లేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు నాటకాలాడుతున్నారు. మేమేదో తప్పు చేసినట్లు  వదంతులు సృష్టిస్తున్నారు. వాస్తవానికి అవేవి జరగలేదని తిరుపతి ప్రజలకు తెలుసు.

 మేం ఓట్లు అడిగేందుకు ప్రజల మధ్యకు ధైర్యంగా వెళ్తున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి  పాలన సాగిస్తునాన్నారు. మేమంతా ధైర్యంగా వెళ్లి ఓట్లు అడుగుతున్నాం. మీ గ్రామాల్లో ఫలాని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మరీ ఓట్లు అడుగుతున్నాం. 

స్వయాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ గురించి, నారా లోకేష్‌ గురించి ఏం మాట్లాడారో.. ఈ రాష్ట్రంలో సోషల్‌ మీడియాలో ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. మీ పార్టీలో సఖ్యత లేదు. అందరూ కూడా చంద్రబాబుకు, లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. రేపో మాపో మీ పార్టీ మూసేసే అవకాశం ఉంది. అలాంటి మీరు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లు అడుగుతారు. సీఎం వైయస్‌ జగన్‌ ఈ 22 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించారు కాబట్టే మేం ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం. 

మా అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం కూడా ముగుస్తోంది. ఎన్నికలే తరువాయి. సీఎం వైయస్‌ జగన్‌ ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో గమనించి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఓటు ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ రుణం తీర్చుకోవాలని ఓటర్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభ్యర్థించారు. 

గాలి వార్తలు రాసేవారు బాధ్యత తీసుకొని చంద్రబాబుపై రాళ్ల దాడి చేసినట్లు నిరూపించాలని పెద్దిరెడ్డి సవాలు విసిరారు. తల్లిదండ్రులు ఎస్సీ అయినప్పుడు గురుమూర్తి ఎస్సీ కాకుండా ఏలా సాధ్యమవుతుంది. బీజేపీ నేతలు మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. పోలింగ్‌ శాతం పెరిగితే వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి ఆరు లక్షల పైగా మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెన్నుపోటు రాజకీయాలు మా వద్ద లేవు. చంద్రబాబు సభలో కరెంటు ఆపేయాల్సిన అవసరం మాకు లేదు. 

చంద్రబాబు మాటలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు తెచ్చుకున్నా..పారా మిలటరీ బలగాలు తెచ్చుకొని ఎన్నికలు నిర్వహించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు మాదిరిగా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎమ్మెల్యేలను బలవంతంగా తన పార్టీలోకి చేర్చుకొని పదవులు పొందారు. అలాంటి నీచ సంస్కృతికి మా పార్టీకి లేదు. మాకు వైయస్‌ జగన్‌ బొమ్మ ఒక్కటే చాలు..ప్రజలు ఓట్లు వేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునర్ఘుటించారు. 

 

Back to Top