ముఖ్య‌మంత్రిపై నోరుపారేసుకుంటే నాలుక కోస్తా

నారా లోకేష్‌కు మంత్రి మేరుగు నాగార్జున హెచ్చ‌రిక‌

దళిత ద్రోహులు ఎవరో బహిరంగ చర్చకు రా తేల్చుకుందాం

వైయ‌స్ రాజారెడ్డి దేశానికి రెండు ఆణిముత్యాల‌ను ఇచ్చారు

నీ తాత‌, నీ బాబు నీలాంటి ముద్ద‌ప‌ప్పును ఇచ్చారు

వైయ‌స్ రాజారెడ్డి పేరు ఎత్తే అర్హ‌త లోకేష్‌కు లేదు

స‌చివాల‌యం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి మరోసారి నోటికొచ్చినట్లు మాట్లాడితే నారా లోకేష్ నాలుక కోస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై లోకేష్ చేసిన ఆరోపణలపై మంత్రి నాగార్జున తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకు అనుకూలమైనది వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబమని, దళితులకు వ్యతిరేకమైనది చంద్రబాబు కుటుంబమని సాక్ష్యాధారాలతో సహా  నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్మూ ధైర్యం ఉంటే ఈ విషయంపై  బహిరంగ చర్చకు రావాలని లోకేష్‌కు స‌వాల్ విసిరారు.

సచివాలయంలో మంత్రి నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం ఒక పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవని లోకేష్ నేరుగా ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కలలుకంటూ కండకావరంతో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము కూడా అంతకంటే ఎక్కువగా మాట్లాడగలమని, అయితే అలా మాట్లాడడానికి తమకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రి పదవిని సంపాదించి కోట్లు కొల్లగొట్టిన లోకేష్‌కు సీఎం వైయ‌స్ జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడు హయాంలో దళితులపై ఎన్నో దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయని, దళిత మహిళలను వివస్త్రలుగా చేసిన ఘోరమైన సంఘటనలు కూడా జరిగాయని వాటిని రాష్ట్రంలోని దళితులు ఎవరూ మర్చిపోరన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ అనే దళిత మేధావి చంద్రబాబు నాయుడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు అతని కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదన్నారు. ఆ కుటుంబాన్ని ప్రతిపక్షనేతగా ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ పరామర్శించి ఓదార్చారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో దళితులకు స్థలాలు ఇస్తే డెమెగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. ఎస్సీ హాస్టళ్లను కూడా మూసేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు.

రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరుగుతున్నా, వాటి విషయంలో ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరును గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ప్రశంసించిందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. రాష్ట్రంలో వైయస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని లోకేష్ ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజారెడ్డి ఈ దేశానికి, రాష్ట్రానికి ఆణిముత్యాల్లాంటి ఇద్దరు నాయకులను అందించారని చెప్పారు. అదే, లోకేష్ తాతలు, తండ్రి ఒక ముద్దపప్పును అందించారని ఎద్దేవా చేశారు. 

దళితులతో వియ్యం అందుకొని, అంబేద్కర్ భావజాలాన్ని భుజాలపై మోస్తున్న కుటుంబం వైయస్ రాజశేఖర రెడ్డిది అని చెప్పారు. అయితే చంద్రబాబు కుటుంబం ఎప్పుడూ దళిత వ్యతిరేకి అని అన్నారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, లోకేష్ కు, చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు వచ్చి దళితులకు తామే మేలు చేశామని చెప్తే చంద్రబాబు, లోకేష్ ను దుస్తులు ఊడదీసి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సంక్షేమ పథకాలు తమకు అందాయని ప్రజలు చెప్తున్నారని, మరోసారి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని నాగార్జున అభిప్రాయపడ్డారు. లోకేష్ మరోసారి ముఖ్యమంత్రిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top