ఎవరి సినిమా అయినా ఒకటే విధానం

‘భీమ్లానాయక్‌’కు కొత్తగా ఎటువంటి షరతులు పెట్టలేదు

ప్రభుత్వంపై కావాలనే ఎల్లో మీడియా, చంద్రబాబు, జనసేన దుష్ప్రచారం

బ్లాక్‌లో టికెట్లను అంగీకరించే ప్రసక్తి లేదు.. లూటీని ప్రభుత్వం సహించదు

చంద్రబాబు, ఎల్లో మీడియా ఉచ్చులో పవన్‌ పడొద్దు

తల్లిలాంటి సినిమాను రాజకీయాల కోసం వాడుకోవద్దు

సీఎం వైయస్‌ జగన్‌ తనను చాలా గౌరవించారని స్వయంగా చిరంజీవి చెప్పారు

చంద్రబాబు కోసం సొంత తమ్ముడే అన్నను అవమానిస్తాడా..?

ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తోంది

భారతి సిమెంట్‌పై చర్చకు మేం సిద్ధం.. హెరిటేజ్‌పై చర్చకు బాబు సిద్ధమా..?

పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని సవాల్‌

తాడేపల్లి: భీమ్లానాయక్‌ సినిమాకు ప్రభుత్వం కొత్తగా ఎటువంటి షరతులు పెట్టలేదని, పుష్ప, అఖండ, బంగార్రాజు సినిమాలకూ ఇవే నిబంధనలు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటేనని, అందరికీ ఒకటే నియమం, ఒకటే సిద్ధాంతమని చెప్పారు. బ్లాక్‌ టికెట్ల పేరుతో ప్రజలను దోచుకుంటామంటే కుదరదని హెచ్చరించారు. ప్రజల కోసమే సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శత్రువులు, మిత్రులను వేరుచేసి చూడరని స్పష్టం చేశారు. తల్లిలాంటి సినిమాను పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు వాడుకుంటున్నాడని, చంద్రబాబు రాజకీయంలో పావులుగా మారి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడారంటే..
తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా, జనసేన నాయకులు సీఎం వైయస్‌ జగన్‌ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్‌ సినిమా భీమ్లానాయక్‌ సినిమాను తొక్కే  ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన వైయస్‌ జగన్‌ 50 శాతానికి పైగా ఓట్లు, 151 సీట్లతో విజయం సాధించారు. ఆయన కుటుంబం నిరంతరం ప్రజల కోసం పని చేసింది. సీఎం వైయస్‌ జగన్‌ను అధికారం నుంచి దింపాలని కుట్రలు చేస్తున్నారు. వ్యక్తులు, కులాలు, మతాల మధ్య తగాదాలు పెట్టి, రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకుని ఒక గుంపుగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో ఎవరూ బలిపశువు కాకూడదు.

అన్ని సినిమాల మాదిరిగానే..
భీమ్లానాయక్‌ సినిమాకు ప్రభుత్వం కొత్తగా ఎటువంటి షరతులు పెట్టలేదు. అఖండ, పుష్ప సినిమాలతో పాటు, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా కావొచ్చు, భీమ్లానాయక్‌.. ఏ సినిమా అయినా ఒకే విధానంలో రాష్ట్రంలో విడుదల అయ్యాయి. ఇది పవన్‌ సినిమా కాబట్టి తొక్కేయాలని ఎవరూ అనుకోలేదు. బంగార్రాజు సినిమాకు మంత్రి కన్నబాబు సోదరుడు దర్శకుడు. అలా అని ఏ మాత్రం వారికి మేలు చేయలేదు. ఆ సినిమా తరహాలోనే భీమ్లానాయక్‌ కూడా విడుదల అయింది. సీఎం వైయస్‌ జగన్‌ ఎక్కడా వివక్ష చూపడం లేదు.

ఈ దోపిడికి ఆయన కారణం కాదా?
నిజానికి ఇవాళ్టి ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు కాదా? ఆనాడు కమిటీ వేయమంటే వినలేదు. కొందరు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుని ఇష్టం వచ్చిన రేట్లకు సినిమాలు ప్రదర్శించుకున్నారు. రూ.300, రూ.500, రూ.1000కి టికెట్లు అమ్ముకున్నారు. అయినా చంద్రబాబు కళ్లు మూసుకుని కూర్చున్నాడు. ప్రజలను దోచుకున్నా చూస్తూ కూర్చుండిపోయాడు. అందుకే గత ఎన్నికల్లో ఆయనను 23 సీట్లకు పరిమితం చేసిన ప్రజలు బుద్ధి చెప్పారు.

ఆ మాట మేము చెప్పలేదు..
చంద్రబాబుకు శ్రేయోభిలాషులుగా, ఆయన సీఎం కావాలని అనుక్షణం ఆరాటపడుతున్న వ్యక్తులు రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు, లింగమనేని రమేష్‌. వీరంతా ఇవాళ పవన్‌కు శ్రేయోభిలాషులుగా మారారు. అందుకే సీఎం వైయస్‌ జగన్‌కు పవన్‌కు ఒక యుద్ధం జరుగుతోందని, భీమ్లానాయక్‌ సినిమాను తొక్కేశారని ప్రచారం చేస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించని, ఎందుకూ పనికిరాని విధంగా చంద్రబాబు పని చేస్తుంటే, పవన్‌ కూడా అదే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు. ఫిబ్రవరి 23న జీఓ ఇస్తామని, కాబట్టి సినిమా విడుదల చేసుకోమని మేము ఎప్పుడూ చెప్పలేదు.

అన్నీ తెలిసినా.. కావాలనే..
ఈనెల 10న సినిమా పెద్దలు సీఎం వైయస్‌ జగన్‌ను కలిసి కొన్ని సూచనలు చేశారు. సీఎంకి కూడా సినిమా పరిశ్రమ పట్ల, ప్రజలపైనా స్పష్టమైన అవగాహన ఉంది. సినీ పరిశ్రమ కూడా బాగుండాలని సీఎం కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు వంటి వ్యక్తులు వ్యవస్థలను అడ్డు పెట్టుకుని పని చేస్తున్నారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జీఓ ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అనుకోకుండా మంత్రి గౌతమ్‌రెడ్ఢి హఠాత్తుగా మరణించడంతో, జీఓ రావడం ఆలస్యం అవుతోంది. ఈ విషయాలన్నీ పవన్‌కు తెలిసినా, రాజకీయాల కోసం అర్థాంతరంగా తేదీ ప్రకటించి, సినిమాను విడుదల చేసి, తన సినిమా కోసమే జీఓ ఆలస్యం చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు బాటలో నడవడం సిగ్గుచేటు. పవన్‌కు రెమ్యునరేషన్‌ అందింది. నష్టపోతే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఆయనకు మాత్రం ఏం నష్టం లేదు. అందుకే కావాలని ఈనెల 25న సినిమా విడుదల చేశారు.

నమ్ముకుంటే ముంచేస్తారు..
చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్న కొందరు వ్యక్తులు మీ శ్రేయోభిలాషులుగా నటిస్తూ, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఇస్తున్న సలహాలతో మీరు ముందుకు పోతే, 2024లో కూడా చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఓడిపోయే 25 లేక 30 సీట్లు ఇస్తారు. మీ వల్ల ఆయన బాగు పడే ప్రయత్నం చేస్తారు. అంతేతప్ప, మీరు, మీ పార్టీ బాగుండాలని వారు కోరుకోరు. కాబట్టి ఇలాంటి గుంటనక్కలను నమ్మొద్దు. సీఎంగా వైయస్‌ జగన్‌ ఉండొద్దన్న లక్ష్యంతో పనిచేస్తే పవన్‌కు ఏ మాత్రం ప్రయోజనం ఉండబోదు.

సీఎంగారు ఎంతో గౌరవించారు..
మొన్న నర్సాపురం సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ సీఎం వైయస్‌ జగన్‌కు తన అన్న ఒంగి ఒంగి నమస్కారం పెట్టారని అన్నారు. నిజానికి చిరంజీవిని ఇంటికి ఆహ్వానించిన సీఎం, గుమ్మం వద్ద నిలబడి రిసీవ్‌ చేసుకున్నారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. వైయస్‌ భారతి స్వయంగా వడ్డించారు. ఆ విషయాన్ని మర్చిపోయారా?. పవన్‌ మర్చిపోయారా?. ఆ విధంగా గౌరవిస్తే, అవేవీ వారికి గుర్తులేవా?. తనను సీఎం బాగా గౌరవించారని స్వయంగా చిరంజీవి చెప్పారు.     ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలతో కలిసి చిరంజీవి వచ్చారు. అక్కడ అధికారులు, మంత్రి నాని కూడా ఉన్నారు. పైగా ఆ సమావేశం క్యాంప్‌ ఆఫీసులో జరిగింది. సీఎం క్యాంప్‌ ఆఫీసులోకి ఏ కారు అయినా వెళ్తుందా? మేము ఎవరం వెళ్లినా క్యాంప్‌ ఆఫీస్‌ బయటే కారు ఆపుకుని వెళ్తాం. అలాగే సినిమా పెద్దలు కూడా వెళ్తే, వారిని అవమానించారని ప్రచారం చేస్తున్నారు. 

చిరంజీవి సంస్కారవంతులు..
చిరంజీవి తన ఇంట్లో పనివాళ్లు మొదలు పరిశ్రమలో అందరినీ గౌరవిస్తారు. చివరకు తన తమ్ముడు పవన్‌ వెళ్లినా లేచి రిసీవ్‌ చేసుకుంటారు. అలా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. అలాంటి చిరంజీవి సినిమా పరిశ్రమ బాగుండేలా సహాయ, సహకారాలు అందించాలని సీఎంను కోరినట్లు చెబితే, పనికి మాలిన ఎల్లో మీడియా ఆయనను సీఎం అవమానించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి అభిమానుల ఓట్లు దండుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, అది సాకారమయ్యేలా ఎల్లో మీడియా కుట్రలు చేస్తోంది.

పరిశ్రమను ఇబ్బంది పెట్టకండి..
పవన్‌ ఇవాళ మీ స్థాయికి, ఈ గుర్తింపునకు కారణం చిరంజీవి కాదా. మరి ఆయనను ఈ ఎల్లో మీడియా అవమానం చేస్తుంటే, పరిస్థితి అర్ధం చేసుకోండి. వారి మాయలో పడకండి. వార మాటలు విని, మీ సినిమాను ముందుకు తీసుకువచ్చారు. అందుకే ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించండి. తల్లి వంటి సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టకండి.

బ్లాక్‌లో టికెట్లకు నో..
రాష్ట్రంలో ఎవరి సినిమా అయినా ఒకటే వి«ధానం. బ్లాక్‌లో టికెట్లు అమ్మడాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రజలను లూటీ చేయడాన్ని ఒప్పుకోం. ఇక్కడ బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోవడానికి అలవాటు పడ్డారు. అది ఇక జరగకూడదని సీఎం వైయస్‌ జగన్‌  భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారు.

వారికి మద్దతు ఇవ్వొద్దు..
వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం వైయస్‌ జగన్‌ ఒంటరిగా పోటీ చేస్తారు. ఆయన ప్రజలను నమ్ముకున్నారు. అందుకే ఎవరైనా పొత్తుకు వస్తామన్నా ఆయన ఒప్పుకోరు. అందుకే సీఎం మీద అవాకులు, చెవాకులు పేలడం, ఆయనపై ఇష్టం వచ్చినట్లు విమర్శించే వారికి మీ మద్దతు ఇవ్వొద్దు. ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఉంది. 2024లో కూడా వైయస్‌ జగన్‌ సీఎం అవుతారు. మీరు ఫోర్‌ ట్వంటీగాళ్ల మాటలు నమ్ముకుంటే, వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలవబోరు. కాబట్టి రాజకీయాల కోసం సినిమాను వాడుకోవద్దు. మీకు సినీ రంగంలో జీవితం ఇచ్చిన చిరంజీవిని చిన్నతనం చేయొద్దని కోరుతున్నాను.

ఆయనో వింత జంతువు..
సీపీఐ నారాయణ ఒక వింత జంతువు. తమది జాతీయ పార్టీ అని చెబుతారు. ఆ జాతీయ పార్టీకి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరో జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీకి 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. మాకు 22 లోక్‌సభ సీట్లు, 6 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. వైయస్‌ వివేకానందరెడ్డి హత్యలో సీఎం వైయస్‌ జగన్‌ కుటుంబానికి ప్రమేయం ఉందని నారాయణ ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు నిన్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడుతూ, వారికి శుభాకాంక్షలు చెప్పారు. బాబుకు మైండ్‌ దొబ్బింది. నారాయణ కానీ, చంద్రబాబు కానీ ఉక్రెయిన్‌ గురించి మాట్లాడరు. ఎంతసేపూ సీఎం వైయస్‌ జగన్‌ మీద విమర్శలు.. విషం కక్కడమే వారి పని. సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పుడైనా విలువలతో రాజకీయం చేస్తారు. తాను ముందు పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన తల్లితో కూడా రాజీనామా చేయించారు. ఆ తర్వాత పార్టీ పెట్టి పోరాడారు. విజయం సాధించారు.

ఆయనవన్నీ స్వార్థ రాజకీయాలు..
చంద్రబాబువి ఎప్పుడూ స్వార్థ రాజకీయాలు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ వారసులను తొక్కాలని చూశారు. ఆ తర్వాత వారిని ప్రచారం కోసం వాడుకున్నాడు. చంద్రబాబు, ఆయన కుమారుడు చేసేవన్నీ దుర్మార్గ రాజకీయాలే.

చర్చకు సిద్ధమా? దమ్ముందా?
భారతి సిమెంట్‌ గురించి చంద్రబాబు ట్వీట్‌ చేశారు. భారతి సిమెంట్‌ ప్రభుత్వానికి కొన్ని లక్షల బ్యాగ్‌లు ఒక్కో బ్యాగ్‌ కేవలం రూ.235లకే భారీ సబ్సిడీ మీద ఇచ్చి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు, నాడు–నేడుకు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, చివరకు పేదల ఇళ్ల నిర్మాణానికి కూడా ఇస్తుంటే మరి చంద్రబాబు నాయుడు ఏరోజైనా ఒక గోరుముద్ద మెనూలో కానీ, సంపూర్ణ పోషణ మెనూలో కానీ, ఒక పాల ప్యాకెట్‌ కానీ మరి దేనికైనా ఒక్క రూపాయి అయినా సబ్సిడీ ఇచ్చి తన హెరిటేజ్‌ నుంచి సరఫరా చేశాడా. చేయకపోగా, కానుక పేరు చెప్పి మజ్జిగలో, నెయ్యిలో కమిషన్లు కొట్టేసిన ఘనత ఆయనది మాత్రమే. 

ఎవరైనా సమర్థిస్తారా?
ఒక్కో సినిమాకు ఒక్కో రేటు. ఒక్కో హీరో సినిమాకు ఒక్కో రేటు ప్రేక్షకుల నుంచి వసూలు చేయటాన్ని ఎవరైనా సమర్థిస్తారా? ఏ సినిమాౖకైనా ప్రేక్షకుడు ఒకే రేటు చెల్లించేలా సంస్కరణలు తీసుకువస్తే వాటిని విమర్శిస్తూ టీవీ5, ఏబీఎన్, ఈటీవీ, ఆంధ్రజ్యోతిల్లో అడ్డమైన వార్తలు, వ్యాఖ్యలు చేయిస్తున్నారు. తమ వాడు ముఖ్యమంత్రి కాకపోతే మంచి చేసినా అది చెడే అని పబ్లిక్‌కి నిసిగ్గుగా మెసేజ్‌ పంపుతున్నారు. అంతే కాకుండా ఇష్టమొచ్చినట్టు రేట్లు పెంచి.. దోచుకోనివ్వటం లేదని ఏకంగా తమ పార్టీ వారిని ఉసిగొల్పి ధియేటర్లలో కుర్చీలు, ఫర్నీచర్‌ విరగకొట్టించారు. బ్లాక్‌ టిక్కెట్లకు బహిరంగంగా వత్తాసు పలుకుతున్న ఈ రౌడీ మూకల్ని సమర్థిస్తారా లేక ప్రజలు తక్కువ రేట్లను సమర్థిస్తారా? 

చిన్నవాడైనా పెద్దమనసు..
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కుటుంబం ఏనాడైనా ప్రజల కోసం పని చేసింది. ప్రజల ఆదరణతోనే మేము గెల్చాం. అందుకే వారి కోసమే ప్రతిక్షణం ఆలోచిస్తాం. వైయస్‌ జగన్‌ అనుక్షణం ప్రజల కోసం పరితపిస్తారు. సినిమాను సినిమాగా, రాజకీయాలను రాజకీయాలుగా, ప్రజలను ప్రజలుగా, విలువలను విలువలుగా చూసే.. చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆలోచించే వ్యక్తి.

ఉచ్చులో పడొద్దు..
టీడీపీ, ఎల్లో మీడియా ఉచ్చులో పడొద్దని పవన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం వల్ల మీకు, సినిమా పరిశ్రమకు ఎలాంటి సమస్యలు రావు. రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని, ప్రభుత్వానికీ ఆదాయం రావాలన్న తపన తప్ప, ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఎంకి లేదు. ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు మాట్లాడేందుకు ఏమీ లేవు కాబట్టి, భారతి సిమెంట్‌ కంపెనీ, చిరంజీవికి సీఎం గౌరవం ఇవ్వలేదని.. ఇలా పనికి మాలిన వాటిని మాట్లాడుతున్నారు. నాగార్జున సినిమా బంగా్రరాజు సినిమా విడుదల అయినప్పుడు ఉన్న నియమాలే ఇప్పుడూ ఉన్నాయి. ఆ సినిమా విడుదల అయింది. సక్సెస్‌ అయింది. అందుకు నాగార్జున సీఎంకి కృతజ్ఞతలు కూడా తెలిపారు.

పుష్ప సినిమా నిర్మాతలు తెలిసినా, వారికి ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. అవే నిబంధనలూ ఇప్పుడు ఉన్నాయి. అంతే తప్ప పవన్‌ సినిమా కోసం కొత్తగా నియమ నిబంధనలు పెట్టలేదు. ఎక్కడా సినిమా థియేటర్లను సీజ్‌ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా పవన్‌ రాజకీయాల కోసం సినిమాలను వాడుకోవద్దు. సినిమాను సినిమా మాదిరిగానే చూడండి. చంద్రబాబు కోసం పని చేస్తున్న ఎల్లో మీడియా ఉచ్చులో పడకండి. 
 

తాజా వీడియోలు

Back to Top