అమరావతి: దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. రాధాకు ఏమీ జరగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి కొడాలి నాని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారంటూ రాధా ఆదివారం చేసిన వ్యాఖ్యల్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే సీఎం జగన్.. రాధాకు 2+2 గన్‌మెన్‌ను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని తెలిపారు. రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కూడా సీఎం సూచించారని చెప్పారు. ఎవరికి ప్రాణభయం ఉందని చెప్పినా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. రాధాపై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజకీయాల గురించి వంగవీటి రాధాతో మాట్లాడలేదన్నారు. గుడ్లవల్లేరులో ఆదివారం రంగా విగ్రహావిష్కరణకు రావాలని అక్కడివారు పిలిస్తే వెళ్లానని, ఆ కార్యక్రమానికి రాధా కూడా వచ్చారని చెప్పారు. వైఎస్సార్‌సీపీలోకి వస్తానని రాధా తమతో చెప్పలేదని, తాము ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. రాధా వైయస్ఆర్‌సీపీలోకి రావాలనుకుంటే ఆయనే చెబుతారని, అప్పుడు సీఎం జగన్‌తో మాట్లాడతామని చెప్పారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదు సినిమా టికెట్ రేట్లు ఎక్కడా తగ్గించలేదని, గతంలో ఉన్నవే కొనసాగుతున్నాయని మంత్రి కొడాలి నాని చెప్పారు. కోర్టుల ఆదేశాలతో సినిమా టికెట్ ధరలు పెంచి దోచుకునేందుకు తాము అవకాశం కల్పించలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. తాము చేస్తున్నదానివల్ల ఎగ్జిబిటర్‌కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కిరాణా కొట్టుకు కలెక్షన్లు ఎక్కువ వచ్చినప్పుడు సినిమా వాళ్లు పెట్టుబడులు కిరాణా కొట్లో పెట్టుకోవచ్చు కదా?.. అంటూ హీరో నాని మాటలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 శాతం సీట్లలో బీజేపీకి డిపాజిట్లు తెచ్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సూచించారు. ఓటీఎస్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ వారు ధర్నాలు చేసి మమ అనిపించారని ఎద్దేవా చేశారు. 50 లక్షల మందిలో 10 లక్షల మంది ఓటీఎస్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేది లేదు.. అని పేర్కొన్నారు. పేదల కోసం మనసున్న సీఎం జగన్ పెట్టిన ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.