జోలె పట్టుకొని తిరగడానికి సిగ్గులేదా..? 

గో బ్యాక్‌ అని ఇంటికే పరిమితం చేసినా బుద్ధి రాలేదా..?

నీ డ్రామాలు ప్రజలెఎవరూ నమ్మరు చంద్రబాబూ

అమరావతిలో మాట్లాడే మాటలు కర్నూలు, విశాఖలో మాట్లాడగలవా..?

బాబు అరాచకాలను కమ్యూనిస్టు రామకృష్ణ మర్చిపోయారా..?

కుదేలైపోతున్న టీడీపీని కాపాడుకునేందుకే చంద్రబాబు డ్రామాలు

అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ: నవరత్నాల అమలులో భాగంగా ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యజ్ఞం చేస్తుంటే.. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. అమరావతిలో రియలెస్టేట్‌ వ్యాపారం చేసి.. మళ్లీ జోలె పట్టుకొని తిరగడానికి సిగ్గులేదా..? అమరావతి నిర్మాణం కోసం గతంలో పోగుచేసిన డబ్బు ఏమైంది..? ప్రజల కోసం ఆందోళన చేస్తున్నట్లుగా డ్రామాలు ఆడుతూ ప్రజల జేబులే కొడతారా..? అని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. జోలెపట్టుకొని వసూలు చేసిన డబ్బును ఏం చేయబోతున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన చేయడానికి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడేందుకు పనికిరావని చంద్రబాబును ప్రజలు ఇంటికే పరిమితం చేసినా ఆయనకు బుద్ధిరాలేదన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారన్నారు. 

హైపవర్‌ కమిటీ భేటీ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే.. ‘చంద్రబాబు ఒక నెల రోజుల నుంచి తనదైన శైలిలో డ్రామాలకు తెరతీశాడు. ఇప్పుడా.. డ్రామా కంపెనీ షోలు విజయవాడ, అమరావతిలో కాకుండా నిన్న మచిలీపట్నం, ఇవాళ రాజమండ్రిలో నడుస్తున్నాయి. డ్రామాలన్నీ ప్రజలకు అర్థం కావాలని భ్రమపడుతున్నాడు. రైతుల్లో అభద్రతాభావం సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలనుకునే చంద్రబాబులో ఇంకా పూర్తిగా మెచ్యురిటీ రాలేదని అర్థం అవుతుంది. ఏడు నెలల క్రితం రాష్ట్ర ప్రజలు గొప్ప తీర్పును ఇచ్చారు. రాష్ట్రంలో పరిపాలన, ప్రజల అంశాలను మాట్లాడ్డానికి నువ్వు తగవు అని గో బ్యాక్‌ అని చంద్రబాబును ఇంటికి పంపించారు. 

వైయస్‌ఆర్‌ సీపీకి 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లను ప్రజలు కట్టబెట్టారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైయస్‌ జగన్‌ పనిచేస్తారనే నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఏడు నెలల నుంచి నవరత్నాలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ యజ్ఞం చేస్తుంటే.. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రాజధాని అంశాన్ని ఒక అవకాశంగా తీసుకొని చంద్రబాబు డ్రామాలు చేస్తున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా ఉద్యమాలు చేస్తున్నాడు. ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా.. వెనుకబడిన ప్రాంతాలు ఎప్పుడూ వెనుకబడే ఉండాలా..? 

సంపదను సృష్టించుకోవడానికి అమరావతిని క్రియేట్‌ చేసి అక్కడ రియలెస్టేట్‌ కంపెనీని నడిపించి లబ్ధిపొందాలనుకున్నారు. ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి జరిగి మిగిలిన ప్రాంతాలు నాశనం కావాలా..? ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం.. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, ప్రకాశం జిల్లా అభివృద్ధి మీకు పట్టదా..? అమరావతిలో మాట్లాడే మాటలు కర్నూలు, విశాఖ నడిబొడ్డున నిలబడి మాట్లాడగలిగే ధైర్యం మీకు ఉందా చంద్రబాబూ..? ఎందుకు ప్రజల్లో అపోహలు సృష్టించి రైతులను రోడ్డ మీదకు ఈడ్చే కార్యక్రమం చేస్తున్నావు. 

ఇవాళ నీతి కబుర్లు చెబుతున్నాడు. ఆ రోజున ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడానికి వైయస్‌ జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగిన వెంటనే నిర్బంధించి వెనక్కు పంపి కేసులు పెట్టి విషయాలు మర్చిపోయారా..? ఇవాళ కమ్యూనిస్టు నాయకుడు బాబుతో కలిసి పోరాటం చేస్తున్నాడు.. ఆ రోజున ఈ కమ్యూనిస్టు నాయకుడు రామకృష్ణను హోదా అంటే చంద్రబాబు జైల్లో పెట్టిన విషయం మర్చిపోయారా..? కాపుల హక్కుల కోసం ఉద్యమం చేస్తుంటే ముద్రగడ పద్మనాభంపై తప్పుడు కేసులు పెట్టి వారి కుటుంబసభ్యులను ఎలా హింసించారో మర్చిపోయారా..? సీఎం వైయస్‌ జగన్‌ ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. ప్రతి కుటుంబం లబ్ధిపొందాలని ముందుకు వెళ్తుంటే మొన్న ఇసుక, నిన్న ఇంగ్లిష్, ఇవాళ రాజధాని అంటున్నాడు. కేవలం అస్తిత్వం కోల్పోయి కుదేలైపోయిన టీడీపీని బతికించుకోవడం కోసం చంద్రబాబు ఈ రాష్ట్రంలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. దాని కోసమే ఈ ప్రయత్నం. 

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ హైపవర్‌ కమిటీని నియమించారు. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోక మునుపే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. నిన్నటి వరకు అమరావతి తాత్కాలిక రాజధాని అని చెప్పిన బాబు బాజాభజంత్రీలు ఇవాళ శాశ్వత రాజధానిగా.. దానికి సీఎం తాళాలు వేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల మనోభావాలను గౌరవించకుండా వారి మీద నీ రుద్దుడ్డి కార్యక్రమం చేస్తే ఇంతకు ముందే చాలా గుణపాఠాలు చెప్పారు.. మళ్లీ చెబుతారు.  ఏది చెబితే అది ప్రజలు నమ్మాలనుకునే అపోహ నుంచి చంద్రబాబు బయటకు రావాలి. సీఎం వైయస్‌ జగన్‌పై నమ్మకంతో నెల్లూరు నుంచి ఇచ్ఛాపురం వరకు ఒకే రకమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పును చంద్రబాబును గౌరవించి చేతగాని తనాన్ని ఒప్పుకొని సలహాలు ఇవ్వండి. 

జోలె పట్టుకొని తిరగడానికి సిగ్గులేదా.. అమరావతి నిర్మాణానికి పోగు చేసిన డబ్బులు ఏమయ్యాయో తెలియదు.. మళ్లీ జోలె పట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన డబ్బును ఏం చేయబోతున్నారు. ప్రజల కోసం ఉద్యమం చేస్తున్నానని చెప్పుకుంటే జేబుల నుంచి రూపాయి ఖర్చు పెట్టరు. ప్రజల డబ్బును కొట్టేసి రోడ్ల మీద తిరుగుతారా..?’ అని మంత్రి కన్నబాబు పశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top