సభలో టీడీపీ సభ్యుల తీరు దారుణం

దుష్ట సంప్రదాయానికి తెరతీశారు.. ఇది మంచి పద్ధతి కాదు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి: అసెంబ్లీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు దారుణంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సభలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ  ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని, గత ప్రభుత్వ విధానాలను మాత్రమే తప్పుబట్టామన్నారు. టీడీపీ సభ్యులు దుష్ట సంప్రదాయానికి తెరతీశారు.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. స‌భ‌లో టీడీపీ సభ్యుల చర్యను ఖండిస్తున్నామ‌న్నారు. రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో గవర్నర్  గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి, ఆయనను కించపరిచే విధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారని మండిప‌డ్డారు. గవర్నర్.. తన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏవిధంగా పనిచేయబోతుందో చెప్పే ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడం,  ప్రసంగ ప్రతులను చించి వేయడం దురదృష్టకరం, దుర్మార్గమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా.. శాసనసభలో సభ్యులు సంప్రదాయాలు పాటించాలి, సభా గౌరవాన్ని కాపాడాలనే ఆలోచన కూడా లేకుండా టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు సిగ్గు చేటన్నారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా, ఇకమీదట అయినా ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతున్నామ‌న్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top