పూర్తి పారదర్శకతతో మెరుగైన ఇసుక విధానం

నూతన ఇసుక పాలసీకి కేబినెట్‌ ఆమోదం

రీచ్‌లు ఉన్న గ్రామాలకు ఉచితంగా ఇసుక

నవంబర్‌ 24న ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభం

జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీ

మహిళా ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణ

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో బలోపేతానికి చర్యలు

ఆక్వా కల్చర్‌ సీడ్‌ యాక్ట్‌–2020కి కేబినెట్‌ ఆమోదం

వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూమి హక్కు, భూమి రక్షణ పేరుతో సమగ్ర భూసర్వే

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడి

సచివాలయం: వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో మెరుగైన ఇసుక విధానం అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సుమారు మూడున్నర గంటలకుపైగా జరిగిన మంత్రవర్గ సమావేశంలో సుమారు 33 అంశాలకు పైగా చర్చకు వచ్చాయన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

'ఇప్పటి వరకు ఉన్న ఇసుక విధానంలో కొన్ని అమలులో ఉన్న ఇబ్బందులు, సమస్యలను గుర్తించి.. వాటిని పరిష్కరించడం కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదికను సీఎంకు సమర్పించారు. ఇప్పటి వరకు ఉన్న విధానాన్ని మారుస్తూ ఇక నుంచి ఏ విధంగా అమలు చేయాలనేదానిపై ఒక విధానాన్ని ఖరారు చేయడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. దాదాపు 589 మంది రెస్పాండ్‌ అయ్యారు. వారి సలహాలను పరిగణలోకి తీసుకున్నాం. 

ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వించి డిపోల్లో పెట్టి స్టాక్‌ పాయింట్ల నుంచి విక్రయించే విధానాన్ని మారుస్తూ.. నేరుగా రీచ్‌ల నుంచి వినియోగదారులు ఇసుక తీసుకునే విధానం రాబోతుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంటస్ట్ర్‌ ఉన్నవారికి ఇసుక తవ్వకాలు అప్పగించాలని నిర్ణయించాం. ఇప్పటికే 8 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఎవరైనా ముందుకు వస్తే వారికి ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయం. 

ఒకవేళ ఎవరూ రానిపక్షాన 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి వాటికి పారదర్శక పద్ధతిలో రెండు పద్ధతుల్లో (టెక్నికల్‌ బిడ్డు, ఫైనాన్షియల్‌ బిడ్డు) టెండర్లు పిలవాలని నిర్ణయించాం. గత సంవత్సరం నుంచి ఉన్న అనుభవం దృష్ట్యా ఎంత ఇసుక అవసరం..? ట్రాన్స్‌ఫోర్ట్, లాజిస్టిక్స్‌పై చర్చ జరిగింది. వినియోగదారులు వారికి కావాల్సిన వాహనంలో ఇసుక తీసుకెళ్లొచ్చు. రీచ్‌ల వద్ద కొన్ని వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 

మూడు భాగాలుగా విభజిస్తే.. మొదటి భాగంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, 2వ విభాగంలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, 3వ విభాగంలో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప. కర్నూలు. వీటిని ఒక్కో విభాగంగా గుర్తిస్తూ.. నాలుగు జిల్లాలకు కలిపి టెండర్లు పిలుస్తారు. సరఫరా కూడా పూర్తిగా పారదర్శకపద్థతిలో జరగాలని సీఎం ఆదేశించారు. 

రీచ్‌లు ఉన్న గ్రామాలకు ఇసుక ఉచితంగా ఇస్తారు. గ్రామ సచివాలయంలో నమోదు చేసుకున్నవారికి కూపన్‌ ఇస్తారు.. ఎడ్ల బండ్ల ద్వారా కావాల్సిన ఇసుకను తీసుకెళ్లొచ్చు. బలహీనవర్గాల కాలనీలు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలు, రీచ్‌ల సమీపంలో ఉన్న గ్రామాలకు సబ్సిడీపై ఇసుక ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. అదే విధంగా కొన్ని బోట్‌మెన్‌ సొసైటీలు, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్న నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం. పట్టాభూముల నుంచి ఇసుక తీసుకునే విధానం రద్దు చేయడం జరిగింది. నాణ్యతను కూడా పరీక్షించుకొని ఇసుక తీసుకెళ్లొచ్చు. 

ఇసుక రీచ్‌ల వద్ద అమ్మకం ధరను ఫ్రీజ్‌ చేస్తారు. డిస్టెన్స్‌ను బట్టి ఆ ప్రాంతంలో సరఫరా చేసినప్పుడు ఏ ధరకు విక్రయించాలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అధిక ధరలకు ఇసుక అమ్మితే ఎస్‌ఈబీకి ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారు. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇంతకు ముందున్న ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని తీసేశాం. 

టాస్క్‌ఫోర్స్‌తో ఎస్‌ఈబీ అనుసంధానం
– అక్రమంగా మద్యం, ఇసుక రవాణా కట్టడికి సంబంధించి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను (ఎస్‌ఈబీ) పూర్తిగా బలోపేతం చేస్తూ వారికి కావాల్సిన అదనపు పోస్టులను క్రియేట్‌ చేస్తూ కేబినెట్‌ ఆమోదం. 
– గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్, మట్కా, నార్కోటిక్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు, నిషేధిత గుట్కా సరఫరా అన్నింటినీ ఎస్‌ఈబీ పరిధిలోకి తీసుకువస్తూ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడం కోసం టాస్క్‌ఫోర్స్‌తో ఎస్‌ఈబీ అనుసంధానం చేసి.. ఎస్‌ఈబీ బాధ్యతలు తీసుకునే విధంగా ఒక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
– ఎస్‌ఈబీని బలోపేతం చేయడం కోసం ఔట్‌సోర్సింగ్‌లో 71 పోస్టులు, డిప్యుటేషన్‌ మీద సుమారు 31 మంది అధికారుల పోస్టులను కేటాయించడం జరిగింది.

‘జగనన్న తోడు’కు కేబినెట్‌ ఆమోదం
–  చిరు వ్యాపారులకిచ్చే జగనన్న తోడు పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఫుట్‌పాత్‌పై చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు, తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునేవారు, చేతి వృత్తులతో జీవించే వారికి వడ్డీలేని రూ.10 వేల రుణం ఇచ్చేందుకు ‘జగనన్న తోడు’కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సుమారు రూ.1000 కోట్లు ఈ పథకానికి కేటాయించాలని, అడిగిన ప్రతీ ఒక్కరికి అర్హత ఆధారంగా ఐడెంటీ కార్డు ఇచ్చి రుణసదుపాయం కల్పించాలని కేబినెట్‌ తీర్మానం. ఇప్పటి వరకు 9.18 లక్షల మంది లబ్ధిదారులుగా గుర్తించారు. నవంబర్‌ 24వ తేదీన జగనన్న తోడు కార్యక్రమం సీఎం ప్రారంభిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే నమోదు చేసుకోవచ్చు. 

ఇంటికే నాణ్యమైన బియ్యం
నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు.  ఉచితంగా నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జనవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తాం. పౌరసరఫరాల శాఖ ద్వారా లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేయడం కోసం కేబినెట్‌ సబ్‌ కిటీ ఇచ్చిన సిఫారసులు వాటికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 9,260 మొబైల్‌ వాహనాలను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు. డిజైన్లు కూడా ఫైనలైజ్‌ అయ్యాయి. ఇందులో 80 శాతం వాహనాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 20 శాతం ఈబీసీలకు కేటాయించాలని నిర్ణయం. 60 శాతం ప్రభుత్వ సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణాలు, కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారుడు వాటాగా ఉంటుంది. 6 సంవత్సరాలకు మొబైల్‌ వాహనం లబ్ధిదారుడికి సొంతం అవుతుంది. 

బియ్యం అక్రమ మార్గంలో తీసుకెళ్లే అవకాశం లేకుండా.. ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్‌ కోడ్‌ వేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా బియ్యం బస్తా దొరికితే ఎక్కడి నుంచి ఎలా బయటకు వెళ్లిందని సులువుగా తెలుసుకునే కొత్త విధానాన్ని తీసుకువచ్చాం. అదేకాకుండా వాహనాలకు జీపీఎస్‌ సమకూర్చుతున్నాం. ఏ వాహనం ఏ వీధిలో ఏ ఇంటి దగ్గర పంపిణీ చేస్తుందనే ట్రాకింగ్‌ సిస్టమ్‌ కూడా జరుగుతుంది. దీని వల్ల రేషన్‌ బియ్యం కోసం క్యూలు కట్టి పడగాపులు కాసే పరిస్థితి ఉండదు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు నడుస్తోంది. జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. రేషన్‌ బియ్యం కోసం ప్రతి వినియోగదారుడికి పర్యావరణ హితంగా ఉండే రెండు బ్యాగులను ఇస్తారు. 

పాడిపరిశ్రమ బలోపేతానికి పటిష్ట చర్యలు 
రాష్ట్ర పాడిపరిశ్రమను పూర్తిగా బలోపేతం చేస్తున్నాం. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తేనే చిన్న చిన్న రైతులు బలోపేతం అవుతారు.. మహిళలకు స్వావలంబన జరుగుతుంది. సహకార రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రూ.1,362.22 కోట్ల రుణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రోజుకు 500 లీటర్ల కంటే ఎక్కువ పాల ఉత్పత్తి ఉన్న 9,899 గ్రామాల్లో మహిళా పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణ చేసేందుకు బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు ప్రారంభించబోతున్నాం. 

– పశువులకు అవసరమైన దాణా, మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలని కేబినెట్‌ నిర్ణయం. 

– వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా పాడి, పశువుల కొనుగోలు ప్రణాళిక సిద్ధంగా చేసి త్వరలో అమలు చేయబోతున్నాం. పాడి పరిశ్రమ పెంచాలని ప్రభుత్వ నిర్ణయం..  ప్రతి రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా ఒక పాల సేకరణ కేంద్రం నిర్మాణం. రైతులు సరఫరా చేసే పాలకు నిర్దేశిత సమయంలో డబ్బులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 

ఆక్వా కల్చర్‌ సీడ్‌ యాక్ట్‌–2020
– 2006లో రూపొందించిన ఆక్వా కల్చర్‌ సీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌ను ఇంకా ఆధునీకరించి ఆక్వా కల్చర్‌ సీడ్‌ యాక్ట్‌–2020ని కేబినెట్‌ ఆమోదించింది. రైతులకు నాణ్యమైన సీడ్‌ అందించడం చాలా ముఖ్యం. ఆక్వా రైతులకు భరోసా కల్పిస్తూ చట్టం తీసుకొచ్చాం. అంతేకాకుండా ఆక్వా రైతులకు అవసరమైన ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌–2020 తీసుకురావాలని కేబినెట్‌ ఆమోదించింది. 

సమగ్ర భూసర్వే కోసం రూ.1000 కోట్లు
– వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూమి హక్కు, భూమి రక్షణ పేరుతో సమగ్ర భూసర్వేను ప్రారంభించబోతున్నాం. ప్రతి అంగుళం భూమి కూడా రీసర్వే జరుగుతుంది. వ్యవసాయ భూములు కాకుండా.. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతి అంగుళం భూమిని రీసర్వే చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం డ్రోన్స్, అవసరమైన టెక్నాలజీని సమకూర్చుతున్నాం. దీనికి సుమారు 1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా'. 

– జనవరి నుంచి సమగ్ర భూసర్వే ప్రారంభం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేయిస్తాం. భూసర్వేకు 4,500 సర్వే టీమ్‌లను సిద్ధం చేస్తున్నాం. లెక్కలేని 30 లక్షల ఎకరాల భూమికి నకిలీ పేపర్లు సృష్టించినట్లుగా గుర్తించాం. రీ సర్వే ద్వారా నకిలీ డాక్యుమెంట్లకు చెక్‌ పెట్టేందుకు చర్యలు. వచ్చే ఏడాది జనవరి నుంచి 2023 నాటికి దశలవారీగా రీసర్వే పూర్తిచేస్తాం. భూసమస్యల పరిష్కారానికి మొబైల్‌ కోర్టుల ఏర్పాటు. ఫిజికల్‌ బౌండరీలను ఫిక్స్‌ చేసి.. సర్వే రాళ్లను ప్రభుత్వమే ఇస్తుంది. గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. 100 ఏళ్ల తరువాత మళ్లీ భూసర్వేను చేయబోతున్నాం. 

మంత్రి క‌న్న‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. 

– అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌లో చర్చ. డిసెంబర్‌ తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. కీలకమైన బిల్లుల కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. 
– 8 మెడికల్‌ కాలేజీలకు భూములు కేటాయింపు. 
– గుంటూరు ప్రభుత్వాస్పత్రి విస్తరణకు 6 ఎకరాల కేటాయింపు
– విజయవాడలోని అనాథాశ్రమం, శిశుభవన్‌ కోసం మిషనరీ ఆఫ్‌ చారిటీస్‌కు లీజు పద్ధతిన భూ కేటాయింపులు.
– వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం నవంబర్‌ 17న ప్రారంభం. గత ప్రభుత్వంలో సున్నావడ్డీ బకాయిలు రూ.1051 కోట్లు చెల్లిస్తాం. 
– ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్టేడియాలు ఏర్పాటు. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో క్రికెట్‌ స్టేడియాల నిర్మాణాలకు భూ కేటాయింపు.
– ఐదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న 48 ఏళ్లకు పైబడిన మహిళలకు విముక్తి. ఈ మేరకు గవర్నర్‌ ఆమోదం కోరాలని కెబినెట్‌లో నిర్ణయం. 
– వైద్యారోగ్య శాఖ టీచింగ్‌ స్టాఫ్‌కు యూజీసీ స్కేల్‌ అమలుకు నిర్ణయం. ఏడాదికి రూ.400 కోట్లకు పైగా భారం, 3,500 మందికి లబ్ధి. 
– నవంబర్‌ 10 నుంచి మరో 6 జిల్లాల్లో అందుబాటులోకి ఆరోగ్యశ్రీ. 
– అదానీ గ్రూపు వెళ్లిపోతున్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం. 150 ఎకరాల్లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అంగీకారం. గత ప్రభుత్వంతో 500 ఎకరాల్లో 6 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా అదానీ గ్రూపు ఒప్పందం చేసుకుంది. 

– మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం.

 

తాజా వీడియోలు

Back to Top