జ‌గ‌న‌న్న కాల‌నీల‌పై చ‌ర్చ‌కు వ‌చ్చే ద‌మ్ముందా..?

రామోజీరావుకు గృహ నిర్మాణ‌శాఖ మంత్రి జోగి ర‌మేష్ స‌వాల్‌

బాబు ఊరికో ఇల్లు కడితే.. వైయ‌స్ జగన్ ఊళ్ల‌నే నిర్మిస్తున్నారు 

పేద‌ల‌కు ఇళ్లు నిర్మిస్తుంటే రామోజీ, చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట..?

రామోజీకి బాబు బంధువైనంతమాత్రాన ఇలాంటి రాతలా..?

రాష్ట్ర ప్రగతి, సంక్షేమ ఫలాలు భారత దేశానికే ఆదర్శం

14 ఏళ్లు సీఎంగా చేసి బాబు ఎందుకు ఇళ్లు కట్టలేకపోయాడు అని రామోజీ రాశాడా..?

సీఎం వైయ‌స్ జగన్ చేస్తున్న మంచి రాయలేని రామోజీ.. అబద్ధాలను వండివారుస్తాడా?

తాడేపల్లి: రాష్ట్రంలో జ‌రుగుతున్న మంచి రామోజీరావు క‌ళ్ల‌కు క‌నిపించ‌డం లేదా..? ప‌చ్చి అబ‌ద్ధాల‌తో ప‌చ్చ‌రాత‌లు రాస్తూ అవాస్త‌వాల ప్ర‌చారాల‌కే ఎల్లో మీడియా ప‌రిమిత‌మైంది అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ ధ్వ‌జ‌మెత్తారు. పేదలకు ఇళ్లు కట్టించాలన్న సంకల్పంతో సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోంద‌ని.. కానీ, ప్రభుత్వంపై ఎల్లో మీడియా దిగజారుడు రాతలు రాస్తోంద‌ని మండిప‌డ్డారు. రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే అని, తన హయాంలో స్థలం ఇవ్వలేని, ఇల్లు కట్టలేని, 14 ఏళ్ల పాలనలో ఏమీ చేయని చంద్రబాబుకు రామోజీరావు వంతపాడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాబు పాలనలో ఊరికొక ఇళ్ల‌ను కట్టారని, ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారన్నారు. పేదలకు ఇళ్లు కడుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉందని, ప‌చ్చ‌మీడియాతో విష‌పురాత‌లు రాయిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. తప్పుడు కథనాలపై చర్చకు సిద్ధమా అంటూ రామోజీరావుకు మంత్రి జోగి ర‌మేష్ స‌వాల్ విసిరారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి జోగి ర‌మేష్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి జోగి ర‌మేష్ ఏం మాట్లాడారంటే..
నవరత్నాల్లో భాగంగా పేదలందరికి ఇళ్లు కట్టించాలనే గొప్ప ఆలోచనతో ముందుకు వెళుతున్న జగనన్న ప్రభుత్వం మీద ఈనాడు దినపత్రికలో ‘పునాదే దాటని పేదిళ్లు- నత్తనడకన రత్నం’అంటూ కట్టుకథలతో ఓ వార్తను ప్రచురించింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో,  ఏ ముఖ్యమంత్రి కూడా ఒకేసారి 30లక్షల 60వేల మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరుమీదే ఇళ్లు నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. అది ఒక్క మనసున్న మంచి మనిషి, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే సాధ్యమైంది. తన 3,648  కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర లో వైయ‌స్‌ జగన్‌.. పేదలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశారు కాబట్టే, అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్‌ రేటు ప్రకారం దాదాపు రూ.62వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇది ఈనాడు రామోజీరావుకు కనిపించదు.  ఆయనకు కనిపించేదల్లా అబద్ధాలే. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిదశలో 21లక్షల 25వేల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అంతా కళ్ళారా చూస్తున్నారు, కానీ ఈనాడు రామోజీరావు కళ్ళకు మాత్రం కనిపించవు.  ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా కోర్టుల్లో పిటిషన్లు వేయించడం, స్టేలు తీసుకురావడం ప్రజలందరికీ తెలుసు. 

దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ 30లక్షల 60వేలమందికి ఇళ్ల స్థలాల పంపిణీని ఒక యజ్ఞంలా చేపట్టి విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరోవైపు ఇళ్ల నిర్మాణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకపోతే ఆ విషయాన్ని ఈనాడు రామోజీ ఎప్పుడూ రాయలేదు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హయాంలో ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ ఇంతబాగా జరుగుతుందని ఏనాడూ రాసిన దాఖలాలు లేవు. 14ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఒక చేతగానివాడు, దద్దమ్మ, సన్నాసి కాబట్టే.. వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక,  30లక్షల 60వేలమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఏనాడైనా రామోజీరావు చెప్పగలిగారా ? 

ఇంటి నిర్మాణానికి పద్మావతి బ్యాంక్ అకౌంట్ లో రూ. 70 వేలు జమ
ఇటువంటి మంచిని తన పత్రికలో రాయకపోగా, రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే.. పశ్చిమ గోదావరి జిల్లా పాలాకోడేరు గ్రామానికి చెందిన ‘జుత్తిక పద్మావతి’ అనే ఒక సోదరి మాట్లాడినట్లు ఆమె పేరుతో ఈనాడు పత్రికలో  స్టేట్‌మెంట్‌ ను ప్రచురించారు. నిజంగా ఆమె మాట్లాడిందా? లేక రామోజీరావే కల్పించి, చెప్పించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జుత్తిక పద్మావతికి రెండువిడతలుగా ఆమె బ్యాంక్‌ ఖాతాలో రూ.70వేలు జమ అయ్యాయి. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, రాయితీతో సిమెంట్‌, ఐరన్‌ ఇవ్వడం జరిగింది. రామోజీరావు కట్టుకథలు అల్లుతున్నాడనేది ఈ ఘటన ద్వారానే నిరూపితం అయింది. 

రాష్ట్రంలోని ప్రజలందరికీ సొంత ఇల్లు ఉండాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ముందుకు వెళుతున్నారు. మరోవైపు అమ్మ ఒడి, చేయూత ఆసరా, రైతు భరోసా .. తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కి ఓటు వేయకూడదని రామోజీ తన పత్రిక ద్వారా ప్రచారం చేస్తున్నాడా..?. 14 ఏళ్లు అధికారంలో ఉండి, ఏ ఒక్క మేలు చేయని, అసమర్థ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇళ్లు కట్టలేదు. అలాగే అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా లాంటి ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. ఇప్పుడు ఇస్తున్నట్టుగా, ఠంఛన్‌గా ప్రతిగడపకు పెన్షన్‌ తీసుకువెళ్లి ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన చంద్రబాబుకు మీ మద్దతా ?. రామోజీరావుకు అసలు మానవత్వం అనేది ఉందా? ఆయన అసలు మనిషేనా? మనసున్న మనిషివే అయితే ఇవాళ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్న ముఖ్య‌మంత్రి గురించి మంచిగా ఏనాడూ ఒక ముక్క రాయకపోగా, ఆయన ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పకపోగా, సీఎం వైయ‌స్ జగన్‌ అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి వెళ్ళకుండా, కక్ష సాధింపు చర్యగా,  ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం తగునా అని రామోజీరావును సూటిగా ప్రశ్నిస్తున్నాం.

జగనన్న కాలనీల నిర్మాణంపై వర్క్ షాప్ పెడతాం, రామోజీ పాల్గొంటారా..?
రామోజీరావుకు.. చంద్రబాబు బంధువు అయితే కావచ్చు, సామాజికవర్గం కావచ్చు. ప్రజలు ఇవన్నీ గమనించడం లేదనుకుంటున్నారా.. ?  అని అడుగుతున్నాం. జగనన్న ఇళ్ల కాలనీలపై మీ పత్రికలో ఒక వార్తనే ప్రచురించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి,  నేను పాత్రికేయ మిత్రులకు వంద మేలులు చూపిస్తా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణల ప్రగతి ఏవిధంగా ఉన్నాయో ఒక వర్క్‌ షాప్‌ పెట్టిస్తాం. ఆ చర్చలో పాల్గొనేందుకు రామోజీరావు రావాలని డిమాండ్‌ చేస్తున్నా. ఏఏ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు ఏవిధంగా జరుగుతున్నాయి, పనుల ప్రగతి ఏవిధంగా ఉందో కళ్లకు కట్టినట్లు మీరు చూడాలి. రామోజీరావుకు నిజంగా మనసుంటే వాటిని ప్రచురించాలి.

మీ అజెండా ఒకటే.. రాష్ట్ర ప్రభుత్వం మీద, వైయ‌స్‌ జగన్‌ పై నిత్యం ఏదో ఒక బురద అంటించాలి, తద్వారా నిందలు వేయాలి, ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న మీ దురుద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.  ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి,  మీ తాబేదార్లు, మీ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలనే మీ తపన, మీ ఆరాటం అర్థం అవుతోంది. పేదల కోసం ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే చంద్రబాబుకు, రామోజీరావుకు ఎందుకింత కడుపుమంట అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. వీటిపై ఎల్లో మీడియాలో వస్తున్న వార్తల గురించి ప్రజలంతా గమనించాలి.

జగనన్న ఊళ్ళకు ఊళ్ళే కడుతున్నారు
చంద్రబాబు నాయకత్వంలో ఊరికి ఒక ఇల్లు కడితే, అదే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైయ‌స్‌ జగన్ నాయకత్వంలో ఊళ్లకు ఊళ్లే నిర్మాణాలు జరుగుతున్నాయి. 17వేల పైచిలుకు జగనన్న కాలనీలు, గ్రామాలు, పట్టణాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఒక కాలనీ నిర్మాణం చేయాలంటే అప్రోచ్‌ రోడ్డు, మౌలిక వసతులు, కరెంట్‌, మంచినీరు, డ్రైనేజ్‌ వ్యవస్థను నెలకొల్పాలి. అలాంటి ఆ కాలనీల నిర్మాణంలో ఎలాంటి అలసత్వం చూపించవద్దంటూ ముఖ్యమంత్రిగారు గృహ నిర్మాణ శాఖను పరుగులు పెట్టిస్తున్నారు.

ఇసుక ఉచితం, సిమెంట్‌, ఇనుము సబ్సిడీ ధరకే అందిస్తున్నాం. సుమారుగా 12 రకాల వస్తువులను అందించడం ద్వారా లబ్ధిదారులకు రూ. 55వేలు లబ్ది చేకూరుతోంది.  పేద కుటుంబాలు సొంత గూడు నిర్మించుకుని ఆ గృహాల్లో సంతోషంగా సంబరాలు జరుపుకోవాలనుకునే ప్రభుత్వం మాది. ఆదిశగా ముందుకు వెళుతున్నాం. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు కలిసి కుట్రలు పన్నుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీ ఓర్వలేని తనాన్ని, వక్రబుద్ధిని అందరూ గమనిస్తున్నారు. 

దేశానికే ఏపీ ఆదర్శం
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలు భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి దేశంలో మరే రాష్ట్రంలో జరగటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల నిర్మాణంలో బ్రహ్మాండంగా అడుగులు ముందుకు వేస్తున్నారని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కితాబు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ని కేంద్ర ప్రభుత్వ మంత్రులే ప్రశంసిస్తుంటే.. చూసి ఓర్వలేక, ఎల్లో మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తున్నారు. దీనిపై చర్చకు రామోజీరావు రావాలని సవాల్‌ విసురుతున్నాం. లబ్ధిదారులతో అబద్దాలు చెప్పించడం తప్పుకాదా? పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించడం సరైన పద్ధతేనా? ఇంత దుర్మార్గంగా కట్టుకథలు అల్లుతారా? అబద్ధాలతో పత్రికను నడపాలని చూస్తారా?  ఇళ్ళ నిర్మాణానికి సంబందించి మీరు రాసిన ఇవాల్టి బ్యానర్‌ వార్త మీద చర్చకు సిద్ధమా అని రామోజీరావుకు సవాల్‌ విసురుతున్నాం. మీరు రాకపోయినా, కనీసం మీ తాబేదారు చంద్రబాబు చర్చకు రాగలిగే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నాం. 

పేపర్‌, టీవీ చానల్స్‌ ఉన్నాయని రాసేద్దాం, అబద్ధాలు చెప్పేద్దామనుకుంటే పొరపాటు. మీ పాపం ఊరికే పోదు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని మీరెంతగా తపన పడ్డా, తలక్రిందులుగా తపస్సు చేసినా, మోకాళ్ల దండ వేసి రాష్ట్రం అంతా తిరిగినా, పాదయాత్రలు చేసినా రామోజీరావు, రాధాకృష్ణా, టీవీ5 నాయుడుల కోరిక నెరవేరదు.  మీ పాపం ఊరికే పోదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద బాదుడే బాదుడు.. అంటూ అసత్య ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారు. 

మీకు కుమ్ముడే.. కుమ్ముడు
గడప గడపకు కార్యక్రమం ద్వారా మేము ప్రజల వద్దకు వెళ్లినప్పుడు.. 2019లో ఎలా అయితే చంద్రబాబుకు గుణపాఠం చెప్పామో, 2024లోనూ మిమ్మల్ని కుమ్ముడే.. కుమ్ముడు.. అని ప్రజలు అంటున్నారు. మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో జనం కుమ్మేస్తారని రాసిపెట్టుకోండి. వచ్చే  ఎన్నికల్లో, 151 స్థానాలు కాదు, 175కు 175  స్థానాలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ప్రభంజనం సృష్టించబోతోంది. ఆఖరికి కుప్పంలో కూడా చంద్రబాబు కుదేలు అయిపోతాడు. పచ్చ పత్రికలు అన్నీ కలిసి కట్టుగా ప్రభుత్వం మీద బురదల్లినా, మీరు ఎన్ని అబద్ధాలు రాసినా, టీవీల్లో ఎన్ని కారు కూతలు కూసినా.. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని కుమ్మేయడం ఖాయం. ఇక చంద్రబాబు హైదరాబాద్‌కు దారి వెతుక్కోవడమే. ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గపు క్రీడలు కట్టిపెట్టాలని చంద్రబాబు, రామోజీరావును హెచ్చరిస్తున్నాం. 

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా రుచి చూపించారు. పూలే ఆశయాల్ని అనుసరిస్తూ సామాజిక ధర్మాన్ని అమలు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలు, స్ఫూర్తిని ప్రజలకు తెలియజెప్పారు. బహుజన నేత జగ్జీవన్‌ రామ్ ఆలోచలకు అనుగుణంగా వైయ‌స్‌ జగన్ పరిపాలన చేస్తున్నారు.  75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఇలాంటి మహనీయుల ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ పరిపాలన బ్రహ్మాండంగా సాగుతోంది. రాబోయే  25ఏళ్ల పాటు జగనన్నే ముఖ్యమంత్రి.. జయహో జగనన్న అంటూ రాష్ట్రంలోని ప్రజలంతా నినదిస్తున్నారు. రామోజీరావు ఇప్పటికైనా కారుకూతలు, తప్పుడు వార్తలను రాయడం, ప్రచురించడం మానుకోవాలి. మనిషివైతే, రాష్ట్రంలో జరిగే మంచిని, మనసుపెట్టి  చూసి మేము చూపించే, వాస్తవాలను మీ పత్రికలో రాయమని సూచిస్తున్నాం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top