శ్రీకాకుళం : ఇంటి ఇల్లాలికి మద్దతుగా ఆమెకు ఆర్థిక ప్రయోజనం దక్కేవిధంగా సంక్షేమ పథకాలు వర్తింప జేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కుటుంబ ఉన్నతికి పాటుపడే తల్లికి ఆర్థిక అండ అందించేందుకే సంక్షేమ పథకాలు వర్తింపు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లో డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తున్నామని, ఎక్కడా అవినీతికి, లంచాలకు తావు లేదన్నారు. శుక్రవారం బాదుర్లపేటలో మంత్రి ధర్మాన ప్రసాదరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. బాదుర్లపేట సచివాలయం పరిధిలో ఆయన ఇంటింటికీ తిరిగి, పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానిక సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటయిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావడంతో పాలనకు సంబంధించి ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాం. వాటి అమలు ఎలా ఉందో తెలుసుకునేందుకే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం.ఎన్నికలకు ముందు మాకు ఓటు వేస్తే ఏం చేస్తామో చెప్పాం. వాటికి ఆచరణ రూపం ఇస్తూ పలు పథకాలు తీసుకువచ్చాం. వాటికి సంబంధించి లబ్ధిదారులు ఏమనుకుంటున్నారో అన్నది ముఖ్యం. ఒకవేళ తప్పిదాలు ఉంటే దిద్దుకుంటాం. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఈ విధంగా చేయగలిగిందా ? ఈ విధంగా చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. ధైర్యం అంటే మొండి ధైర్యం అని కాదు. చెప్పింది చేయగలిగి తరువాత చేశామా లేదా అన్నది ముఖ్యం. ఇవన్నీ ఎన్నికల కోసం చేస్తున్నవి కావు. మీరు ఓటు వేశారు. మీ వల్లే ఈ ప్రభుత్వం వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతలను మేం సక్రమంగా నిర్వర్తించగలిగామా లేదా అన్నదే ముఖ్యం. ఆ క్రమంలో ఇచ్చిన హామీల నెరవేర్పు, మీకు చేరుతున్న పథకాల సరళి, ఇంకా ఇతర కార్యక్రమాల నిర్వహణ అన్నవే కీలకం. అందుకోసమే ఈ కార్యక్రమం. అంతేకానీ ఇదేమీ ఎన్నికల కోసం కాదు. ఎన్నికలను ఉద్దేశించి మా నాయకులు మాట్లాడినా సరే ! అసలు ఓ ప్రజా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది అన్నదే ముఖ్యం. ప్రతిపక్షాలు చెబుతున్న విధంగా మేం డబ్బులు జల్లేస్తున్నాం అని! అది నిజమేనా ! అవసరం లేని వారికి ఇచ్చేస్తున్నామా.. పోనీ ఇవి ఇస్తున్న వేళ లంచగొండితనం ఏమయినా ఉందా ? ఇంతకుముందు ప్రభుత్వం చేసిన అరకొర పనులకు కూడా దాదా గిరీ చేసేవారు. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలులో లంచగొండితనం అన్నది లేదు. మీకు పింఛను అందించే క్రమంలో కానీ లేదా ఇతర సంక్షేమ పథకాలు అందించే విషయమై కానీ ఎక్కడా అవినీతికి తావు లేదు. ఒక్కరైనా చెప్పండి అటువంటివి ఏమయినా ఉంటే. కానీ విపక్షాలు మాత్రం ఇవన్నీ దండగమారి పనులు అని విష ప్రచారం చేస్తున్నాయి. వాటిని మనం తిప్పికొట్టాలి. ఇవన్నీ సేవలే ఇవన్నీ చేయాలంటే దృక్పథం కావాలి. నలభై లక్షల మందికి పైగా పింఛన్లు నెల మొదటి రోజునే ఇస్తున్నాం. ఎక్కడయినా చెప్పండి రోడ్లు బాలేవు అన్న విషయం. ఏదయినా చెప్పండి రోడ్లు బాగుండక పోతే చెప్పండి. వెంటనే సవరిస్తాను. పరిష్కరిస్తాను. సరిదిద్దుతాను. ప్రజలు ఇచ్చిన అధికారం ఏనాడూ దుర్వినియోగం చేయలేదు. ఓడిపోతే ఓడిపోతాను కానీ ఆ విధంగా చేయను. చేసిన దాఖలాలు కూడా లేవు. ఎనభై అడుగుల రహదారి నేనే వేశాను. ఒక్క సెంటు భూమి అయినా నాకు అక్కడ ఉందా ? చెప్పండి. ఇవన్నీ విపక్షాల విష ప్రచారాలు. విశాఖ భూముల విషయమై కూడా చేస్తున్నవి విష ప్రచారాలే , ఇవి కూడా విపక్షాలు సంబంధిత మీడియా చేస్తున్నవేనని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.