పకడ్బందీగా, అత్యాధునిక పరికరాలతో భూసర్వే

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు

రైతులు, భూయజమానులు నిశ్చింత‌గా ఉండొచ్చు

వందేళ్ల తరువాత భూముల రీసర్వేకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి అచ్చెన్నకు, రామ్మోహన్‌కు కనిపించడం లేదా..?

మరో ఆరు మాసాల్లో గొట్టా వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తవుతుంది

వేసవి కాలంలోనూ శ్రీకాకుళం జిల్లాలో వంశధార నీరు ప్రవహించనుంది

అమరావతి పాదయాత్ర ఆపకపోతే ఉత్తరాంధ్రలో టీడీపీకి ఒక్క ఓటర్‌ కూడా మిగిలేవాడు కాదు

15 ఏళ్లు ముఖ్యమంత్రిగా శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు చేసిందేమైనా ఉందా..?

ఉత్తరాంధ్రకు క్యాపిటల్‌ వద్దన్న తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిందే..

శ్రీకాకుళం: విశాఖలో క్యాపిటల్‌ వద్దన్నందుకు, శ్రీకాకుళం ప్రాంతాన్ని శాశ్వతంగా వెనుకబడిన  ప్రాంతంగా ఉంచాలని కుట్ర చేస్తున్నందుకు, 23 కేంద్ర సంస్థల్లో ఒక్క సంస్థను శ్రీకాకుళంలో పెట్టనందుకు, మన ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిన అవసరం ఉందని, ఊరూరా అందరూ చెప్పాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. వంద సంవత్సరాల రాష్ట్రంలోని భూముల రీసర్వేకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌ వేదికైనందుకు సంతోషంగా ఉందన్నారు. సభా వేదికపై నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు తన సందేశాన్ని వినిపించారు. 

‘‘భూమికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమం ఇది. పాదయాత్రలో రాష్ట్రమంతా పర్యటించారు. అప్పుడు చూసిన విషయాలు.. అప్పుడు విన్న బాధితుల మాటలు, తదుపరి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయాలనే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందు చెప్పి.. ప్రజలు ఆశీస్సులు కోరారు. ప్రజల దీవెనతో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చింది. అందులో ఇచ్చిన హామీ భూసర్వే. ఎప్పుడో బ్రిటీష్‌ కాలంలో భూముల సర్వే జరిగింది. ఆ రికార్డులతోనే ఇప్పటి వరకు భూ వ్యవహారాలు నడుపుకుంటూ వస్తున్నాం. దీని వల్ల చాలా మంది బలహీనమైన రైతులు, అమాయకులైన రైతులు నష్టపోతున్నారు, అభద్రత భావంతో ఉన్నారు. ఏదో ఒక నెంబర్‌ వేసి రిజిస్ట్రేషన్‌ చేశారండీ.. వేరొకడు వచ్చి నా భూమి మీద కూర్చున్నాడు. భూమి నాది కానీ, వేరే సర్వే నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ నాకు అయిపోయిందని వాడు చెబుతున్నాడు’ అనే మాటలు వింటుంటాం. అదే విధంగా తనకున్న ఆస్తిని రుజువు చేసుకోవడానికి నేను బలహీనుడిని, అధికారుల దగ్గరకు తిరిగే ఓపిక నాకు లేదు.. దీని ఖరీదు 10 కోట్లు అయితే నాకో 50 లక్షలు ఇచ్చేయండి అని సర్దుకుపోయే సందర్భాలను చూశాం. బలహీన వ్యక్తులు వారి ఆస్తులను సులువుగా రుజువు చేసుకోలేక ఆస్తులను అప్పనంగా ఇచ్చే సంఘటనలు ఎన్నో చూశాం. 

వంద సంవత్సరాల తరువాత భూముల రీసర్వేకు సీఎం వైయస జగన్‌ శ్రీకారం చుట్టారు. భూముల సర్వేకు సహకరించాలి. డ్రోన్‌తో చేసిన తరువాత ఫిజికల్‌గా సర్వే చేస్తారు.. అప్పుడు కచ్చితంగా రైతు ఉండాలి. ఒకసారి మీకు పట్టాలు ఇచ్చేస్తే మీ భూమి ఇంకా ఎవ్వరికీ రిజిస్ట్రేషన్‌ కూడా కాదు. ఆ మార్పులు అన్నీ తెస్తున్నాం. రిజిస్ట్రేషన్‌లో తారుమారు చేసే అవకాశాలు లేకుండా చేశాం. ఈ భూ సర్వే ద్వారా రైతులు, భూ యజమానులు భద్రంగా ఉండొచ్చు. కొంతమంది సర్వే జరుగుతున్నప్పుడు అందుబాటులో ఉండొద్దు అని చెబుతున్నారు. అలా చేయొద్దు. చాలా డబ్బులు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రతీ నెలా ఈ కార్యక్రమం రివ్యూ చేస్తున్నారు. ఒక సర్వే డిపార్టమెంట్‌ అధికారికి ఎంత తెలుసో.. అంత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు తెలుసు.. అంతగా దీనిపై స్టడీ చేశారు. 

భూముల రీసర్వే కోసం అత్యాధునిక పరికరాలు తెప్పించాం. సబ్‌ కమిటీ వేసి రివ్యూ చేస్తున్నాం. 2000 గ్రామాల్లో భూసర్వే మరో 15 రోజుల్లో పూర్తవుతాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. మీ గ్రామంలో, మీ కళ్ల ముందు ఉండే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. ముటేషన్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. భూమి రిజిస్ట్రేషన్‌ అయిపోయిన వెంటనే ముటేషన్‌ ఆటోమెటిక్‌గా అయిపోయింది. 2000 సచివాలయాల పరిధిలో పూర్తిచేసిన పని మరో నెల రోజుల్లో వాటిని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుగా మార్చేస్తాం. దాని కోసం అహోరాత్రులు ఫీల్డ్‌స్టాఫ్‌ నుంచి సెక్రటరీ వరకు అందరు అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు. 

2023 చివరి నాటికి భూసర్వే పూర్తిచేయాలని సీఎం టార్గెట్‌ పెట్టారు. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది ముఖ్యమైంది.. ఇంకో మాట లేదు. అందరూ సహకరించాలని కోరుతున్నాం. 

శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చూస్తున్నాను.. 15 సంవత్సరాల్లో చంద్రబాబు ఒక్క ప్రయోజనకరమైన పని శ్రీకాకుళం జిల్లాకు చేశాడని చెప్పమనండి. రాష్ట్రం విడిపోతే నష్టపోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు 23 సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. విభజన సమయంలో 13 జిల్లాలకు 23 సంస్థలకు గానూ వెనుకబడి ప్రాంతంగా మన జిల్లాకు కనీసం 4 సంస్థలు రావాలి. చంద్రబాబు ఒక్క సంస్థ అయినా తీసుకొచ్చారా..? అచ్చెన్నాయుడు అప్పుడు ఏం చేశాడు.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు అప్పుడు ఎక్కడున్నారు..? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థలను కూడా మీరు పెట్టించలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు. 

మన ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సరాలు అయ్యింది. ఇచ్ఛాపురంలో ఒక సమస్య ఉండేది. రోజు చనిపోతున్నారని పేపర్లలో వచ్చేది. అధికారం ఉన్న ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ఏం చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్ఛాపురం వెళ్లి స్వయంగా వెళ్లి చూశారు కాబట్టే.. కిడ్నీ రోగాలకు కారణం ఏంటని వెతికితే.. గ్రౌండ్‌ వాటర్‌ అని తేలింది. అందుకోసం క్షీరమండలం రిజర్వాయర్‌ నుంచి రూ.700 కోట్ల నిధులిచ్చి ఉద్దానం ప్రాంతంలో ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికి మంచినీరు తీసుకెళ్లి శాశ్వతంగా కిడ్నీ రోగాలు లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఏనాడైనా ఎవరైనా ఇలా ఆలోచించారా..? 

ఇప్పటికే కిడ్నీ రోగాలతో బాధపడుతున్న వారి కోసం రూ.10 వేల పింఛన్‌ ఇస్తున్నారు. పలాసలో రూ.100 కోట్ల రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మిస్తున్నారు. వచ్చే మార్చి, ఏప్రిల్‌లో ఆ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభానికి సిద్ధం అవుతుంది. ఇదంతా జరుగుతున్నా.. అభివృద్ధే జరగలేదని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంచుమించుగా చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. ఈ 15 ఏళ్ల కాలంలో శ్రీకాకుళం జిల్లాకు పలానా గొప్ప పనిచేశానని చంద్రబాబు చెప్పగలడా..? 

మనందరికీ ప్రాణాధారమైన వంశధార ప్రాజెక్టును దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఆ తరువాత ఐదు సంవత్సరాల్లో అది పూర్తికాలేదు. సమస్యలు పరిష్కరించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ స్వయంగా ఒడిశా వెళ్లారు. చంద్రబాబు 15 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఒడిశా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లాడా..? ఎవరిదీ శ్రీకాకుళం జిల్లా పట్ల, ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి. రూ.2 వేల కోట్లతో రిజర్వాయర్‌ పూర్తయింది.. ప్యాకేజీలు కంప్లీట్‌ అయ్యాయి. ఒడిశాతో సమస్య పూర్తయ్యేందుకు సమయం పడుతుందని చెబితే.. గొట్టా దగ్గరే మీరు లిఫ్ట్‌ పెట్టించేయండి.. ఆరు మాసాల్లోనే రిజర్వాయర్‌ నిండిపోతుంది.. శ్రీకాకుళం అన్ని ప్రాంతాలకు నీరు వస్తుందని చెబితే మరుసటి రోజే మీటింగ్‌ పెట్టి రూ.180 కోట్లను లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు కేటాయించారు. మరో ఆరు మాసాల్లో అది పూర్తవుతుంది. రిజర్వాయర్‌ 19 టీఎంసీలు నింపి.. శ్రీకాకుళం జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో ప్రతీ గ్రామంలో మే 15వ తేదీ అంటే పిట్టలు ఎండకు చనిపోయే సమయంలో కూడా చల్లటి నీరును సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం ఈ జిల్లాకు అందించడం జరుగుతుంది. 

ఏ పేదవాడి తాలూకా జీవనం దెబ్బతినకుండా, అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్డు మీద గుంతను చూపించి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సరైన రోడ్లు వేసి ఉంటే మూడున్నర సంవత్సరాలకే ఎలా గుంతపడింది. మేము వచ్చి మూడున్నరేళ్లే కదా..! 1.73 లక్షల కోట్ల డబ్బును మూడున్నర సంవత్సరాల్లో సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. దీంట్లో అధికారి లంచం అడిగాడని, ఒక కార్యకర్త అడిగాడని ఎవరైనా చెప్పగలరా..? 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం వల్ల విశాఖపట్టణానికి పరిపాలన రాజధాని వచ్చింది. చంద్రబాబు హైదరాబాద్‌లో నివాసం ఉంటాడు.. జూమ్‌ కెమెరాకు మాత్రం దగ్గరగా ఉంటాడు. తెలంగాణలో ఉండే చంద్రబాబుకు ఏపీలో ఎక్కడ క్యాపిటల్‌ పెడితే నీకేం ఇబ్బంది. వెయ్యి సంవత్సరాల క్రితం మా తాతలు, తండ్రులు క్యాపిటల్‌ చెన్నై వెళ్లాం. మరో 3 సంవత్సరాలు కర్నూలు వెళ్లారు. మరో 75 సంవత్సరాలు మా తండ్రులు, మేము 850 కిలోమీటర్ల దూరం ఉన్న హైదరాబాద్‌కు పరిగెత్తాం. ఈరోజు సీఎం వైయస్‌ జగన్‌ దయ వల్ల విశాఖను పరిపాలన రాజధాని చేయాలని, కర్నూలును న్యాయరాజధానిలో, శాసనసభ వ్యవహారాలన్నీ అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రకు ఇస్తామన్న క్యాపిటల్‌ వద్దని చెప్పడానికి అమరావతి నుంచి కొందరిని ఉసిగొల్పాడు. మా చేతితో మా కళ్లు పొడిపిస్తారా..? అమరావతి వాసుల పాదయాత్ర విశాఖ చేరి ఉంటే.. చంద్రబాబుకు ఒక్క ఓటర్‌ కూడా మిగిలి ఉండేవాడు కాదు. సాయం చేస్తే చేయండి.. లేకపోతే సాయం చేసేవారిని కూడా చేయకుండా పనిచేసేవారు ప్రజాప్రతినిధులుగా ఉండటం పాపం. 

విశాఖలో క్యాపిటల్‌ వద్దన్నందుకు, శాశ్వతంగా శ్రీకాకాళం ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఉంచాలని కుట్ర చేస్తున్నందుకు, 23 కేంద్ర సంస్థల్లో ఒక్క సంస్థను శ్రీకాకుళంలో పెట్టనందుకు, మన ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిన అవసరం ఉందని ఊరూరా అందరూ చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top