శ్రీకాకుళం: ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలివిగా ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు అని, బాబు వస్తే ప్రజలకు బోడి గుండు తప్పదన్నారు. ప్రతిపక్షం, ఎల్లోమీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. శ్రీకాకుళం ఆనందమయి ఫంక్షన్ హాల్లో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడారంటే.. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి "గడిచిన మూడు సంవత్సరాలుగా అమ్మ ఒడి ఎంత మందికి అందింది? ఎంత మందికి రైతు భరోసా అందింది? ఈ ప్రభుత్వం మీకు ఏ మేరకు న్యాయం చేసింది.. ఏ మేరకు పథకాల అమలుకు కృషి చేస్తోంది అన్నవి వివరిస్తూ వెళ్లాలి. ఇది ఒక్క ఎమ్మెల్యేలు చేసే పని కాదు కార్యకర్తలు కూడా కదలి వస్తేనే సాధ్యం. వలంటీరుతో పాటు కార్యకర్త కూడా ఇంటింటికీ తిరిగితే సంక్షేమ పథకాలు అందాయా లేదా అన్నది తెలుసుకోవాలి. ఆ విధంగా 11వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఇంటింటికీ వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా రానున్న రెండు నెలల కాలంలో క్షేత్ర స్థాయిలో నిజానిజాల గుర్తింపు అనంతరం సమగ్ర సర్వే పూర్తవుతుంది. ఒక్కో గ్రామ సచివాలయ కేంద్రానికి ఒక్కో ఇంఛార్జ్ ను నియమించి పనిచేయాల్సి ఉంది. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో అవినీతిని నిలువరించాల్సి ఉంది. లబ్ధిదారుకే నేరుగా పథకాల ఫలాలు అందేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నాం వంటి వాస్తవిక విషయాలను గ్రామగ్రామాన తెలియజేయాలి." మహానేత మాదిరిగానే జననేత "ఎన్నికలు జరిగిన తర్వాత సుమారు 3 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము. వివిధ ప్రాంతాలకు సంబంధించి రీజనల్ కో - ఆర్డినేటర్లను, కొత్తగా ఏర్పాటయిన జిల్లాలకు సంబంధించి అధ్యక్షులను నియమించుకున్నాం. ప్రధానంగా సంక్షేమం పై దృష్టి పెట్టాం. నిష్పక్షపాతంగా అమలుచేశాం. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయంలో కూడా ఇలానే చేశారు. అందుకోసమే ఆయన రెండో సారి గెలిచారు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని అధిగమించేందుకు ఆ రోజు పార్టీ, కులం, మతం చూడకుండా సంక్షేమం అందించాం. నాటి వైయస్ఆర్ మాదిరిగానే నిస్పృహలో ఎవ్వరూ ఉండకూడదని పథకాలకు సంబంధించిన ఆర్థిక లబ్ధిని నేరుగానే అందిస్తున్నాం." "గత ప్రభుత్వంలో కలెక్టర్-కు దరఖాస్తు ఇచ్చినా సరే పనులు అయ్యేవి కావు. పథకాలు అందేవి కావు. ఊరిలో ఉన్న జన్మ భూమి కమిటీ సభ్యులు కలవమని చెప్పే వారు. వాటన్నింటినీ పక్కన పెట్టి అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నాం. విశాల భావజాలంతో, దృక్పథంతో పరిపాలన సాగిస్తున్నాం. వీటిని టీడీపీ కార్యకర్తలు అందుకుంటూ, విమర్శలు చేస్తున్నారు. వీటిని కార్యకర్తలు తిప్పికొట్టాలి. క్షేత్ర స్థాయిలో వాస్తవిక దృక్పథంను వివరిస్తూ, విపక్ష విష ప్రచారాన్ని ప్రతిఘటించాలి. కష్టపడి పనిచేసి, పార్టీకి అంకితం అయి ఉన్న ప్రతి కార్యకర్తనూ గౌరవిస్తాం.. అధైర్య పడవద్దు" అని అన్నారు. జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రీజనల్ కో-ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మంత్రి సిదిరి అప్పలరాజు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, ఎంఎల్సీలు దువ్వాడ శ్రీనివాసరావు, పాలవలస విక్రాంత్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు